Polavaram ప్రాజెక్టు చూస్తే బాధగా ఉంది

  • ఈ ఘోర తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారో తేలాలి
  • నష్టం చేసిన వారిపై చర్యలు
  • క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన అనంతరం సిఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు నుండి వల్లభనేని సురేష్‌ : పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితి చూస్తే బాధగా ఉందని, తీవ్ర ఆవేదన కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తొలిసారి పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించారు. ఉదయం 11.40కి ప్రాజెక్టు సమీపాన ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు చంద్రబాబు చేరుకున్నారు. మంత్రులు, ఇరిగేషన్‌ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వ్యూ పాయింట్‌ వద్ద నుండి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో కలియదిరిగి ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సందర్శించారు. స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాం, డయా ఫ్రం వాల్‌ తో పాటు 22, 23 గేట్ల దగ్గర నుండి ప్రాజెక్టును పరిశీలించారు. ఎడమగట్టు దగ్గర కుంగిన గైడ్‌ బండ్‌ ప్రాంతానికి వెళ్ల్లారు. గ్యాప్‌-3 ప్రాంతం, ఎగువ కాఫర్‌ డ్యాం ప్రాంతాన్ని చూశారు. అధికారులను పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. డయా ఫ్రం వాల్‌ దెబ్బతిన్న ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అయిదేళ్ల తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును జగన్‌ అహంకారంతో సర్వనాశనం చేశారని విమర్శించారు. నష్టం చేసిన వారిపై చర్యలు తప్పవని అన్నారు.నాటి ప్రభుత్వ విధ్వంస తీరుకు పోలవరం ఒక కేస్‌ స్టడీ లాంటిదని చెప్పారు పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రానికి కరువు అనేది లేకుండా చేయొచ్చని భావించినట్లు చెప్పారు. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిలో 99 శాతం వాడుకునే అవకాశం ఉందని అన్నారు. 2014-19 మధ్య 72 శాతం మేర పనులను పూర్తి చేసినట్లు తెలిపారు.

సమాంతరంగా డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రూ.990 కోట్లు
‘గతంలో నేను సిఎంగా ఉన్నపుడు 30 సార్లు ప్రాజెక్టును సందర్శించా… ఇప్పుడు మళ్లీ 31వ సారి వచ్చాను.’ అని అన్నారు. ‘భూసేకరణలో కూడా బాధితులను ఒప్పించి ముందుకు వెళ్లాం. కానీ వైసిపి ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండర్‌ అంటూ ఏజెన్సీని మార్చారు, అధికారులను మార్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రెండుసార్లు వచ్చిన వరదలతో డయాఫ్రం వాల్‌ నాలుగు చోట్ల దెబ్బతింది. డయా ఫ్రం వాల్‌ 35 శాతం దెబ్బతింది. దీనివల్ల తీవ్ర నష్టం జరిగింది. డయాఫ్రం వాల్‌ పై గతంలో మేం ఖర్చు చేసింది రూ.446 కోట్లు అయితే… జగన్‌ నిర్వాకం వల్ల ప్రస్తుతం రిపేర్లు చేయడానికి రూ.447 కోట్లు అవుతుంది… అయినా పూర్తిస్థాయిలో బాగవుతుందనే నమ్మకం లేదని అధికారులు చెప్తున్నారు. రెండో ప్రణాళిక ప్రకారం సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది.’ అని చెప్పారు. ‘ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యామ్‌ రూ.550 కోట్లతో నిర్మాణం జరిగింది. గత ప్రభుత్వ నిర్వాకంతో చివర్లో ఉన్న గ్యాప్‌ పూర్తి చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. గైడ్‌ బండ్‌ కూడా కుంగిపోయింది. ఇవన్నీ చక్కదిద్దాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో ఇప్పటికీ అధికారుల వద్ద నిర్ధిష్టమైన లెక్కలు లేవు. 2019 నుండి ఏజన్సీలను మార్చకుండా పనులు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది.
ఇప్పుడు ఈ రిపేరు పనులకే నాలుగు సీజన్లు పడుతుందని అధికారులు చెప్తున్నారు. అది కూడా అనుకున్న ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితేనే” అని చంద్రబాబు అన్నారు.

చిక్కుముళ్లు వేశారు
”ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంగా మారతాడని చెప్పడానికి పోలవరం ఒక కేస్‌ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీనిపై చర్చించాలి… జరిగిన నష్టం ప్రతి ఒక్కరికీ తెలియాలి… ఏ ఒక్కటీ దాచిపెట్టకూడదు. కాఫర్‌ డ్యాం ద్వారా నీళ్లు లీకేజీ కంట్రోల్‌ అవ్వకపోతే డయాఫ్రం వాల్‌ పనులు చేయడం కుదరదు. లీకేజీ ద్వారా వచ్చిన నీళ్లు ఎత్తిపోయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. జగన్‌ చేతకాని తనంతో ప్రాజెక్టుకు చిక్కు ముళ్లు వేశారు.’ అని అన్నారు.

లోతుగా అధ్యయనం చేస్తున్నా..
‘నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు సందర్శనకు వస్తే అడ్డుకున్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును ప్రజలకు చూపించాం. ఇది ప్రజల ప్రాజెక్టు. ఈ సీజన్‌ అయిపోయింది… డిసెంబర్‌ వరకూ ఏ పనీ చేయడానికి కుదరదు. ప్రాజెక్టుపై లోతుగా అధ్యయనం చేస్తున్నా.’ అని చెప్పారు. ‘పోలవరాన్ని వివాదాలకు కేంద్రంగా మార్చారు. ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలి… నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. కేంద్రంతో కూడా దీనిపై సంప్రదింపులు జరిపి ముందుకెళ్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఎంఎల్‌ఎలు, అధికారులు పాల్గొన్నారు.

➡️