IPL 2024: ఉప్పల్‌లో పరుగుల సునామీ

  • విజృంభించిన అభిషేక్‌, హెడ్‌, క్లాసెన్‌
  • ఐపిఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ నమోదు
  • ముంబయిపై 31పరుగుల తేడాతో గెలుపు

సన్‌రైజర్స్‌ అంటే ఫ్లవర్‌ కాదు, ఫైర్‌. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఐపిఎల్‌ 2024లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈడెన్‌గార్డెన్స్‌లో భారీ ఛేదనలో మెప్పించిన కమిన్స్‌సేన.. సొంతగడ్డ ఉప్పల్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఊచకోత కోసింది. ట్రావిశ్‌ హెడ్‌ (62), అభిషేక్‌ శర్మ (63), హెన్రిక్‌ క్లాసెన్‌ (80), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (42) దంచికొట్టడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపిఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లను చీల్చిచెండాడిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ రికార్డు సాధించారు.
హైదరాబాద్‌ : ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఫైరింగ్‌ మోత మోగించింది. బ్యాటింగ్‌ లైనప్‌లో ముగ్గురు బ్యాటర్లు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో కదం తొక్కటంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలోనే అత్యధిక స్కోరు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నమోదు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (80 నాటౌట్‌, 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (63, 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), ట్రావిశ్‌ హెడ్‌ (62, 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీలు నమోదు చేశారు. ఎడెన్‌ మార్‌క్రామ్‌ (42 నాటౌట్‌, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు సమిష్టిగా ముంబయి ఇండియన్స్‌ బౌలర్లపై విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో హార్దిక్‌ పాండ్య, శామ్స్‌ ములాని, గెరాల్డ్‌ కోయేట్జిలు తలా ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ తరువాత లక్ష్యచేధనలో ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులు మాత్రమే చేయగలిగింది.రికార్డు ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ పోరాడినా.. కొండంత లక్ష్యానికి దూరంగానే ఉండిపోయారు. లోకల్‌ బారు తిలక్‌ వర్మ (64, 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), టిమ్‌ డెవిడ్‌ (42 నాటౌట్‌, 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (26), ఇషాన్‌ కిషన్‌ (34), నమన్‌ దిర్‌ (30) రాణించారు. దీంతో హైదరాబాద్‌ 31 పరుగులతో ఘనవిజయం సాధించింది.
టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ సమీక్ష చేసుకున్న సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను బలోపేతం చేసేందుకు తుది జట్టులోకి ట్రావిశ్‌ హెడ్‌ను తీసుకుంది. ఈ నిర్ణయమే సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ గతిని మార్చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (11, 13 బంతుల్లో 1 ఫోర్‌) తోడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన ట్రావిశ్‌ హెడ్‌ (63) విరుచుకుపడ్డాడు. నెమ్మదిగా ఆడుతున్న మయాంక్‌ నిష్క్రమణతో సన్‌రైజర్స్‌ కలిసొచ్చింది. అగ్నికి వాయువు తోడైనట్టు ట్రావిశ్‌ హెడ్‌కు అభిషేక్‌ శర్మ (63) జతకలిశాడు. దీంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ట్రావిశ్‌ హెడ్‌ 18 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. సన్‌రైజర్స్‌ తరఫున వేగవంతమైన అర్థ శతకం రికార్డు సాధించాడు. కానీ ఆ రికార్డును అభిషేక్‌ శర్మ స్వల్ప వ్యవధిలో చెరిపేశాడు. రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టిన అభిషేక్‌ శర్మ.. 16 బంతుల్లో అర్థ సెంచరీ బాదాడు. హెడ్‌ జోరుతో 4.4 ఓవర్లలో 50 పరుగులు చేసిన హైదరాబాద్‌.. అభిషేక్‌ దెబ్బకు 6.6 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్‌ చేరుకుంది. ట్రావిశ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ ఊచకోతకు 10.2 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 150 పరుగుల మార్క్‌ చేరుకుని భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. అర్థ సెంచరీల అనంతరం హెడ్‌, అభిషేక్‌ అవుటైనా.. అప్పటికే హెన్రిచ్‌ క్లాసెన్‌ దండయాత్రకు వేదిక తయారైంది. వచ్చీ రాగానే విరుచుకుపడిన హెన్రిచ్‌ క్లాసెన్‌ ఈడెన్‌ గార్డెన్‌ జోరు కొనసాగించాడు. 1 ఫోర్‌, ఐదు సిక్సర్లతో 23 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఎడెన్‌ మార్‌క్రామ్‌ (42) క్లాసెన్‌కు చక్కగా సహకరించాడు. 20 ఓవర్లలో 3 వికెట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 277 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ను తలపించింది. ట్రావిశ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌ త్రయం ముంబయి ఇండియన్స్‌ బౌలర్లపై విరుచుకుపడింది. డెత్‌ ఓవర్లలో క్లాసెన్‌ను నిలువరించేందుకు తొలుత ముంబయి ఇండియన్స్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రాను బౌలింగ్‌కు దూరంగా ఉంచింది. కానీ ఆరంభంలోనే హెడ్‌, అభిషేక్‌ దూకుడుతో బుమ్రా అనుకున్న దానికంటే ముందుగానే బంతి అందుకోవాల్సి వచ్చింది. అయినా, సన్‌రైజర్స్‌ దూకుడులో ఎటువంటి మార్పు లేదు. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా ఒక్కడే ఓవర్‌కు 9 పరుగులు ఇవ్వగా.. మిగతా అందరూ 10కిపైగా పరుగులు ఇచ్చుకున్నా రు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నెలకొల్పిన 263/5 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును బలమైన బౌలింగ్‌ దళం కలిగిన ముంబయి ఇండి యన్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బద్దలుకొట్టింది.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (సి) డెవిడ్‌ (బి) హార్దిక్‌ పాండ్య 11, ట్రావిశ్‌ హెడ్‌ (సి) నమన్‌ దిర్‌ (బి) కోయేట్జి 62, అభిషేక్‌ శర్మ (సి) నమన్‌ దిర్‌ (బి) పియూశ్‌ చావ్లా 63, ఎడెన్‌ మార్‌క్రామ్‌ నాటౌట్‌ 42, హెన్రిచ్‌ క్లాసెన్‌ నాటౌట్‌ 80, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం : (20 ఓవర్లలో 3 వికెట్లకు) 277.

వికెట్ల పతనం : 1-45, 2-113, 3-161. బౌలింగ్‌ : క్వెనా మాపాకా 4-0-66-0, హార్దిక్‌ పాండ్య 4-0-46-1, జశ్‌ప్రీత్‌ బుమ్రా 4-0-36-0, గెరాల్డ్‌ కోయేట్జి 4-0-57-1, పియూశ్‌ చావ్లా 2-0-34-1, శామ్స్‌ ములాని 2-0-33-0.
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి)అభిషేక్‌ (బి)కమిన్స్‌ 26, ఇషాన్‌ కిషన్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)షాబాజ్‌ 34, నమన్‌ ధీర్‌ (సి)కమిన్స్‌ (బి)ఉనాద్కట్‌ 30, తిలక్‌ వర్మ (సి)మయాంక్‌ (బి)కమిన్స్‌ 64, హార్దిక్‌ (సి)క్లాసెన్‌ (బి)ఉనాద్కట్‌ 24, టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 42, షెఫర్డ్‌ (నాటౌట్‌) 15, అదనం 11. (20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 246పరుగులు.

వికెట్ల పతనం: 1/56, 2/66, 3/150, 4/182, 5/224 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-53-0, ఉనాద్కట్‌ 4-0-47-2, షాబాజ్‌ 3-0-3-1, కమిన్స్‌ 4-0-35-2, ఉమ్రన్‌ మాలిక్‌ 1-0-15-0, మార్కండే 4-0-52-0

➡️