నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. మార్కాపురంలో47.1 డిగ్రీలు

May 3,2024 08:26 #AP, #burning sun!

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం రికార్డుస్థాయిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడేళ్లలో రాష్ట్రంలోనే ఇదే గరిష్ట ఉష్ణోగ్రత కావడం విశేషం. నంద్యాల జిల్లా బనగానపల్లెలో 46.7, నెల్లూరు జిల్లా వేపివాపి అక్కమాంబపురంలో 46.6, చిత్తూరు జిల్లా తవణంపల్లె, కడప జిల్లా జమ్మలమడుగులో 46.4, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, కర్నూలు జిల్లా గూడూరు, పల్నాడు జిల్లా విజయపురిలో 45.3, తిరుపతి జిల్లా చియ్యవరంలో 44.8, ఎన్‌టిఆర్‌ జిల్లా చిలకల్లులో 44.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 188 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం పరిధిలో 28 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాడ్పులు వీచేవీలుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

➡️