బొనైలో తిరుగులేని సిపిఎం

May 3,2024 03:21 #Bonai, #cpm, #Unstoppable
  •  ఎమ్మెల్యేగా లక్ష్మణ ముండా మూడు సార్లు ఎన్నిక
  •  ఒడిశా అసెంబ్లీలో ఒకే ఒక్కడు
  •  నాల్గవసారి పోటీ

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : ఒడిశా రాష్ట్రం సుందర్‌ఘర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఎస్‌టి రిజర్వుడు స్థానమైన బొనైకి ఒక ప్రత్యేకత ఉంది. ఒడిశాను సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఏలుతూ తిరుగులేని బిజెడి (బిజూ జనతాదళ్‌)కి అక్కడ మాత్రం పట్టు దొరకడం లేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ సీటును గెలుచుకోలేకపోయింది. మరోవైపు అత్యధిక సార్లు గెలుపొందిన బిజెపి తిరిగి దక్కించుకోవడం సాధ్యపడడం లేదు. బిజెపి ఈ స్థానంలో 1990, 1995, 2000, 2009 ఎన్నికల్లో గెలుపొందింది. ఈ నియోజకవర్గం నుంచి సిపిఎం మూడు సార్లు విజయం సాధించింది. 2004, 2014, 2019 ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. 2009 ఎన్నికల్లో మాత్రం 3,356 ఓట్ల స్వల్ప తేడాతో సీటును కోల్పోయింది. రాష్ట్ర అసెంబ్లీలో ఏకైక సిపిఎం ఎమ్మెల్యేగా లక్ష్మణ్‌ముండా ఉన్నారు. రెండో దశలో వచ్చే నెల 20న జరగనున్న ఎన్నికల్లో ఈ స్థానం నుంచిమళ్లీ ఆయనే బరిలో దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ కొట్టే దిశగా ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నారు.

బొనై ప్రత్యేకత ఏమిటి?
ఒడిశాలోని మారుమూల నియోజకవర్గమైన బొనైలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2,15,736 జనాభా ఉంది. ఇందులో సుమారుగా 56 శాతం ఎస్‌టి జనాభా ఉంది. మొత్తం జనాభాలో 47శాతం ఉద్యోగులు, సాధారణ కార్మికులు ఉన్నారు. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం కాగా, అధికశాతం మంది కార్మికులు నియోజకవర్గంలో ఉన్న కాల్టా మైనింగ్‌లో పనిచేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన ఇక్కడ నిరక్షరాస్యత, నిరుద్యోగం, అటవీ హక్కుల చట్టం సరిగా అమలు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ నుంచి బిజెపి తరుపున రెండు పర్యాయాలు ఎన్నికైన జూయల్‌ ఓరమ్‌ ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎంపీ, మంత్రిగా గెలిచినా ఇక్కడ ప్రజల బతుకుల్లో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. అప్పటికే ఆ ప్రాంతంలో సిపిఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే లక్ష్మణ ముండా సిపిఎం సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరి గిరిజనులు, కార్మికుల సమస్యలు, రైతుల సమస్యలపై సమిష్టి పోరు సాగించారు. ప్రజలతో ముడిపడి, ముందుకొచ్చే ప్రతి అంశంపై పోరాటం సాగించారు. దీంతో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం తరుపున పోటీ చేసిన లక్ష్మణ్‌ముండాకు అక్కడ ప్రజలు పట్టం కట్టారు.

రోడ్లు లేని పరిస్థితి నుంచి అభివృద్ధి వైపుగా అడుగులు
ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో బిజెడి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో, రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇంటి ముందే నిరాహార దీక్షకు సైతం దిగారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక పోరాటాలు సాగించిన తర్వాత అధికారులు డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ నుంచి నిధులు మంజూరు చేయడం ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.700 కోట్లతో ప్రతి గ్రామానికి రక్షిత నీటిని అందించారు. చాలా గ్రామాల్లో సోలార్‌ వాటర్‌ పంపులు ఏర్పాటు చేశారు. ఆందోళనల ఫలితంగా నియోజకవర్గంలో రుకుండా డ్యామ్‌ ప్రారంభించడంతో 74 గ్రామాలకు తాగునీరు అందే అవకాశం ఏర్పడింది. బొనై ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటైంది. బ్రహ్మణి నదిపై వంతెన ఏర్పాటు కావడంతో బొనై, లాహునిపారా గ్రామాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజ్‌, పూర్తిస్థాయిలో గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడం వంటి అపరిష్కృత సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటి కోసం సిపిఎం అనేక పోరాటాలు సాగిస్తూనే ఉంది.

బొనైలో ప్రస్తుత పరిస్థితి
బొనాయి అసెంబ్లీ నియోజకవర్గంలో 2.27 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో సిపిఎం తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ ముండా పోటీ చేస్తుండగా, బిజెపి నుంచి సేబాతి నాయక్‌ పోటీ పడుతున్నారు. బిజెడి నుంచి భీమ్‌సేన్‌ చౌదరి బరిలో ఉన్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ పోటీ చేయకుండా సిపిఎంకు మద్దతు పలుకుతోంది. అందుకు ప్రతిగా సుందర్‌ఘర్‌ పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్ధికి సిపిఎం మద్దతిస్తోంది. ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని బిజెపి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో లక్ష్మణ్‌ ముండా 22,673 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అంత వ్యత్యాసాన్ని భర్తీ చేయడం సులువు కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతోపాటు నియోజకవర్గంలోని నాలుగు సమితులకు గానూ మూటింటిలో సిపిఎం అధీనంలోనే ఉండగా, జిల్లాపరిషత్‌ మెంబరు కూడా సిపిఎం వారే ఉన్నారు.

కలిసొచ్చిన సిఐటియు, ఆదివాసీ పోరాటాలు
బొనై నియోజకవర్గం సిపిఎంకు కంచుకోటగా మారడంలో సిఐటియు, ఆదివాసీ పోరాటాలు కలిసొచ్చాయి. ఇక్కడ సిఐటియుకు బలమైన ఓటింగ్‌ ఉంది. ఒక్కో బ్లాకులో 20 వేల మంది చొప్పున మూడు బ్లాకుల్లో ఉన్నారు. వీరితోపాటు ఆదివాసీలు ప్రత్యేకించి క్రిస్టియన్‌ ఓటర్లూ సిపిఎంనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఇక్కడి కల్టా, బొర్సవా, తల్ది ఓర్‌లో పనిచేస్తున్న సుమారు ఐదు వేల మంది కార్మికుల కోసం సిఐటియు సాగించిన పోరాటాలతో వారి మద్ధతు సిపిఎంకే లభిస్తోంది. భీమ్లాగూడ, రాక్సీ, రంగర పొటాసాయి, చందీపోస్టు, బర్షాను తదితర రైల్వే లోడింగ్‌ యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులు సిపిఎం వెన్నంటే ఉన్నారు. ఎన్నికల సమయంలో వీరంతా సిపిఎం తరుపున పనిచేయడంతో, విజయం సాధించగలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

➡️