గాజా పునర్నిర్మాణానికి 4వేల కోట్ల డాలర్లు!

  •  రఫాపై దాడి చేస్తే వేల సంఖ్యలో ప్రాణాలకు ముప్పు!
  •  ఐక్యరాజ్య సమితి సంస్థ హెచ్చరిక

గాజా : రఫా నగరంపై మిలటరీ దాడితో ముందుకెళ్లవద్దని అంతర్జాతీయంగా విజ్ఞప్తులు వచ్చినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా దాడి చేస్తామని ఇజ్రాయిల్‌ చెబుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో దాడి జరిగితే వేల సంఖ్యలో పాలస్తీనియన్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఒసిహెచ్‌ఎ) హెచ్చరించింది. రఫాలోని ఒక ఇంటిపై మిలటరీ బాంబు దాడి చేయడంతో నలుగురు పిల్లలు సహా ఏడుగురు మరణించారు. గత 24గంటల్లో ఇజ్రాయిల్‌ దాడుల్లో 26మంది మరణించగా, 51మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడు మాసాలుగా ముమ్మరంగా సాగిస్తున్న యుద్ధంతో తీవ్ర విధ్వంసాన్ని చవి చూసిన గాజాను పునర్నిర్మించాలంటే దాదాపు 4వేల కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుండి ఇప్పటివరకు ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో పునర్‌ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం వుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అనూహ్యమైన రీతిలో మానవ నష్టంతోపాటు ఆర్థిక నష్టం కూడా అదే స్థాయిలో వుందని పేర్కొంది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో 34,622మంది పాలస్తీనియన్లు మరణించగా, 77,867మంది గాయపడ్డారు.

నెతన్యాహునే అడ్డంకి : హమాస్‌
కాల్పుల విరమణ కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రధాన అవరోధంగా నిలిచిందని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహునే అని హమాస్‌ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రఫాపై దాడి చేసి తీరుతామని పదే పదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒప్పందం కుదిరే అవకాశాలను భగం చేయాలన్నదే వారి లక్ష్యంగా వున్నట్లు కనిపిస్తోందన్నారు. గత చర్చలు, సంప్రదింపులన్నింటిలోనూ నెతన్యాహునే ప్రధాన అవరోధకుడిగా నిలిచారని అన్నారు.

కైరోకు హమాస్‌ బృందం
కాల్పుల విరమణపై చర్చల కోసం ఈజిప్ట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపుతున్నట్లు హమాస్‌ గురువారం తెలిపింది. ఎలాగైనా ఒక ఒప్పందాన్ని కుదర్చాలని అంతర్జాతీయ మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక కొత్త పరిణామం. నెలల తరబడి చర్చలు మొదలు కావడం, నిలిచిపోవడంతో కాల్పుల విరమణ ప్రయత్నాలు ఒక కీలకమైన దశకు చేరుకున్నాయి.
ఇటీవలి రోజుల్లో ఏదో కాస్త రాజీ కుదురుతుందని కనిపించినా, ఇజ్రాయిల్‌ యుద్ధం ముగించాలన్న కీలక డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో ఒప్పందం కుదిరే అవకాశాలు మృగ్యమయ్యాయి. ఒప్పందం దిశగా కృషిచేయాలన్న లక్ష్యంతోనే ప్రస్తుత చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని కోరుకుంటున్నామని, అందుకే కైరోకు ప్రతినిధి బృందాన్ని పంపుతున్నామని హమాస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

రఫా కోసం డబ్ల్యుహెచ్‌ఓ తాత్కాలిక ప్రణాళిక
రఫా నగరంపై మిలటరీ దాడి జరిగిన పక్షంలో స్పందించేందుకు తాము ఒక తాత్కాలిక ప్రణాళికను రూపొందించామని, మృతుల సంఖ్య గణనీయంగా పెరగకుండా నివారించేందుకు ఈ ప్రణాళిక సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి తెలిపారు. తమ ప్రణాళిక కేవలం ‘బ్యాండ్‌ ఎయిడ్‌’ వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. మిలటరీ ఆపరేషన్‌ వల్ల ఎదురయ్యే మరణాలను ఇది పూర్తిగా నివారించలేదన్నారు.

➡️