టంగుటూరి ప్రకాశం పంతులు మనమడు గోపాలకృష్ణ మృతి

  • హైదరాబాద్‌లో ముగిసిన అంత్యక్రియలు

ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌ : స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ (59) సోమవారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో తన కుమారుని ఇంట మృతి చెందారు. ఆకస్మికంగా స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. గోపాలకృష్ణకు భార్య విజయలలిత, కుమారులు సాయిక్రాంత్‌, ప్రకాష్‌ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లో ముగిశాయి. టంగుటూరి ప్రకాశం పంతులు రెండో కుమారుడైన హనుమంతరావు, అన్నపూర్ణాదేవి దంపతులకు ప్రకాశం జిల్లా ఒంగోలులో గోపాలకృష్ణ జన్మించారు. 1993లో కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి, 2016 డిసెంబరు 31న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. చాలాకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గోపాలకృష్ణ మృతికి పలువురు పాత్రికేయులు నెమ్మాని సీతారామమూర్తి, ఎంవిఎస్‌ శాస్త్రి, రాధా రమణ గుప్తా జంధ్యం, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, మైనంపాటి సాయి, యువి రత్నం తదితరులు సంతాపం ప్రకటించారు.

➡️