రఫాపై భూతల దాడికి సిద్దమైన ఇజ్రాయిల్.. పాలస్తీనియన్ల తరలింపు

జెరూసలెం :   తూర్పు రఫా నుండి సుమారు లక్ష మంది పాలస్తీనియన్‌లను  ఖాళీ చేయిస్తున్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం సోమవారం తెలిపింది.  గాజా దక్షిణ నగరమైన రఫాపై భూతల దాడులకు సిద్ధమైనట్లు  సమాచారం.  ఎంత మందిని ఖాళీ చేయిస్తున్నారన్న ప్రశ్నకు.. సుమారు లక్ష మంది ఉంటారని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రతినిధి మీడియాకి సమాచారమిచ్చారు. హమాస్‌ను తుడిచిపెట్టాలన్న నిర్ణయంలో భాగంగా ఈ తరలింపు చర్య  చేపట్టామని అన్నారు. నిన్న రఫాలో హమాస్‌ ఉనికి, ఆయుధాల సామర్థ్యాన్ని గుర్తించామని అన్నారు.

ఆదివారం ఇజ్రాయిల్‌- గాజా మధ్య సరిహద్దు క్రాసింగ్‌ కెరెమ్‌ షాలోమ్‌ వైపు క్షిపణుల వర్షం కురిసిందని, ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయని ఇజ్రాయిల్‌ తెలిపింది. రఫాను ఆనుకుని ఉన్న ప్రాంతం నుండి రాకెట్లను ప్రయోగించారని ఆరోపించింది. హమాస్‌ సాయుధ విభాగం దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ.. గాజాలోకి మానవ సాయాన్ని అనుమతించేందుకు ఉద్దేశించిన క్రాసింగ్‌ను ఇజ్రాయిల్‌ మూసివేసింది.

ప్రస్తుతం 12 లక్షల మంది (1.2 మిలియన్‌) కి పైగా ప్రజలు రఫాలో ఆశ్రయం పొందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది. ఏడు నెలలుగా ఇజ్రాయిల్‌ -గాజాపై చేపడుతున్న అమానుష దాడి సమయంలో గాజాలోని ఇతర ప్రాంతాల నుండి పారిపోయారని తెలిపింది.

➡️