బలవంతం చేస్తే వాట్సాప్‌ సేవలు బంద్‌..!

Apr 27,2024 10:39 #Business

వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించలేం
4(2) సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధం
ఢిల్లీ హైకోర్టుకు మెటా వెల్లడి
న్యూఢిల్లీ : వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించలేమని వాట్సాప్‌ యాప్‌ మాతృసంస్థ మెటా స్పష్టం చేసింది. మోడీ సర్కార్‌ 2021లో తీసుకువచ్చిన ఐటి నిబంధనలను సవాల్‌ చేస్తూ వాట్సాప్‌, మెటా కంపెనీలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆయా పిటిషన్లపై గురువారం ఢిల్లీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ వైఖరీపై మెటా ధీటుగా సమాధానం చెప్పింది. మెసేజ్‌ల ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విషయంలో బలవంతం చేస్తే భారత్‌ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. వినియోగదారుల సమాచారానికి గోప్యత లేకుండా కేంద్ర ఐటి శాఖ ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌ పేరిట మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపింది.
కొత్త ఐటి నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్‌ ప్రకారం.. సోషల్‌ మీడియాలో ఏదైనా మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు ఎవరికి పంపారనే వివరాలు ప్రభుత్వం అడిగిన సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వ వైఖరిని వాట్సాప్‌ కంపెనీ సవాలు చేస్తోంది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కుదరదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏ సమాచారం కోరుతుందో ముందుగానే తెలియదని.. కోరిన సమయంలో డీక్రిప్ట్‌ చేయడానికి కోట్లాది సందేశాలను ఏళ్ల తరబడిగా భద్రపర్చాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపింది. ”ఈ 4(2) సెక్షన్‌ నిబంధన వ్యక్తుల గోప్యతకు వ్యతిరేకం. రాజ్యాంగ విరుద్ధం. సామాజిక మాధ్యమ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే దీన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల మేం కోట్లాది మెసేజ్‌లను కొన్నేళ్ల పాటు భద్రపర్చాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదు” అని వాట్సప్‌ తరఫు న్యాయవాదులు వాధించారు.
ప్రస్తుతం ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా అమలులో ఉందా? అన్న ప్రశ్నకు బ్రెజిల్‌ లాంటి దేశాల్లో సైతం ఈ రూల్స్‌ లేవని మెటా తరఫున న్యాయవాదులు తెలిపారు. ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ విషయంలో రాజీ పడితే భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతా హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుందని వాధించింది. గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని వాట్సాప్‌ నమ్ముతుందని, బలమైన ఎన్‌క్రిప్షన్‌ స్టాండర్స్‌తో ఆ హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. వాట్సాప్‌ ఇతర దేశాలలో కూడా ఇలాంటి డిమాండ్లను ఎదుర్కొంది. కానీ ఎన్క్రిప్షన్‌ పట్ల కంపెనీ వైఖరిపై స్థిరంగా ఉంది. వినియోగదారుల నమ్మకాన్ని కాపాడుకోవడానికి, అనధికారిక యాక్సెస్‌ నుంచి సెన్సిటివ్‌ ఇన్‌ఫర్మేషన్‌ను రక్షించడానికి ఎన్‌క్రిప్షన్‌ స్టాండర్డ్స్‌ కీలకమని భావిస్తోంది. వాస్తవానికి వాట్సాప్‌ బాగా గుర్తింపు పొందడానికి సెక్యూరిటీనే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే తమ వేదికలో మెసేజ్‌లకు ఉన్న ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని తొలగించాలని చెబితే తాము భారత్‌ నుంచి తాము వెళ్లిపోతామని.. సేవలను నిలిపివేస్తామని వెల్లడించింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.

➡️