స్వాతి మలివాల్‌ చెప్పేవన్నీ అసత్యాలే.. : అతిషి

May 18,2024 18:19

న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపి స్వాతిమలివాల్‌ తనపై జరిగిన దాడి కేసులో చెప్పేవన్నీ అసత్యాలేనని ఆప్‌ మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికే స్వాతి బిజెపితో కుమ్మక్కై బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారని అతిషి మండిపడ్డారు.
కాగా, సోమవారం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత అనుచరుడు బిభవ్‌ కుమార్‌ కేజ్రీవాల్‌ ఇంట్లోనే స్వాతిమలివాల్‌పై దాడి చేశాడని ఆరోపించారు. తనను బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడని ఈ క్రమంలో ఆమెపై భౌతిక దాడి చేశాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఇంట్లో రికార్డు అయిన సిసిటివి ఫుటేజ్‌ వీడియోను శనివారం ఆప్‌ బయటపెట్టింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్వాతి మలివాల్‌ను లేడీ పోలీస్‌ ఆమెను చేయి పట్టుకుని బయటకు తీసుకురావడం కనిపిస్తోంది.
ఈ వీడియోపై ఆప్‌ మంత్రి అతిషి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘స్వాతి మలివాల్‌పై అవినీతి ఆరోపణలున్నాయి. వాటిని నుంచి తప్పించుకోవడానికే ఆమె బిజెపితో కుమ్మక్కై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. సీసీటివి ఫుటేజీ ప్రకారం.. స్వాతి మలివాల్‌ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన ఆరోపణలు అన్నీ అసత్యాలే. ఇంకా ఆమెనే పోలీసుల్ని బెదిరించడం వీడియోలో కనిపిస్తోంది. బిభవ్‌ కుమార్‌ని సైతం ఆమె తీవ్రంగా దూషించారు. కేజ్రీవాల్‌ నివాసం నుంచి ఆమె బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది.’ అని ఆమె స్వాతిపై మండిపడ్డారు.

➡️