అరకులో ముక్కోణపు పోటీ

May 10,2024 23:59 #Araku

– ఏజెన్సీ అంతటా అప్పలనర్సకు ఆదరణ
– కొత్తపల్లి గీతకు బుద్ధిచెబుతామంటున్న ఆదివాసీలు
-వైసిపి అభ్యర్థి చుట్టూ ప్రతికూలాంశాలు

ప్రజాశక్తి – అరకులోయ, పాడేరు విలేకరులు :దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన అరకు పార్లమెంటు స్థానంలో రసవత్తర పోటీ నెలకొంది. వైసిపి, బిజెపి, సిపిఎం అభ్యర్థుల మధ్య జరిగే ఈ పార్లమెంటు పోరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం ఎస్‌టిలకు రిజర్వు చేయబడింది. దీనిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం మన్యం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడి ఉన్న ఈ ఎంపి స్థానంపై నేడు అందరి దృష్టీ పడింది. ఇక్కడి నుంచి వైసిపి ఎంపి అభ్యర్థిగా గుమ్మ తనూజరాణి, బిజెపి అభ్యర్థిగా కొత్తపల్లి గీత, సిపిఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స బరిలో ఉన్నారు. టిడిపి, జనసేన బిజెపి కూటమి నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసిపి నుంచి అరకు ప్రస్తుత ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు డాక్టర్‌ గుమ్మ తనూజరాణి బరిలో ఉన్నారు. ఆమెను చాలా ప్రతికూలాంశాలు వెంటాడుతున్నాయి. రాజకీయాలకు కొత్త కావడం, ఆదివాసీల సమస్యలపై అవగాహన కొరవడటం, వైసిపి ప్రభుత్వంపై ఆదివాసీల్లో ఉన్న వ్యతిరేకత ఆమె విజయావకాశాలపై ప్రభావం చూపనున్నాయి. సిపిఎం అభ్యర్థిగా బరిలో ఉన్న పి అప్పలనర్స అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచీ ఆయన ఉద్యమాల్లో ఉండటంతో ఈ ప్రాంతంలో ఆయనంటే తెలియనివారు లేరు. గిరిజన హక్కులపై ఆయన గట్టిగా గళమెత్తుతారన్న నమ్మకం ఆదివాసీల్లో ఉంది. సిపిఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, బృందాకరత్‌, వి శ్రీనివాసరావు, పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటివారు అప్పలనర్సకు మద్దతుగా ఏజెన్సీలో చేపట్టిన ప్రచారం కలిసిరానుంది. ముఖ్యనేతలంతా ఏజెన్సీలో పర్యటించిన క్రమంలో ఇండియా బ్లాక్‌లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. కేంద్ర మాజీ మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ కూడా బహిరంగంగా అప్పలనర్సకు మద్దతు తెలపడం సానుకూల అంశమని పలువురు భావిస్తున్నారు.
అందరి చూపూ.. అప్పలనర్స వైపు..

ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స వైపు ఇప్పుడు అందరి చూపూ ఉంది. కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ఆద్మీ, పలు గిరిజన సంఘాల మద్దతు ఆయనకుంది. ఆయన ప్రస్తుతం సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శిగా, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యునిగా, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పోరాటాల్లో మమేకమయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 2008లో విద్యార్థుల మెస్‌ ఛార్జీలు పెంపుదల కోసం నాటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏడు రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. 2011 నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజనోద్యమాలకు నాయకత్వం వహిస్తూ వచ్చారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతమంతటా విస్తృతంగా పర్యటించారు. పోలవరం నిర్వాసితుల పక్షాన నిలిచారు. తన ఉద్యమ ప్రస్థానంలో 15 రోజులపాటు జైలు జీవితం గడిపారు. 2013లో హుకుంపేట మండలంలో ఆదివాసీలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్వహించిన భూ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఆదివాసీలకు స్పెషల్‌ డిఎస్‌సి నిర్వహించాలని 2010 నుంచి నేటి వరకూ ఉద్యమాలు నడుపుతూ వస్తున్నారు. పారా మెడికల్‌ సిబ్బంది సమస్యలపైనా, సిహెచ్‌డబ్ల్యుల సమస్యలపైనా ఉద్యమించారు. బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ పోరాటాలు చేపట్టారు. బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. కాఫీ రైతులు, మాతృభాషా వాలంటీర్ల సమస్యలపైనా ఉద్యమించారు. జిఓ 3 పునరుద్ధరణ కోసం న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ఆదివాసీలకు అండగా నిలుస్తున్న సిపిఎంను గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తున్న తీరు పలువురిని ఆకట్టుకుంటోంది.

గీతకు గడ్డు కాలమే

బిజెపి ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఏజెన్సీ అంతటా గడ్డు పరిస్థితులే కనిపి స్తున్నాయి. ఖుష్భూ వంటి సినీతారలను ప్రచారానికి తీసుకొచ్చి హడావుడి చేసినా గీతను ఆదరించేవారే కరువయ్యారు. ఆమె నకిలీ ఎస్‌టి అన్న ప్రచారం ఏజెన్సీ అంతటా ఉంది. ఆ కుల వివాదంలో చిక్కుకొని హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఎస్‌టిగా కొనసాగుతుండడంతో కూటమి నేతలు, కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొంది. పలు గ్రామాల్లోని టిడిపి కార్యకర్తలు ఆమెతో ప్రచారానికి సైతం వెళ్లని పరిస్థితులు ఉన్నాయి. దీంతోపాటు ఆమె 2014 నుంచి 2019 వరకు అరకు వైసిపి ఎంపిగా కొనసాగిన కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏమాత్రమూ పట్టించుకోలేదు. బ్యాంకులను మోసం చేసిన కేసులో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె వైసిపి నుంచి బిజెపిలోకి జంప్‌ అయ్యి ఆ పార్టీ తరపున బరిలో ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు మారుతూ వస్తున్న ఆమెను ఎవరూ విశ్వసించడం లేదు. గడిచిన ఐదేళ్లలో ఆమె ఏ ఒక్క గిరిజన సమస్యపైనా మాట్లాడలేదు. ఇటీవల టిడిపి నేతలు నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ పలువురు నేతలు బిజెపికి ఓటు వేసేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు వారంతా ఎటువైపు పనిచేస్తారన్న ఆసక్తి నెలకొంది.

వైసిపి అభ్యర్థి ప్రచారంలోనూ డల్‌

వైసిపి ఎంపి అభ్యర్థి తనూజరాణి ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ రాజకీయాలకు కొత్త. ఈ ప్రాంత సమస్యలపై ఆమెకు అవగాహన లేదు. వైసిపి ప్రభుత్వం తీసుకున్న గిరిజన వ్యతిరేక నిర్ణయాలు ఆమెకు ప్రతికూలంగా మారనున్నాయి. ఆమె ఎన్నికల ప్రచారంలోనూ వెనుకబడ్డారు.

➡️