సెంట్రల్‌ గాజాపై దాడిలో 20 మంది మృతి

May 20,2024 08:26 #blast, #bomb, #issrel

గాజాసిటీ: నెతన్యాహు తన సొంత వార్‌ క్యాబినెట్‌ నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన . ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బెన్నీ గాంట్జ్‌, యుద్ధానంతర గాజాపై అంతర్జాతీయ పరిపాలనతో కూడిన ప్రణాళికను జూన్‌ 8 నాటికల్లా రూపొందించకపోతే ప్రభుత్వం నుంచి వైదొలగుతానని హెచ్చరించారు.. మరో వైపు సెంట్రల్‌ గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో గడచిన 24 గంటల్లో 20 మంది దాకా చనిపోయారు. వీరిలో మహిళలు , పిల్లలే ఎక్కువగా ఉన్నారు.
నెతన్యాహుకు బెన్నీ గాంట్జ్‌ ఇచ్చిన అల్టిమేటంతో నెతన్యాహు ఇరకాటంలో పడ్డారు. . గాంట్జ్‌ మద్దతు ఉపసంహరణ వల్ల ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఢోకా ఉండకపోవచ్చు.కానీ, దీని పర్యవసానాలు మున్ముందు చాలా తీవ్రంగా ఉండే అవకాశముందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడే గనుక ఎన్నికలు జరిగితే నెతన్యాహుకు గాంట్జ్‌ చేతిలో ఓటమి ఖాయమని పలు ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అప్పుడు అవినీతి కేసుల్లో నెతన్యాహు జీవితాంతం జైలు ఊచలు లెక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. తాజా పరిస్థితిపై .. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ ఇజ్రాయెల్‌ అగ్ర నాయకుల నుంచి ఎప్పటికప్పుడు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. గత ఏడు మాసాల్లో భారీగా బాంబు దాడికి గురైన ఉత్తర గాజాలోని కొన్ని ప్రాంతాలను హమాస్‌ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకుంది. .1948 అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం తరువాత సెంట్రల్‌ గాజాలో నెలకొల్పిన శరణార్థి శిబిరం నుసిరత్‌పై జరిగిన వైమానిక దాడిలో ఎనిమిది మంది మహిళలు, నలుగురు పిల్లలతో సహా 20 మంది చనిపోయారు. జబాలియా శరణార్థి శిబిరం, ఆ చుట్టుపక్కల నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ సైన్యం పెద్దయెత్తున విరుచుకుపడుతోందని, పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని జబాలియాకు చెందిన 48 ఏళ్ల అబ్దేల్‌-కరీమ్‌ రద్వాన్‌ పేర్కొన్నారు. జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించినప్పటి ఇప్పటివరకు 150 మందికిపైగా మృతదేహాలను భవన శిథిలాల మధ్య నుంచి వెలికి తీసినట్లు సివిల్‌ డిఫెన్స్‌ ప్రతినిధి మహమూద్‌ బస్సల్‌ చెప్పారు. ఇంకోవైపు గాజాకు సంఘీభావంగా ప్రపంచ వ్యాపితంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.

➡️