విరబూసిన తెలుగు ‘పద్మా’లు

Jan 27,2024 09:59 #feature

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో తెలుగురాష్ట్రాల నుండి 8 మంది ఎంపికయ్యారు. ప్రజా వ్యవహారాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు, కళారంగంలో విశిష్ట సేవలందించినందుకు చిరంజీవికి ‘పద్మవిభూషణ్‌’ వరించింది. తెలంగాణలో ఐదుగురికి, ఏపీలో ఒకరికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, శిల్పకళాకారుడు వేణు ఆనందాచారి, సాహిత్య కారులు కేతావత్‌ సోమ్‌ లాల్‌, కూరెళ్ల విఠలాచార్య తెలంగాణ నుండి పద్మశ్రీకి ఎంపికయ్యారు. మన రాష్ట్రం నుండి హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి పద్మశ్రీ అందుకున్నారు.

‘హరికథ’కు ఉమామహేశ్వరి వెలుగులు

               కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పుట్టిన దాలిపర్తి ఉమామహేశ్వరిని పద్మపురస్కారం వరించింది. దేశంలోనే ఏకైక సంస్కృత కథా కళాకారిణిగా ఆమె ప్రసిద్ధి చెందారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల్లోనూ ఆమె హరికథా ప్రదర్శనలిచ్చారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డును బహూకరించింది. ఆమె తల్లి సరోజని కూడా గాయని. ఆమె తండ్రి దాలిపర్తి లాలాజీరావు వేములవాడలోని రాజరాజేశ్వరి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా మూడు దశాబ్ధాలకుపైగా పనిచేశారు. ఉమామహేశ్వరి పదోతరగతి వరకూ చదువుకున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలోని శ్రీ సర్వారాయ హరికథా గురుకులంలో 14 ఏళ్ల ప్రాయంలోనే చేరారు. విజయనగరం సంస్కృత కళాశాలలో ‘రుక్మిణి కల్యాణం హరికథా గానం’ తొలి ప్రదర్శనను ఇచ్చారు.

అ’ద్వితీయ పురస్కారం

                  తెలుగు సినిమా చరిత్రలో 2011లో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత 2024లో కొణిదెల చిరంజీవి పద్మవిభూషణ్‌ను దక్కించుకున్నారు. మెగాస్టార్‌గా తన 67 ఏళ్ల సినీ జీవితంలో 155 సినిమాల్లో నటించారు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అప్పటి కేంద్రప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌ అవార్డు ఇచ్చింది. 2016లో రఘుపతి వెంకయ్య అవార్డుతో ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. 2006లో ఆంధ్రా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 1987లో దక్షిణ భారతదేశం నుంచి ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి.

ప్రజావ్యవహారాల్లో …

               ప్రజా వ్యవహారాల్లో విశేష కృషి చేసినందుకు రాష్ట్రానికి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మ విభూషణ్‌ దక్కింది. నెల్లూరు జిల్లా చవటపాలెం ఆయన స్వగ్రామం. 1998 నుంచి 2017లో ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టే వరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనా స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

తెలంగాణ ‘పద్మ’లు

వారసత్వ కళలో : బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పది పేదరిక కుటుంబం. వారసత్వంగా వచ్చిన కళను వదిలిపెట్టకుండా వ్యాప్తి చేస్తున్నారు. ఈయన స్వస్థలం నారాయణ పేట జిల్లా దామర గిద్ద. పౌరాణిక గాథలను వీణపై వాయిస్తూ చెప్పే కళాకారుల్లో ప్రస్తుతం ఈయనొక్కరే మిగిలిఉన్నారు. గతంలో దూరదర్శన్‌లో ప్రదర్శనలిచ్చారు. వెదురు, పొట్లకాయ పెంకు, లోహపు తీగలతో బుర్రవీణను ఆయనే స్వయంగా తయారుచేసుకుంటారు. ‘బలగం’ చిత్రంలో ‘అయ్యే శివుడా ఏమాయే’ అనే పాటను ఆలపించిన గాయకులలో కొండప్ప ఒకరు. కొంతకాలం క్రితం మహాబూబ్‌నగర్‌ కస్తుర్బా పాఠశాల విద్యార్థులకు బుర్ర వీణపై శిక్షణ కూడా ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారికి ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నారు. కూలీనాలీ చేసుకునే కొండప్ప అడపాదడపా, పండగకు పబ్బాలకు బుర్రవీణ వాయిస్తూ రోజులు వెల్లదీస్తున్నారు.

కళా సేవలో : చిందు యక్షగానంలో పేరొందిన సమ్మయ్య(62) గొప్ప కళా తృష్ణ ఉన్న వ్యక్తి. కళను బతికించుకోవడం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. ఈయన స్వస్థలం జనగామ జిల్లా దేవురుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సమ్మయ్యకి తండ్రి నుండి ఈ కళ ఒంటబట్టింది. 12వ ఏట నుండే కళా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన సమ్మయ్య ఈ ఐదు దశాబ్దాల్లో 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. యక్షగాన కళతో పౌరాణిక ఇతివృత్తాలే కాక సామాజిక అంశాలపై కూడా ప్రజల్లో అవగాహన తేవడం సమ్మయ్య ప్రత్యేకత. అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణపై పాటలు, పద్యాలతో ప్రేక్షకులను చైతన్యం చేసేవారు. ‘చిందు యక్ష కళాకారుల సంఘం’, ‘గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం’ వంటి కళాక్షేత్రాలు స్థాపించి కళను సజీవంగా ఉంచుతున్నారు. సమ్మయ్య భార్య శ్రీరంజిని కూడా యక్షగానం ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటీవల అయోధ్యలో జరిగిన రామ్‌లల్లా ప్రతిష్ట సందర్భంగా సమ్మయ్య ఐదు ప్రదర్శనలు ఇచ్చారు.

సాహిత్యకృషిలో : రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరయోధుడిగా ఖ్యాతి గడించిన కూరెళ్ల గురించి తెలియని వారుండరు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన కవి, రచయిత, సామాజికవేత్త అయిన డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య సాహిత్యమే ఊపిరిగా జీవిస్తున్నారు. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. సుమారు రెండు లక్షల పుస్తకాలతో తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఎన్నో విలువైన పుస్తకాలు, గ్రంథాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక్కడ పరిశోధనలు చేసిన 8 మంది విద్యార్థులు పిహెచ్‌డి సాధించడంలోనే ఈ గ్రంథాలయ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.

శిల్ప కళలో : డాక్టర్‌ వేలుగా ప్రసిద్ధిగాంచిన ఆనందాచారి(72) శిల్ప కళలో నిష్ణాతునిగా పేరుగాంచారు. ఈయన స్వస్థలం చిత్తూరుజిల్లా వెన్నంపల్లి. ఆ తరువాత వీరి కుటుంబం తెలంగాణలో స్థిరపడింది. శిల్ప కళ ద్వారా ఆలయ నిర్మాణాల పర్యవేక్షణ, పురాతన శిల్ప నమూనాలను యథావిధిగా నిర్మించడం ఈయన ప్రత్యేకత. తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖలో స్థపతిగా వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తించారు. 2010లో పదవీ విరమణ పొందిన తరువాత కూడా శిల్ప కళకు సంబంధించి పలు ప్రాజెక్టుల్లో సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన ఔషధాలతో రంగులు తయారీ, ఔషధాలతో వర్ణ చిత్రాలు వేయడం అనే నూతన ప్రక్రియ ద్వారా చిత్రాలు గీసి, అనేక అవార్డులు, ప్రశంసాపత్రాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల పునర్నిర్మాణ, జీర్ణోద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

భాషాభిమాని : బంజారా భాషలోకి భగవద్గీతను అనువాదం చేసిన భాషా ప్రేమికుడు కేతావత్‌ సోమ్‌ లాల్‌. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావి తండాకు చెందిన సోమ్‌ లాల్‌ బ్యాంకు ఉద్యోగి. ఉద్యోగ విరమణ తరువాత సాహిత్యరంగం వైపు అడుగులు వేశారు. బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశారు. 1989లో భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించినా దాన్ని అచ్చు వేయడానికి 35 ఏళ్లు పట్టింది. 2014లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ గ్రంథాన్ని ప్రచురించింది. సాహిత్యం, కళా రంగాల్లో విశేష సేవ చేసినందుకు వీరందరికీ ఈ ఏడాది ‘పద్మ శ్రీ’ పురస్కారాలు లభించాయి.

➡️