మీ ఓటు వేరేవాళ్లు వేసేశారా?..

May 10,2024 23:36 #election

పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయొచ్చు
మీరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేసరికే మీ ఓటు అప్పటికే వేరేవాళ్లు వేసేశారా? అయితే మీరు మీ ఓటు వేయలేకపోయామని చింతించాల్సిన అవసరం లేదు. మీరు మళ్లీ మీ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇవిఎం ద్వారా కాకుండా.. పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా మీరు మీ అభ్యర్థికి ఓటు వేయొచ్చు. మీ ఓటును వేరేవాళ్లు వేశారు అని మీకు తెలిసిన వెంటనే.. ప్రత్యేక ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి.. ఓటరు బ్యాలెట్‌ పత్రాన్ని తీసుకెళ్లి, ఓటేయదలచిన అభ్యర్థి ఎన్నికల గుర్తుపై స్వస్తిక్‌ ముద్రను వేయాలి. మీరు ఓటు ఎవరికి వేశారో బయటకు తెలియకుండా ఆ బ్యాలెట్‌ పత్రాన్ని మడిచి కంపార్ట్‌మెంట్‌ బయటకి వచ్చి ప్రిసైడింగ్‌ అధికారికి అదజేయాలి. ఆ బ్యాలెట్‌ పత్రాన్ని టెండర్‌ ఓటుగా ప్రిసైడింగ్‌ అధికారి మార్క్‌ చేసి ప్రత్యేక ఎన్వలప్‌లో వేరుగా ఉంచుతారు. టెండర్‌ బ్యాలెట్‌ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్‌ అధికారులు ఫారం – 17 బిలో రికార్డు చేస్తారు. దొంగ ఓటరు అని అభ్యర్థి తరపు ఏజెంట్లకు అనుమానమొస్తే.. రెండు రూపాయలు చెల్లించి సవాల్‌ చేయవచ్చు. అప్పుడు ఆ ఓటరు గుర్తింపు నిర్థారించడానికి ప్రిసైడింగ్‌ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్థారణ జరిగితే ఓటేసెందుకు వారికి అవకాశం కల్పిస్తారు. లేకపోతే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్‌ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తారు.

➡️