‘మనసున మనసై …

world marriage day story

(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)

‘మనసున మనసై బ్రతుకున బ్రతుకైమనసున మనసై బ్రతుకున బ్రతుకైతోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము’ భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని తెలియజేస్తూ ‘డాక్టర్‌ చక్రవర్తి’ సినిమాలో శ్రీశ్రీ రాసిన పాటను ఘంటసాల వెంకటేశ్వరరావు ఎంతో చక్కగా స్వరపర్చారు. పెళ్లి అనేది భార్యాభర్తల మధ్య ఒక పటిష్టమైన బంధం. ఈ బంధం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, తోడూ నీడగా ఉంటూ సాగిపోవాలని, అంతకుమించిన సంపదా, సంతోషమూ మరొకటి ఉండవని ఈ పాట ద్వారా తెలియజెప్పారు.

మనం కన్నవాళ్లు, మనల్ని కన్నవాళ్లూ శాశ్వతంగా మన దగ్గరే ఉండరు. భార్య లేదా భర్త మాత్రమే కష్టసుఖాల్లో తోడుంటారు. నిత్యం తోడుంటారు. అప్పడప్పుడు మనస్పర్థలు వచ్చినా కలిసి చర్చించుకోవాలి. సజావుగా పరిష్కరించుకోవాలి. ‘నేనున్నానని.. నీకేం కాదని’ అనే భరోసా పరస్పం ఇచ్చి పుచ్చుకోవాలి.

జీవితంలో కష్టాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా… భార్య భర్త ఇరువురు పరస్పరం సాయం చేసుకుంటూ ముందుకు సాగుతుంటే పిల్లలు, ఆయా కుటుంబాలు ఎంతో సంతోషదాయకంగా ముందుకు సాగుతుంటాయి.

ప్రతిఒక్కరూ తమ జీవితానికి ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా, భవిష్యత్తులో తోడుగా ఉంటారనే భావనతో ‘పెళ్లి’ అనే పక్రియ ద్వారా కుటుంబ వ్యవస్థలోకి అడుగు పెడతారు. ఏ పద్ధతిలో పెళ్లి జరిగినా ఇద్దరు కలిసి జీవించటమే దాని సారాంశం. భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర సహకారంతో గౌరవ భావంతో కొనసాగిస్తే జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఒక తంతు అయితే, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మరో తంతుగా సాగుతుంటాయి. ఇవి కాకుండా ఆచారాల పేరుతోనూ, మతాలపేరుతోనూ, కులాలవారీగా కూడా వివిధ పద్ధతుల్లో వివాహ క్రతువులు జరుగుతుంటాయి. నేడు పెళ్లిళ్ల ట్రెండ్‌ ప్రపంచ వ్యాప్తంగా మారిపోయింది. ఉద్యోగమో, వ్యాపారమో, ఇతరత్రా వృత్తుల్లోనో, పని ప్రదేశాల్లో ఏర్పడిన పరిచయాలతో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడివారైనా ఎక్కడివారినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటుండటం తెలిసిందే.

కుటుంబ వ్యవస్థ బలోపేతానికి దోహదం

వివాహంతో ప్రతి మనిషికీ కొత్త జీవితం ఏర్పడుతుంది. భిన్న కుటుంబ నేపథ్యాలకు చెందిన ఇద్దరు ఒక్కటిగా చేరి సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వేర్వేరు నేపథ్యాల వల్ల, వేర్వేరు అవగాహనల వల్ల ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం, అభిరుచీ ఉండొచ్చు. అది చాలా సహజం. ఒకే జంటగా బతుకుతున్నప్పుడు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి ఇష్టాఇష్టాలను మరొకరు పట్టించుకోవాలి. ఒకరి మాటే చెల్లుబాటు కావాలనుకోవటం సమాన భాగస్వామ్యం అవదు. పనుల్లోనూ ఒకరికొకరు సాయంగా సాగిపోవాలి. అనవసర గొడవలకు పోతే చేదు జ్ఞాపకాలే మిగులుతాయి. ట్రెండ్‌ల పేరుతో సర్దుకుపోయే తత్వాన్ని మరిచిపోయి మనుషులను దూరం చేసుకోవద్దు. సినిమాల ప్రభావం, పెరుగుతున్న వినిమయ సంస్క ృతి ప్రభావంలో పడకుండా జాగత్తగా ఉండాలి. చదువు, హోదా, సౌకర్యాలు, పేరుతో ఆలోచనల్లో మార్పులు సహజమే. అనుమానాలు, కలతలు, మనస్పర్ధలు వచ్చినా నిరంతరం చర్చించుకుంటుంటే అన్నీ సర్దుకుపోతాయి. అప్పుడే ఎలాంటి భార్యాభర్తలు జీవితాంతం తోడునీడగా సాగిపోతారు.

దాంపత్య బంధం నిలబడాలంటే…

పెళ్లి తంతు ఏ విధంగా జరిగినా ఆ బంధం కలకాలం నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

  • పరస్పర గౌరవం అవసరం
  • ఇంటి పనుల్లో, బయటి పనుల్లో భాగస్వామ్యం కావాలి.
  • సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలి.
  • ఇద్దరూ సమానం అనే భావన పెంపొందించుకోవాలి.
  • పిల్లలతో సఖ్యతగా మెలగాలి. సామరస్యం కూర్చుని మాట్లాడుకోవాలి.
  • ఒకరికోసం ఒకరు తగిన సమయాన్ని కేటాయించుకోవాలి.
  • మిగతా కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపాలి.
  • ఇరు కుటుంబాల వారితోనూ మంచిగా మెలగాలి.
  • ఆర్థిక విషయాల్లో దాపరికం లేకుండా ఉండాలి.
  • ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా వ్యవహరించాలి.
  • సామాజిక సేవలోనూ, బాధ్యతల్లోనూ కలిసి పాలుపంచుకోవాలి.
  • చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఉన్న ఉమ్మడి అవగాహన కూడా భాగస్వామ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది.
  • మానవ సంబంధాలకు విలువనివ్వాలి.

ఈ జాగ్రత్తలు కూడా అవసరమే…

  • సంసారంలో ఆలూమగల మధ్య అలకలు సహజమే.
  • గొడవపడితే ఇంటి వాతావరణమే మారిపోతుంది.
  • చిర్రుబుర్రులాడితే వాటి ఉద్వేగాలు, ఇతర పనులపై ప్రభావం చూపిస్తాయి.
  • ఒకరిపై ఒకరి ఆంక్షలు, ఆజమాయిషీ వద్దు అలుసుగా మాట్లాడొద్దు.
  • సామరస్యంగా మాట్లాడుకుంటే సమస్యలకు సర్దుబాట్లతో సరి!
  • సమస్యలేమైనా కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది.
  • అభిప్రాయాలు స్పష్టంగా, సూటిగా చెప్పాలి. కోపతాపాలకు లోనయితే, అసలు విషయాలు పక్కకి పోతాయి.
  • లోపాలు గుర్తిస్తే సర్దుబాటు చేసే ప్రయత్నాలు మేలు.
➡️