మా ఇంటికి రావొద్దు!

May 8,2024 05:35 #editpage

పట్టువదలని విక్రమార్కుడు యథావిధిగా చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని తీసి భుజాన వేసుకున్నాడు. శవంలోని బేతాళుడికి ఏమాత్రం ఆటంకం కలిగించకుండా నిశబ్దంగా నడుస్తున్నాడు. ఎందుకైనా మంచిదని భుజంమీద శవాన్ని గట్టిగా పట్టుకుని ఒకింత వేగంగా స్మశానం వైపు నడవసాగాడు. విక్రమార్కుడు గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడని బేతాళుడు…ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుని చుట్టూ తేరిపారజూశాడు. విక్రమార్కుడు ఇంతకు ముందుకంటే వేగంగా నడుస్తున్నట్టనిపించింది. ‘రాజా, నీ అంకితభావం చూస్తూంటే నాకెంతో ముచ్చటగా వుంది. ఒక్కసారి అధికార మత్తు తలకెక్కి, కళ్లు పచ్చబారిన వారిని అసలు తమ గుమ్మం కూడా తొక్కొద్దని బోర్డులు పెట్టిన వైనం నీకు తెలుసా? గతంలో సినిమాల్లో, కథలో చూశాను. కానీ ఇప్పుడు వాస్తవంగానే ‘మీరు రావొద్దు’ అంటూ బోర్డులు పెడుతున్నారు. ఆ కథేంటో చెప్తా…జాగ్రత్తగా విను’ అంటూ మొదలు పెట్టాడు.
‘రాజా… సింధియా దేశంలో కొన్నేళ్ల క్రితం ఎవరి నోట విన్నా ఎక్కడ చూసినా ‘ఓ స్త్రీ రేపు రా…’ అనే మాట వినిపిస్తుండేది. ప్రతి ఇంటి డోర్‌ మీద ఇలా రాసిన రాతలు అప్పట్లో పెద్ద సంచలనం కలిగించాయనే చెప్పాలి. ఎవరో ఒకావిడ అడుక్కోవడానికి వస్తుందని, ఆమెకు పొరపాటున బిక్షమేస్తే… వెంటనే చనిపోతారనే పుకార్లు రేపారు. ఈ పుకారు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆ వచ్చినావిడ… ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసివున్న బోర్డు చూసి వెళ్లిపోతుందని ప్రజలు నమ్మారు’ అని అనర్గళంగా చెప్పిన బేతాళుడు…ఊపిరి తీసుకోడానికి ఓ నిమిషం ఆగాడు. బేతాళుడు చెప్పింది కాకమ్మ కథ అన్నట్టు వెటకారంగా పెదవి విరిచాడు విక్రమార్కుడు.
‘రాజా…నీ నవ్వులోని మర్మం నాకు అర్థమైంది. కచ్చితంగా ఇది మూఢనమ్మకమే. అయితే, ఇప్పుడో సినిమా కథ చెప్తాను. అప్పుడేమంటావో చూస్తా..! చాలా కాలం కిందట ‘ఆలీబాబా 40 దొంగలు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో దొంగలను తమ ఇళ్లకు రాకుండా చెయ్యడానికి ప్రతి గుమ్మం తలుపు మీద స్వస్తిక్‌ మార్కును గీస్తారు. తద్వారా దొంగల రాకను ఆ గ్రామస్తులు అడ్డుకుంటారు’ అని ఇంకో కథ చెప్పాడు బేతాళుడు. ఇది కూడా కథేగా…అన్నట్టుగా చూశాడు విక్రమారుడు. దీంతో విక్రమార్కుడిని ఎలాగైనా ఓడించి….మళ్లీ చెట్టెక్కి కూర్చోవాలన్న పంతం పెరిగింది బేతాళుడిలో.
‘రాజా…ఇదైతే కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఇది నిజ్జంగా జరిగిన వాస్తవం గనుక. సింధియా దేశంలోని ఓ మలయాళ రాష్ట్రంలో ఇటీవల ఓ సంఘటన జరిగింది. ‘మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. కాషాయం పార్టీ సభ్యులను లోపలికి అనుమతించం’ ఓ అపార్ట్‌మెంట్‌ గోడపై రాసి వున్న సైన్‌బోర్డు ఇప్పుడు ఆ దేశంలోని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రాజా…దీనిపై నువ్వేమనుకుంటున్నావు? ఆ మలయాళీలు అలా ఎందుకు బోర్డుపై రాశారో తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది’ అన్నాడు బేతాళుడు.

‘బేతాళా…ఇందులో తెలియక పోవడమేముంది. ఆ కాషాయం పార్టీ గూండాయిజం అందరికీ తెలిసిందే కదా. గోమాంసం వుందనే పేరుతో ఇంట్లో వున్నవారిని బయటికి లాగి కొట్టారు. మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. జమ్ము కాశ్మీర్‌లోని కతువాలో ఓ గుడిలోనే చిన్నారి బాలికపై అత్యాచారం చేసి చంపేశారు. యూపిలో హత్రాస్‌లో ఓ యువతిపై అత్యాచారం చేసి, నిర్దోషులుగా తిరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు సింధియా దేశంలో కాషాయం పార్టీ సేనలు అనేకం చేస్తున్నాయి. మలయాళీలు కాస్త తెలివైన వారు కనుక ముందు జాగ్రత్తగా… కాషాయం పార్టీ వాళ్లను ఇళ్లలోకి అనుమతించం అని బోర్డు పెట్టారు. నిజానికి దేశంలోని ప్రతి ఇంటి ముందు ఇలాంటి బోర్డులు పెట్టి, వారిని తరిమేయాలి’ అని బదులిచ్చాడు విక్రమార్కుడు.
‘రాజా…నువ్వు చెప్పిన సమాధానం కరెక్టే. కానీ… సింధియా ప్రజలు ఆ పార్టీని తరిమేస్తారో లేదో కొద్దిరోజుల్లో తెలుస్తుంది. అందాక బై…బై..’ అంటూ విక్రమార్కుడి భుజమ్మీద నుంచి మాయమై మళ్ళీ చెట్టెక్కాడు బేతాళుడు.

– రాజాబాబు కంచర్ల
9490099231

➡️