ఈ డాక్టరు వ్యవసాయమూ చేస్తారు !

Dec 12,2023 10:48 #Jeevana Stories

వృత్తిరీత్యా ఆయన డాక్టరు. కానీ రైతుగా ఉండడమే ఆయనకిష్టం. కాస్త తీరిక దొరికితే ఆయనలో క్రీడాకారుడూ కనబడతాడు. ఇంకాస్త విరామం వస్తే, విభిన్న ప్రతిభావంతులు, పేదపిల్లలను చదివిస్తున్న సేవాతత్పరుడుగా దర్శనమిస్తాడు. వృత్తికి, అభిరుచులకు ఎక్కడా పొంతనే కనిపించని ఆ వైద్యుడు కర్నాటక గడగ్‌ ప్రాంతంలో ‘రేణుకా’ హాస్పటల్‌ నిర్వాహకుడిగా ఎందరికో సుపరిచితులు. సాధారణంగా వైద్యవృత్తిలో ఉన్నవారు ఇతర రంగాల వైపు దృష్టిమరల్చడం చాలా అరుదు. కానీ డాక్టర్‌ జిబి బిదిన్‌హాల్‌ మాత్రం వారికి భిన్నంగా జీవిస్తున్నారు. 68 ఏళ్ల వయసులో కూడా మెరుగైన సమాజ కోసం పరితపిస్తున్నారు.

హుబ్లీ, కిమ్స్‌లో ఎంబిబిఎస్‌, ఎంఎస్‌ చదివిన బిదిన్‌హాల్‌, వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వతహాగానే బిదిన్‌హాల్‌కి మట్టిపై ఎంతో ప్రేమ. అందుకే డాక్టరుగా బాధ్యతగా ఉంటూనే నేలతల్లికి తన వంతు సేవ చేస్తూ ఉంటారు. రోజుకు 25 నుండి 30 రోగులకు చికిత్స అందించే బిదిన్‌హాల్‌ పేదల దగ్గర నయాపైసా తీసుకోరు.

‘డాక్టరు గారు వైద్యం చేస్తున్నంత సేపు ఆయన ముఖంలో చిరునవ్వు తగ్గదు. నవ్వుతూనే మా రోగాన్ని పోగొడతారు. ఆ నవ్వు మాలో ఎక్కడలేని ధైర్యాన్ని నింపుతుంది’ అని ఆస్పత్రికి వచ్చిన రోగులు బిదిన్‌హాల్‌ గురించి గొప్పగా చెబుతారు. ‘మాకు వైద్యం చేసేటప్పుడు మమ్మల్ని ఆయన సొంత అన్నదమ్ముల్లాగా భావిస్తారు. ఆ ఆప్యాయత మమ్మల్ని రోగం నుంచి త్వరగా విముక్తులను చేస్తుంది’ అంటాడు అక్కడే ఉన్న మరో రోగి. ఇవన్నీ ఆయనలోని ప్రజా వైద్యుడ్ని మనకు పరిచయం చేస్తాయి. అలాగే, ఆయన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కావాల్సిన సామగ్రిని, విద్యకు అవసరమైన ఖర్చును భరిస్తారు. రోజూ ఉదయం పూట గడగ్‌ అవుట్‌డోర్‌ స్టేడియంలో ఓ గంట పాటు పరుగు ప్రాక్టీస్‌ చేస్తారు. పలు వాక్‌థాన్‌, మారాథాన్‌ పోటీల్లో పాల్గొంటారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్స్‌ నిర్వహించిన 100 మీటర్ల రిలే వాక్‌థాన్‌, 10 కిలోమీటర్ల మారాథాన్‌లో పాల్గొని, మొదటిస్థానంలో నిలిచారు. పొరుగు రాష్ట్రంలో తమ రాష్ట్ర గౌరవాన్ని పెంచిన, యువతలో గొప్ప క్రీడాస్ఫూర్తి కలిగించిన బిదిన్‌హాల్‌కి ‘గడగ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీస్‌’, నవంబరు 30న ‘క్రీడా శ్రీ’ అవార్డుతో సత్కరించింది.

వ్యవసాయ మూలాలున్న బిదిన్‌హాల్‌, ఎంఎస్‌ చేసినా వ్యవసాయం వదల్లేదు. పంటలు, మార్కెట్‌ ధరలపై ఎప్పుడూ విస్తృత అవగాహనతో ఉంటారు. ఎపిఎంసి (అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ)లో పంటల ధరల గురించి తెలుసుకొని, ఉత్తమ ధరలు అందించే విక్రయ స్థలాల సమాచారాన్ని రైతులకు అందిస్తారు. గతేడాది మిర్చి సాగు చేసి తీవ్ర నష్టాలు చూసిన రైతన్నలకు మంచి మార్కెట్‌ ధర పలికే విక్రయ స్థల సమాచారం చెప్పి, కాస్తంత ఊరట ఇచ్చారు. ‘బిదిన్‌హాల్‌ నాకు మూడు దశాబ్దాలుగా తెలుసు. ఆయన చాలా కష్టపడే వ్యక్తి. వైద్య వృత్తి కొనసాగిస్తూనే, క్రీడాకారుడిగా రాణిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. గడగ్‌ ప్రాంతం ఒక్కచోటే కాదు.. ఆయన దగ్గర వైద్యం చేయించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు వస్తారు’ అని శ్రీనివాస్‌ అనే గడగ్‌ ప్రాంత వాసి చెబుతున్నారు. ’68 ఏళ్ల వయసులో ఆయనలో గొప్ప వైద్యుడిని చూస్తాం. అదే సమయంలో ఆయనలో పొలంలో పనిచేసే రైతును కూడా కలుస్తాం. వ్యవసాయ పనులు చేసేటప్పుడు యువరైతులకు ఏమాత్రం తీసిపోని పనులు చేస్తారు. అథ్లెట్‌గా నాలుగు బంగారు పతకాలు సాధించారు.’ అని విశ్రాంత ప్రొఫెసర్‌ శరణబసవ తన ఈడు వాడైన బిదిన్‌హాల్‌ గురించి గొప్పగా అంటున్నారు.

‘రైతు కుటుంబంలో పెరిగిన నాకు మనసంతా వ్యవసాయమే నిండిపోయింది. పొలంలో పనిచేస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది. నా పొలంలో మిరప, మిరియాలు, ఉల్లిపాయలు, పత్తి పండిస్తాను. నా తల్లిదండ్రుల వృత్తిని వదిలిపెట్టకుండా, వైద్యుడిగా నా వృత్తిధర్మం నెరవేరుస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు అండగా ఉన్న వారందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని’ అంటూ నిగర్విగా మాట్లాడుతున్న బిదిన్‌హాల్‌ వంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు.

➡️