ఆర్థిక అంతరాలు ఎన్నికల అంశం కాదా!

Mar 29,2024 04:45

కొంతమంది ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం భారత్‌లో నేడు ఆర్థిక అంతరాలు బ్రిటిష్‌ పాలనలో కన్నా ఘోరంగా ఉన్నాయి. గణాంకాల ఆధారంగా వారు చెప్పిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సంపద సృష్టి బాగానే జరుగుతున్నా, అది కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతమౌతుంది. దేశ సంపదలో 44 శాతం ఒక్క శాతం ధనికుల చేతిలో ఉంది. ఆ ఒక్క శాతం మంది జాతీయ ఆదాయంలో 22 శాతం మేరకు పొందుతున్నారు. ఏభై శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో 15 శాతానికి మించి పొందలేక పోతున్నారు. అంటే జాతీయ ఆదాయం ఎంత పెరిగినా జనాభాలో సగం మందికి దక్కేది అందులో 15 పైసల వాటానే. ఇలా అసమానతలు పెరగడానికి ఇప్పటి ప్రభుత్వ విధానాలే కారణం. ధనికులపై విధించే పన్నులు తక్కువ. వారు పొందే రాయితీలు ఎక్కువ. పేదలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్టే పన్నులు ఎక్కువ. వారికి దొరికే ఊరట. ధరల నియంత్రణ ద్వారానో, మరోలానో తక్కువ. అయితే అసమానతలు తగ్గే విధానాల్ని అమలు చేస్తామని ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. వృద్ధి వైపు దేశాన్ని పరుగులు పెట్టిస్తామని అందరూ అంటున్నారు తప్పించి, ఆ వృద్ధి ఫలాలు అందరికీ అందేలా విధానాలు రూపు దిద్దగలమని జాతీయ పక్షాలు మాట్లాడడం లేదు.బహుశా దాని వల్ల ధనికులు దూరమై, వారి విరాళాలు అందవని భయమేమో? చూశాం కదా, ఎన్నికల బాండ్ల రూపంలో దివాళా కంపెనీలు కూడా పార్టీలకు ఎలా నిధులు ఇచ్చాయన్నది. ఇకపోతే ఆర్థిక అంతరాలు మరీ వారు చెప్పినంత ఘోరంగా లేవని వాదించవచ్చు. కానీ అసమానతలు దండిగా ఉన్న వాతావరణంలోనే ఉన్నామన్నది ఎవరూ కాదనలేరు. వేరే వేరే నివేదికల ప్రకారం 2000 సంవత్సరంలో 35 శాతం ఉన్న నిరుద్యోగిత నేడు 65 శాతం అయ్యింది. పేదరికం, పోషకాహార లేమి గణనీయంగా ఉన్నాయి. ఇప్పటికీ వైద్యం, విద్యపై పౌరులు భరించాల్సిన ఖర్చు ఎక్కువే. వాటివల్ల అప్పులు పాలయ్యే వాతావరణం. ఈ సమస్యల్ని గమనంలోకి తీసుకోకుండా వృద్ధిలో ముందంజ వేయడం సాధ్యమా? పేదలకి, అధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతికి భారమైన విద్య, వైద్యం చవకగా అందుబాటులోకి రావాలి. అప్పుడే నాణ్యమైన భవితకు, ఆర్థిక వృద్ధికి పూచీ. యువత గణనీయంగా ఉన్న భారత్‌ శక్తిమంతం కావడమే కాదు అసమానతలు లేని సమాజంగా మారాలి. ఇప్పుడున్న విధానాలతో అది సాధ్యం కాదు. మెరుగైన విధానాల కోసం, అవి ఎన్నికల్లో ప్రాధాన్యత గల అంశాలుగా మారడం కోసం నడుం కట్టాల్సింది పౌర సమాజమే.

– డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ. విజయనగరం.

➡️