ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపి

Apr 30,2024 01:14 #2024 election, #BV Raghavulu, #Seminar
  • తిండి, బట్ట, పెళ్లి మీదా ఆంక్షలు
  •  మోడీకి సాగిలపడిన చంద్రబాబు, జగన్‌ : బివి రాఘవులు

ప్రజాశక్తి- తిరుపతి సిటీ : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బిజెపి ధ్వంసం చేస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దేశం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి, జనసేన, వైసిపి… బిజెపి పక్షానే ఉన్నాయని వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పోటీ ఇండియా వేదిక, బిజెపి మధ్యేనని పేర్కొన్నారు. ‘ఎన్నికలు-వర్తమాన పరిస్థితి’పై తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ ముస్లిముల రిజర్వేషన్లు తీసేస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి ప్రకటిస్తే… టిడిపి, వైసిపిలు వ్యతిరేకించకపోవడం శోచనీయమన్నారు. పౌరసత్వ చట్టసవరణ పేరుతో దేశవ్యాప్తంగా ఒకే మతం, ఒకే యూనిఫారం, ఒకే ఫుడ్‌ అనేలా బిజెపి వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆఖరికి తిండి, బట్ట, పెళ్లిమీద కూడా ఆంక్షలు విధిస్తోందని, ప్రజల జీవితాన్ని, ఇంటిని కూడా నియంత్రిస్తోందని వివరించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకొచ్చిన బిజెపి ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను తుంగలో తొక్కిందని గుర్తు చేశారు. అయినా, రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు మోడీ ప్రభుత్వానికి సాగిలపడుతున్నాయన్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి వైసిపితో పోటీ పడుతున్నట్లు నటిస్తున్నాయని, వాస్తవానికి షాడో బాక్సింగ్‌లో మాదిరిగా కొట్టుకుంటున్నారని వివరించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటంలో టిడిపి, వైసిపి చేసింది ఏమీలేదన్నారు. ప్రాణత్యాగాలతో ఏర్పడిన ప్లాంట్‌ పరిరక్షణకు పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. రాజధాని అమరావతిలో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయని, గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. రాజధాని పేరుతో భూములను కబ్జా చేసిందని విమర్శించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మిగతా 7లో
జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలో తాను కబ్జా చేసేందుకు భూములు లేకపోవడంతో విశాఖకు వెళ్లాలని అనుకుంటున్నారని వివరించారు. సిఎఎకు వైసిపి, టిడిపి రెండూ మద్దతునిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, భూ మాఫియా ఎక్కువైందని, వాటి ద్వారా దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో ప్రలోభాలకు దిగుతున్నారని విమర్శించారు. బిజెపి నాయకులకు దేవుని హుండీపై భక్తి ఎక్కువని ఎద్దేవా చేశారు. బిజెపి, టిడిపి, వైసిపిలను ఓడించాలని కోరారు. మాజీ ఎంపి పి.మధు మాట్లాడుతూ దేశ రాజకీయ ప్రస్తుత పరిస్థితులు పోరాడే శక్తులకు ఊతం ఇచ్చేలా ఉన్నాయన్నారు. ఎన్నికల బాండ్ల కుంభకోణం చాలా పెద్దదని, ఇందులో కేంద్ర కేబినెట్‌ మొత్తం ఉండడం దారుణమని పేర్కొన్నారు. ప్రశ్నించే వారిపై ఇడి, సిబిఐ దాడులు ఎక్కువయ్యాయన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఇండియా వేదిక అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్‌ తిరుపతి ఎంపి అభ్యర్థి డాక్టర్‌ చింతామోహన్‌ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చి దేశాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. తిరుపతి సిపిఐ అభ్యర్థి పి.మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఆర్‌పిఐ అధ్యక్షులు అంజయ్య పాల్గొన్నారు. దీనికి ముందు తిరుపతి సిపిఐ అభ్యర్థి పి.మురళికి మద్దతుగా సుందరయ్య నగర్‌లో బివి.రాఘవులు ప్రచారం నిర్వహించారు.

➡️