రేపటితో ప్రచారం సమాప్తం

May 10,2024 00:31 #election

– నేడు విజయవాడలో ఇండియా ఫోరమ్‌ బహిరంగసభ
-ఐదు నియోజకవర్గాల్లో పర్యటించనున్న బాబు
-పిఠాపురంలో సిఎం జగన్‌ చివరి సభ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మండుటెండల్లో రాష్ట్రాన్ని మరింత హీటెక్కించిన ప్రచార పర్వానికి రేపటితో తెరపడనుంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని ముగించాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 16వ తేదీన విడుదల కాగా, అంతకు ముందు నుండే రాష్ట్రంలో ప్రచారం పోటాపోటీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇంత సుదీర్ఘ కాలం గతంలో ఎప్పుడూ ఎన్నికల ప్రచారం జరగలేదని పరిశీలకులు చెబుతున్నారు. మరి కొన్ని గంటల్లో ప్రచార పర్వం ముగియనుండటంలో పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం మంగళగిరి, నగరి, కడప నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రచారానికి చివరిరోజైన శనివారం ఉదయం చిలకలూరిపేట, మధ్యాహ్నం కైకలూరులో పర్యటించి చివరి ప్రచార సభను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీచేస్తున్న పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఈ సభలు నిర్వహించనున్నారు. ప్రచారాల చివరి రోజు మరో మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా విస్తృతంగా పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇండియా ఫోరమ్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు శుక్రవారం సాయంత్రం విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో జరగనున్న భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు.

➡️