చల్లటి కబురు

May 7,2024 01:00 #amaravati, #cold weather, #IMD
  • నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :  రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులతో సతమతమైన ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చల్లటి కబురు చెప్పింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఐఎమ్‌డి నివేదిక మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్‌టిఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్గరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. శుక్రవారం వరకూ మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం వున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. అలాగే సోమవారం కర్నూలు జిల్లా పంచలింగాల, కడప జిల్లా వల్లూరులో 45.1 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 112 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు తెలిపారు.

➡️