కార్పొరేట్ల కోసమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌

  • మణిపూర్‌ ఘటనలో బిజెపికే వైసిపి మద్దతు
  • మొదటి, రెండు దశల ఎన్నికల్లో మోడీకి నిరాశా నిస్పృహలు
  • అత్యాచారాలకు పాల్పడిన వారికి మద్దతు ఇవ్వడం శోచనీయం
  •  ఇండియా వేదిక నాయకులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ, వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు భూములను కట్టబెట్టడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఉద్దేశమని, నీతి ఆయోగ్‌ చెప్పిందనే పేరుతో ఈ యాక్ట్‌ను అధ్యయనం చేయకుండా యథాతథంగా అమలు చేయడం దారుణమని ఇండియా వేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కడప డిసిసి కార్యాలయంలో ఇండియా వేదిక నాయకులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల, ఆప్‌ నాయకులు తిరుమలరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 20 శాతం భూ వివాదాలను పరిష్కరిస్తామనే పేరుతో 80 శాతం భూములను ప్రమాదంలో పడేయడంలో ఉద్దేశమేమిటో చెప్పాలని నిలదీశారు. ఇటువంటి చట్టానికి టిడిపి సైతం అసెంబ్లీలో మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.2,200 కోట్లు ఇచ్చామని ప్రధాని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో 400 మంది మహిళలపై అత్యాచారం చేసిన నాయకులకు బిజెపి మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. దేశంలోని మహిళలు బిజెపి అభ్యర్థులకు ఒక్కఓటూ వేయకూడదని పిలుపునిచ్చారు. బిజెపి వస్తే లౌకికవాదానికి, రాజ్యాంగానికి ప్రమాదకరమని తెలిపారు. ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వంటివి ఇకపై ఉండబోవని హెచ్చరించారు. పోలవరం, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు పరిశ్రమ వంటి హామీలను పదేళ్లుగా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తోందని విమర్శించారు.
కె.రామకృష్ణ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక, ఎన్‌డిఎ కూటమి మధ్యే ప్రధాన పోటీ నెలకొందని తెలిపారు. ప్రధాని మోడీ… బిజెపికి 370 సీట్లు, ఎన్‌డిఎకు 400 సీట్లు వస్తాయని చెప్పారని, మొదటి, రెండు దశల ఎన్నికలతో ఆయనలో నిరాశా నిస్ఫృహలు అలుముకున్నాయని అన్నారు. మూడో దశలో కూడా మెజార్టీ కష్టమని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మోజర్జీ రాదని అర్థమవడంతో దక్షిణాది రాష్ట్రాలైన ఎపి, తెలంగాణ, తమిళనాడులపై పడ్డారని విమర్శించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజెపికి ఒక్క సీటూ వచ్చే అవకాశం లేదని తేలిపోయిందన్నారు. వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేయడంలో కేంద్రం సహాయం కూడా ఉందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టులు చేశారని, రాష్ట్రంలో లిక్కర్‌ స్కామ్‌ నడుస్తోందని ఎపి బిజెపి అధ్యక్షులు పురంధేశ్వరి ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మూడు రాజధానుల డ్రామాకు కేంద్రం సహకరించలేదా? అని ప్రశ్నించారు. దేశంలో లౌకికవాదం, రాజ్యాంగం కొనసాగాలంటే ఇండియా వేదికను గెలిపించాలని కోరారు.
షర్మిల మాట్లాడుతూ మణిపూర్‌లో క్రిస్టియన్ల ఊచకోతపై పార్లమెంట్‌లో తీర్మానాలకు బిజెపికి మద్దతుగా వైసిపి ఓటేసిందని గుర్తు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడడం ముస్లిం ఓట్లలో చీలిక రాకుండా వైసిపికి రాజకీయ లబ్ధి చేకూర్చడమేనని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ ప్రమాదంలో పడిందన్నారు. గత ఐదేళ్లుగా బిజెపికి టిడిపి, వైసిపి మద్దతు ఇస్తున్నాయని వివరించారు. వైసిపి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి నాయకులు చెప్తున్నారని, బిజెపికి జగన్‌ తొత్తు కాబట్టే ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వకపోయినా బిజెపి మోసం చేసిందని వివరించారు. దీనిపై వైసిపి ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు చొప్పున పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ అమలులో బిజెపి విఫలమైందని, వీటిపై ప్రశ్నించే ధైర్యం ఇండియా వేదికకు మాత్రమే ఉందని అన్నారు. వైఎస్‌ జగన్‌ వేసిన కుక్క బిస్కెట్లు తినే వారు తాను రూ.వెయ్యి కోట్ల పనులు అడిగానని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఇండియా వేదిక నాయకులు జి.ఓబులేసు, జి.చంద్రశేఖర్‌, మనోహర్‌, ఐఎన్‌.సుబ్బమ్మ, కామనూరు శ్రీనివాసులరెడ్డి వి.అన్వేష్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు తిరుమలరెడ్డి, కమలాపురం ఇండియా వేదిక అభ్యర్థి గాలిచంద్ర పాల్గొన్నారు.

 

➡️