బుల్లిపెట్టెలో బూచి

  • మోడీ పాలనలో నియంతృత్వ సాధనంగా మొబైల్‌ఫోన్‌
  •  అడుగడుగునా నిఘా
  •  ప్రత్యామ్నాయాలకోసం వెతుకులాట

న్యూఢిల్లీ : ప్రభుత్వ అధికారులు పలువురు సాధారణ ఫోన్‌కాల్‌ కన్నా వాట్సప్‌ కాల్‌లో మాట్లాడటానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనించే ఉంటారు. దీనికి కారణం భయం…నిఘా భయం! తమ ఫోన్లను ఎవరో వింటున్నారన్న భయం! ఆ వినేది ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! మన రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో .. ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇదే స్థితి నెలకొంది! నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత గత పదేళ్ల కాలంలో మొబైల్‌ ఫోన్లు నియంతృత్వ సాధనాలుగా ఎలా మారిపోయాయో వివరిస్తూ ‘ది వైర్‌’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం దేశ వ్యాప్తంగా నూతన సాంకేతికతను ప్రభుత్వమే పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోంది. ప్రజా ఉద్యమకారులు, అభ్యుదయ శక్తులు, నిష్ఫాక్షికంగా వ్యవహరించే పాత్రికేయులు, రాజకీయంగా గిట్టని వారు చివరకు అధికార యంత్రాంగంలో స్వతంత్రంగా వ్యవహరించే వారు ఇలా వివిధ తరగతులకు చెందిన వారు ప్రభుత్వ లక్ష్యాలుగా మారిపోతున్నారు.
ఇజ్రాయిల్‌ స్పైవేర్‌ పెగాసెస్‌తో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, లాయర్లు, జర్నలిస్టుల ఫోన్‌లను ట్యాప్‌ చేయడం దీనికో పెద్ద నిదర్శనం. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య దేశంలో చోటుచేసుకున్న ఈ సర్కారీ నిఘా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ఈ స్పైవేర్‌ విక్రయించే ఎన్‌ఎస్‌ఓ గ్రూపు తాము ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే దీనిని విక్రయిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో జాతీయ భద్రత దృష్ట్యా అన్ని వివరాలను వెల్లడించలేమని కేంద్ర ప్రభుత్వం ధర్మాసనానికి విన్నవించింది. ఒకవైపు ప్రభుత్వమే ట్యాపింగ్‌ చేస్తూ, మరోవైపు జాతీయభద్రతను ముసుగుగా తెచ్చుకోవడమేమిటని పౌరసమాజం అడిగిన ప్రశ్నకు నరేంద్రమోడీ ప్రభుత్వం నుండి ఇంతవరకు సమాధానం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం యాపిల్‌ ఫోన్ల సంస్థ పలువురి ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయంటూ మెసేజ్‌లు పంపిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నుండి ఈ తరహా హెచ్చరికలు అందిన వారిలో రాజకీయనేతలు, జర్నలిస్టులు, లాయర్లు ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఫోన్‌ ట్యాప్‌ చేయడానికి ప్రయత్నం జరిగిందని, దానిని తామే అడ్డుకున్నామని యాపిల్‌ సంస్థ ప్రకటించింది. ఇలా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ సాధనాల్లోకి జొరబడటం, తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, లేదా సృష్టించి తప్పుడు కేసులు పెట్టడం కూడా ఈ కాలంలో సాధారణ అంశంగా మారింది. బీమా కోరెగావ్‌ కేసులు దీనికి పెద్ద ఉదాహరణ.
కేసులేమైనప్పటికీ ఎలక్ట్రానిక్‌ పరికరాలను ముఖ్యంగా సెల్‌ ఫోన్లను పోలీస్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఫోన్లను స్వాధీనం చేసుకుంటున్న సంఘటనలు కూడా ఇటీవలే పెరిగాయి. 2022లో ‘ది వైర్‌ జర్నలిస్టు’లపై పరువు నష్టం కేసు దాఖలైంది. దీనికి సంబంధించి 2023లో ఒక రోజు తెల్లవారు జామున 60కి పైగా ప్రాంతాల్లో దాడులు చేసి జర్నలిస్టుల నుండి ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. న్యూస్‌ క్లిక్‌ విషయంలో 250కిపైగా ఫోన్లను ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నించారు.

ఫోన్‌లలోకి ప్రభుత్వం..!
సెల్‌ఫోన్ల వినియోగం అత్యంత సాధారణమైన ప్రస్తుత రోజుల్లో సాధారణ ప్రజల ఫోన్లలోకి కూడా ప్రభుత్వం ప్రవేశిస్తోంది. ఆధార్‌, మొబైల్‌ లింకేజి ద్వారా ఇప్పటికే ఈ తరహా సమాచారం ప్రభుత్వానికి చేరింది. డిజిలాకర్‌, డిజియాత్ర వంటి యాప్‌ల నుండి కూడా ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో సెల్‌ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిఘా పరిధిలోకి వచ్చేశారన్న అభిప్రాయాన్ని టెక్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అంటే, ప్రతి ఒక్కరిపైనా తప్పుడు కేసుల కత్తి వేలాడుతున్నట్టే!

➡️