ఉత్తరాంధ్ర సాహిత్య విమర్శ – విహంగ వీక్షణం

May 27,2024 10:25 #sahitya, #sahityam, #Uttarandhra, #vimarsa

”విమర్శ సంపూర్ణమైన కళా కాదు, శాస్త్రమూ కాదు. కళగా ప్రారంభమై శాస్త్ర లక్షణాలను సంతరించుకుంటూ ఉన్న సాహిత్య ప్రక్రియ. ఒక ప్రాపంచిక దృక్పథాన్ని కలిగిన విమర్శకుడు నిర్వహించే సామాజిక బాధ్యత సాహిత్య విమర్శ” అన్నారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. దీన్నిబట్టి సాహిత్య విమర్శ అంటే విమర్శకుడు సామాజిక బాధ్యతతో ఒక సాహితీ ప్రక్రియలో మంచి చెడులను సాధికారకంగా విశ్లేషించడమే! కళింగాంధ్రలో అనేకమంది సాహిత్య విమర్శకులు సామాజిక బాధ్యతతో సాహిత్యాన్ని పరిమర్శించారు. ఇప్పటికీ ఆ కృషిని కొనసాగిస్తున్నారు.
ఉత్తరాంధ్ర తొలితరం విమర్శకులు మహాకవి గురజాడ అప్పారావు. కథానిక, గేయంతో పాటు విమర్శను కూడా రాశారు. పలు వ్యాసాలు ద్వారా ఉత్తమ విమర్శను వెలువరించారు. ‘కావ్యము నందు శంగారం, ముత్యాల సరాల లక్షణము, కవిత్వం- వర్డ్సువర్త్‌, కన్యాశుల్కం, ఆకాశరామన్న ఉత్తరాలు, గ్రామ్య శబ్ద విచారణం, ప్రపుల్ల లేక రాణీ చౌదరి (బంకించంద్రుని నవలా రచన), భట్టకలంకుడు (కన్నడ వ్యాకరణములు), ఆంధ్ర కవితా పిత-1,2,3,4; మాటామంతీ-3,4,5 మొదలగు వ్యాసాలలో గురజాడ విమర్శనా ప్రతిభ ద్యోతకమవుతుంది. చిన పురుషోత్తమ పంతులు, లక్ష్మణరావు పంతులు వేర్వేరు పత్రికల్లో వ్యవహారిక భాషను నిరసిస్తూ వ్యాసాలు వ్రాశారు. వాటిని ఖండిస్తూ గురజాడ ‘గ్రామ్య శబ్ద విచారణం’ అనే పేరుతో ఒక వ్యాసం వ్రాశారు. కళింగాంధ్రకే చెందిన మరో పండితుడు గిడుగు వేంకట రామమూర్తి పంతులు ‘ఎ మెమోరాండం ఆన్‌ మోడరన్‌ తెలుగు, ఎ మాన్యువల్‌ ఆఫ్‌ సవర లాంగ్వేజ్‌, సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనం’ లాంటి విమర్శ గ్రంథాలు రచించారు. సవర భాషకు సంబంధించి పలు పరిశోధనలు చేసి పుస్తకాలుగా ప్రచురించారు. కళింగాంధ్ర ముద్దుబిడ్డ, హేతువాది తాపీ ధర్మారావు ఈ ప్రాంత విమర్శనా స్థాయిని దేదీప్యమానంగా వెలిగించారు. చేమకూర వేంకటకవి రాసిన ‘విజయవిలాసం’ పై ‘హృదయోల్లాస వ్యాఖ్య’ పేరిట అపురూపమైన కావ్య నిర్మాణం చేపట్టారు. దీనికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
వ్యవహారిక భాషావాదులైన గిడుగు, గురజాడలను సంప్రదాయ ధోరణితో మొదట్లో తాతాజీ విమర్శించారు. తరువాత కొత్తపాళీ పేరున వారినే అనుసరించారు. ఆయన విమర్శ బహుముఖీనం. కొత్త పాళీ, సాహిత్య మొర్మొరాలు, దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు, పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు మొదలగు గ్రంథాలను ప్రగతిశీల దృష్టితో రాశారు. సెవెన్‌ స్టార్‌ సిండికేట్‌ వారి ప్రచురణ ‘నవత’లోని కవిత్వాన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి విశాలాంధ్ర పత్రికలో నిశితంగా విమర్శించారు. దానిపై తాతాజీ స్పందిస్తూ – విమర్శకుని కర్తవ్యం అభ్యుదయ రచనను పెంపొందించడం తప్ప, ఖండించడం కాదని అభిప్రాయపడ్డారు. ఇక్కడే పుట్టిన చిలుకూరి నారాయణరావు ముఖ్యంగా భాషా విమర్శకుడు. ‘ఆంధ్ర భాషా చరిత్రం- రెండు సంపుటాలు, ఆంధ్రదేశపు జానపద గేయాలు, బాలల గేయ సాహిత్యం, 11వ శతాబ్దం నాటి తెలుగు భాష, చక్కెటులు- సామెతలు’ మొదలగు గ్రంథాలు ఇతని విమర్శనా పటిమకు నిదర్శనాలు.
బహుభాషా కోవిదుడు రోణంకి అప్పలస్వామి అనేకమంది కవుల, రచయితల పుస్తకాలకు మున్నుడులు వ్రాశారు. నారాయణ బాబు రుధిరజ్యోతికి రాసిన పీఠిక ప్రశస్తమైనది. శ్రీశ్రీ మహాకవి ఎందుకయ్యాడో అనే విషయాలను సమున్నతంగా వివరిస్తూ విమర్శ చేశారు. రోణంకి మరో విమర్శ ‘కవిత్వ నిజస్వభావం’ పుస్తక రూపంలో ఉంది. శ్రీశ్రీ రాసిన ‘గురజాడ’ అనే వ్యాస సంపుటిలో గురజాడ ప్రారంభించిన ముత్యాలసరాలు ఛందస్సు గురించి, దాని పుట్టు పూర్వోత్తరాల గురించి, ఆయన వచన రచన నైపుణ్యం గురించి, ప్రగతిశీలమైన సామాజిక దృక్పథాన్ని గురించి, వ్యవహారిక భాషావాదాన్ని గురించి ప్రస్తుతించారు. కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకమన్నారు. గురజాడ దేశభక్తి గేయం ప్రపంచ సాహిత్యంలో గొప్పస్థానం పొందదగినదని శ్రీశ్రీ అభిలషించారు. ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ పేరిట 14 సంపుటాలు వెలువరించారు. ఇతర గ్రంథాలను ఎన్నింటిని రచించినా ఈ రచనతోనే ఉత్తమ విమర్శకుడిగా ఆరుద్ర పేరెన్నికగన్నారు. వేమనవేదం, మన వేమన, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలు- ప్రగతివాదులు అనేవి ఆయన మరికొన్ని సాహిత్య విమర్శనా గ్రంథాలు. చా.సో కథలకు సంబంధించిన సాహిత్య విమర్శ ఆయన కుమార్తె చాగంటి తులసి చేశారు. ‘సాహితీ తులసి’ అనే వ్యాస సంపుటి కూడా ముద్రించారు. రావిశాస్త్రి రాసిన పలు సాహిత్య వ్యాసాలు, సంపాదకీయాలు, మున్నుడులు, ఎలీజీలు, నాటకాలను ‘రావిశాస్త్రీయం’ పేరిట వచ్చిన పుస్తకములో పొందుపరిచారు.
హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు విరచితం ‘షేక్స్పియర్‌-కాళిదాసు’ అనే శీర్షికతో గొప్ప వ్యాసమొకటి వచ్చింది. యు.ఎ.నరసింహమూర్తి గారి గ్రంథం ‘కన్యాశుల్కము-19 శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు’. ఇది ‘కన్యాశుల్కం’పై వచ్చిన ప్రామాణిక విమర్శ గ్రంథంగా భాసిల్లుతోంది. వీరిదే ‘నారాయణ బాబు అసంకలిత రచనలు’ అనే వ్యాసం కౌముది పత్రికలో ప్రచురితమైంది. ఎస్‌.వి.జోగారావు నుంచి ‘ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర, మణిప్రవాళం అనే విమర్శనా సాహిత్యం వెలువడింది. మణిప్రవాళం గ్రంథానికి 1989లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు వెల్చేరు నారాయణరావు ప్రస్తుత విజయనగరం జిల్లా అంబఖండి గ్రామంలో జన్మించారు. ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ అనే విమర్శనా గ్రంథాన్ని పరిశోధన నిమిత్తం వ్రాశారు. కళాపూర్ణోదయం, కన్యాశుల్కం పుస్తకాలపై సాధికారిక విమర్శ చేసి, చర్చ పెట్టారు. పురిపండ అప్పలస్వామి ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలోకి అనువదించారు. వంగ సాహిత్య చరిత్ర, ఒడియా సాహిత్య చరిత్ర అనే పుస్తకాలు వ్రాశారు. ప్రముఖ కథకులు కా.రా మాస్టారు విమర్శకునిగా తన వంతు సాహితీ సేవ చేశారు. కథాకధనం, కథాయజ్ఞం అనే విమర్శక గ్రంథాలను వెలువరించారు. ఔత్సాహిక కథకులు చదవాల్సిన గ్రంథాలివి. కె.ఎన్‌.వై పతంజలి రాసిన ‘నా దేవుడు గురజాడ’ లాంటి వ్యాసాలు పేరెన్నిక గన్నవి. పొందూరుకు చెందిన అల్లంశెట్టి అప్పయ్య తొలి తరం కవి, విమర్శకులు. రామాయణ సారస్వత దర్శనం, రసికజన మనోభిరామ కావ్య విమర్శనం (రాతప్రతి) అనే విమర్శనా గ్రంథాలను వ్రాశారు. వీరి కుమారుడే అల్లంశెట్టి చంద్రశేఖరరావు. ఈయన సవర భాషకు సంబంధించిన పరిశోధన చేశారు. గిరిజన సాహిత్యంపై, గిడుగుపై సందర్భానుసారం పలు వ్యాసాలు వ్రాశారు. ‘గురజాడ కవిత్వంలో ధ్వని’ అనే వ్యాసం ఆయన విమర్శనా స్థాయికి గీటురాయి. ఇదే ఊరుకు చెందిన ఘండికోట బ్రహ్మాజీరావు ‘ప్రాచీన భారతీయ సాహిత్యంలో కథ’ అనే విమర్శనాత్మక గ్రంథం వ్రాశారు. ‘శ్రీమత్‌ సుందరకాండ- సౌందర్య దర్శనమ్‌’ 6 భాగాలు వీరి ఆధ్యాత్మిక రచన. ఈ ప్రాంతానికే చెందిన మరో కవి కొంక్యాన ఛాయరాజ్‌ గురజాడ, శ్రీశ్రీలపై విశ్లేషణాత్మక విమర్శనా వ్యాసాలు వ్రాశారు. ఈ ప్రాంతానికి చెందిన రామతీర్థ మంచి విమర్శకుడు. రావిశాస్త్రిపై ‘రావిసారాలు’ అనే సాహిత్య వ్యాసాలు వీరికి పేరు తెచ్చాయి. అనకాపల్లిలో పుట్టిన నిర్మలానంద పలు అనువాదాలు చేశారు. ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. ‘లూషన్‌ వ్యక్తిత్వము-సాహిత్యం’ అనే పుస్తకానికి సంపాదకత్వం వహించారు. రాజాంలో జన్మించిన దామెర వెంకట సూర్యారావు ఎన్నో వ్యాస సంపుటాలను ప్రచురించారు. వీరి రచనల్లో ‘మహాభారత నామకోశం’ ఒకటి. ఇందులో 4,125 పైగా పాత్రలు, ప్రదేశాలు, ఇతర అంశాల సంక్షిప్త పరిచయాలు ఉంటాయి. కణుగుల వేంకటరావు తన సాహిత్య వ్యాసాలను ‘కవేరా-కలం,కాలం’ గ్రంథంలో నిక్షిప్తం చేశారు.
రాజాం నుంచి గార రంగనాథం 2022లో ఆముక్త మాల్యదపై రాసిన 30 వ్యాసాల ‘రాయరత్న మంజూష’ మంచి విమర్శక గ్రంథం. వీరి సంపాదకత్వంలో ‘సాహితీ సౌరభాలు, విస్మ ృత కళింగాంధ్ర సాహితీ ప్రభ’ అనే వ్యాస సంకలనాలు వెలువడ్డాయి. ఈ రాజాం సమీప గ్రామంలో పుట్టిన అయ్యగారి సీతారత్నం ‘సాధిత’ అనే వ్యాసాల సంపుటిని రచించారు. ఈ వ్యాస రచయిత 2022లో ‘ఆజిరి’ పేరన 30 సాహిత్య వ్యాసాల సంపుటిని ముద్రించారు. జి.ఎస్‌.చలం … ‘భూషణం’ మాస్టారు జీవితం- సాహిత్యంపై విశ్లేషణాత్మక విమర్శ వ్రాశారు. ‘భూషణం’ పేరిట 2021లో సాహిత్య అకాడమీ ఈ పుస్తకాన్ని ప్రచురించడం విశేషం. ఇంకా ‘కళింగాంధ్ర మాండలిక పదకోశం’ అనే విలువైన పుస్తకాన్ని అందించారు. భమిడిపాటి గౌరీశంకర్‌ ‘విస్తృతి’ అనే వ్యాస సంపుటిని ప్రచురించారు. వెలుగుసంస్థ ప్రతినిధి శాసపు రామినాయుడు ‘మూడు యాభైల గురజాడ’ పేరిట ఒక పుస్తకం తీసుకొచ్చారు. శ్రీకాకుళానికి చెందిన వెలమల సిమ్మన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ‘తెలుగు సాహిత్య విమర్శ-సిద్ధాంతాలు’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. సిక్కోలుకు చెందిన మరో రచయిత ప్రొఫెసర్‌ కె.ఎస్‌.చలం సామాజిక విమర్శకు పెద్దపీట వేశారు. ‘త్రికళింగ దేశ చరిత్ర’ అనే గ్రంథం వెలువరించారు. ఇదే సామాజిక విమర్శను ఆదిభట్ల విద్యాసాగర్‌, కె.అజశర్మ కొనసాగించారు. ప్రాంతీయ దృక్పథంతో కథాప్రక్రియకు సంబంధించి ‘ఉత్తరాంధ్ర కథా వెలుగు’ పేరిట విమర్శనాత్మక పుస్తకాన్ని, 2006లో వి.ఎస్‌.ఎన్‌ మూర్తి సంపాదకత్వంలో ‘వెలుగు’ సాహితీ సాంస్క ృతిక సంస్థ ప్రచురించింది. ఇంకా ఈ ప్రాంతానికి చెందిన చిత్ర, దీర్ఘాశి విజయభాస్కర్‌, దుప్పల రవికుమార్‌, బెందాళం కృష్ణారావు, నల్లి ధర్మారావు, వాండ్రంగి కొండలరావు, బద్రి కూర్మారావు, రాజా మానాపురం చంద్రశేఖర్‌, బాల సుధాకర మౌళి, ఆల్తి మోహనరావు, సారిపల్లి నాగరాజు, అలజంగి మురళీధరరావు తదితరులు విమర్శక వ్యాసాలను వ్రాస్తున్నారు. బరంపురానికి చెందిన తుర్లపాటి రాజేశ్వరి కూడా విమర్శ విరివిగా రాస్తున్నారు. కళింగాంధ్రను మెట్టినిల్లుగా చేసుకున్న కె.ఎన్‌.మల్లీశ్వరి కథపై విమర్శ చేసారు.
గురజాడ, గిడుగు నుండి నేటి అట్టాడ, గంటేడ వరకు సాహిత్య విమర్శను అడపాదడపా రాసినవారే. కానీ వారంతా దాన్ని ప్రధాన కార్యక్షేత్రంగా తీసుకోలేదు. ఈ నేలమీద సాహిత్య విమర్శను రాసిన రచయితలు ఉన్నా, హెచ్చుమంది వారు రాసిన విమర్శకు పుస్తక రూపం ఇవ్వకపోవడం మరో లోపం. ఇతర సాహిత్య ప్రక్రియలలాగా మొత్తం తెలుగునేలలో విరివిగా విమర్శ, విమర్శకులు పుట్టుకు రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. అవే కారణాలు కళింగాంధ్రకూ వర్తిస్తాయి. ‘మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి విమర్శకులు రావాలి’ అన్న ‘కొడవగంటి కుటుంబరావు’ మాటల్ని మననం చేసుకుంటూ తెలుగు సాహిత్యానికి సంబంధించి కళింగాంధ్రలో మరింతగా విమర్శకులు తయారుకావల్సిన అవసరం ఎంతైనా వుంది.

– పిల్లా తిరుపతిరావు
70951 84846

➡️