అసామాన్యుల స్ఫూర్తిగాధలు

Apr 15,2024 05:15 #aksharam

స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మన నిజ జీవితంలో తారపడే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారి గురించి ప్రముఖ రచయిత అబ్దుల్‌ రజా హుస్సేన్‌ పాఠకులకు ఆకట్టుకునే విధంగా ‘స్ఫూర్తి ప్రదాతలు’ అనే పుస్తకం రాశారు. ఈ స్ఫూర్తి ప్రదాతల్లో ఆచార్య మన్నవ సత్యనారాయణ ఒకరు. పుట్టుకతోనే చూపులేని ఆయన ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. అడవి బాపిరాజు నవలలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. తాను చదివిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ఆయనను వేలిపట్టుకుని ఆ స్థాయికి చేరుకునేవరకు నడిపించిన, ఆయన తండ్రి వెంకట రామయ్య కూడా స్ఫూర్తిమంతులే! జన్మత: అంధుడైన లక్కోజు సంజీవరాయ శర్మ గణిత శాస్త్రంలో ప్రావీణ్యత పొంది, గణితావధానంలో దిట్టగా నిలిచి, గణిత బ్రహ్మగా కీర్తి పొందారు. అంకెలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదు. అయినా, నాలుగు వేల ఏళ్ల వరకు సరిపోయే క్యాలండర్‌ని సృష్టించారు.
ఢిల్లీ ఐఐటీలో చదివిన అలోక్‌ సాగర్‌ అమెరికాలోని ప్రతిష్టాత్మక హూస్టన్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పూర్తి చేశారు. తాను చదివిన ఢిల్లీ ఐఐటీలోనే ప్రొఫెసర్‌గా చేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆయన శిష్యులే. అంతటి మహామనిషి ఇప్పుడు ఓ గిరిజన ప్రాంతంలో తలుపు కూడా లేని ఓ పూరి గుడిసెలో ఉంటూ గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. గిరిజన పిల్లలకు చదువు చెబుతున్నారు. ఓ మూడు జతల దుస్తులు, ఓ టవల్‌, ఓ పాత సైకిల్‌ ఆయన ఆస్తి.
తెలుగు సాహిత్యంలో తళుక్కుమన్న మెరుపు తీగె అందే నారాయణ స్వామి. చేనేత కార్మికుడైన ఆయన 33 ఏళ్ల వయసులో కంటిచూపు కోల్పోయారు. ఆయన 1935-1975 మధ్య జీవితాలను కథలుగా రాశారు. ఆయన కథలను అప్పటి ప్రఖ్యాత కథకులు తల్లావఝుల శివశంకర శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి పూనుకొని అచ్చు వేయించారంటే ఆయన ఎంత గొప్ప కథకుడో మనం అర్థం చేసుకోవచ్చు. చింతకింది కనకయ్య 1944లోనే విద్య విలువ తెలుసుకుని తన స్వగ్రామం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ విద్యా సంస్థ నెలకొల్పేందుకు అప్పట్లోనే రూ.26 వేలు ఇచ్చారు. ఆయన పేరుతోనే ఆ స్కూల్‌ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన అనేక మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు. తెలుగు మాస్టారు పూసపాటి నాగేశ్వరరావు. పద్య కావ్యాల రచనలో, అవధానాల్లో దిట్ట. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి చేత ప్రశంసలు పొందారు.
కందుకూరి పైడిరాజుకు కాళ్లు కదలవు, మెడ నిలవదు. చిత్రలేఖనే అతని ఆయుధం. 7వ తరగతి తర్వాత అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదట కాళ్లు, కీళ్ల నొప్పులు. తర్వాత మెడ నిలవని పరిస్థితి. తండ్రి నింపిన ధైర్యంతో గురువులు, శిక్షణ లేకుండానే చిత్రకారుడిగా ఎదిగారు. స్వప్న అగస్టీన్‌కు రెండు చేతులూ లేవు. అయినా, అధైర్యపడలేదు. కాలి వేళ్లతోనే పెన్సిల్‌, కుంచె పట్టుకుని చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. చిత్రకళా ప్రపంచంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది. కళ కళ కోసం కాదు, సమాజం కోసం అని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ప్రముఖ చిత్రకారులు దాకోజు శివప్రసాద్‌. బమ్మలు ఫ్రీగా గీసివ్వడం ఆయన ప్రత్యేకత. ఎవరికో తెలుసా? అబద్ధం ఆడనంటే ఓ బమ్మ, మందుకొట్టనంటే ఓ బమ్మ, పొగతాగనంటే ఓ బమ్మ గీసిస్తారు. ఉపాధ్యాయుడు కొమెర జాజి ప్రకృతి ఆరాధకుడు. మొక్కలు, పక్షులే అతని ప్రపంచం. వనమూలికా వైద్యం గురించి పుస్తకాలు రాశారు. సంకల్ప బలం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించారు నటుడిగా, చేనేత కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన పొట్లాబత్తుని లక్ష్మణరావు. చేనేత కార్మికుడి నుంచి మాస్టర్‌ వీవర్‌గా, మంగళగిరిలో పేరుగాంచిన లక్ష్మీశారీ హౌస్‌ వ్యవస్థాపకుడిగా ఎదిగారు.
తిమ్మక్కకు 110 సంవత్సరాల వయసు. చదువు లేదు. ఆమె శ్వాస, ధ్యాస, భాష అంతా చెట్లే. పర్యావరణ ప్రేమికురాలిగా ‘పద్మశ్రీ’ అందుకుంది. పర్యావరణ ఉద్యమ తొలి సేనాని రేచల్‌ లూయిస్‌ కార్సన్‌. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడిన యోధురాలు. దోమలను సంహరించే డీడీటీ మందు వల్ల పర్యావరణానికి జరిగే హాని, మానవాళికి జరిగే నష్టం గురించి రేచల్‌ ప్రపంచానికి చాటిచెప్పారు. వాస్తవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో వచ్చిన ఓ సునామీనే తట్టుకున్న నిజమైన మహిళాభ్యుదయవాది గోలి పార్వతీదేవి. భర్త ఇల్లు వదిలివెళ్లిపోతే, జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, ఎంఏ పూర్తి చేసి, డీఎస్సీ రాశారు. ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం పొందారు. ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేశారు.
సంగీత లోకంలో ఓ వేగుచుక్కగా ‘ఫిడేలు నాయుడు’గా కీర్తి పొందిన వెంకటస్వామి నాయుడు; మరుగుజ్జు అయినా ఇస్లామిక్‌ సంస్కఅతికి అద్దంపట్టే, ఆకాశాన్ని తాకే ఆలోచనలతో గొప్ప చిత్రాలను గీసిన మహాచిత్రకారుడు కైసర్‌ అబ్బాస్‌; 91 ఏళ్ల వయసులోనూ పేదల డాక్టర్‌గా, మదర్‌ ఆఫ్‌ ఇండోర్‌గా నిలిచి పద్మశ్రీ అవార్డు అందుకున్న గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ భక్తియాదవ్‌; ఇంగ్లీష్‌ చానల్‌ ఈది, మెగల్లాన్‌ సంధిని దాటిన మగధీరుడు, మన తెలుగువాడు మధు నాగరాజు గురించి ఈ పుస్తకంలో రాశారు. ఖద్దరు గాంధీగా పేరుపొందిన కలువకొలను వెంకట్రామయ్య, గోదావరి డెల్టా పితామహుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ వంటివారి గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అందరూ చదవవలసిన పుస్తకం ఇది.
– శిరందాసు నాగార్జున
94402 22914

➡️