ముస్లిముల రిజర్వేషన్‌కు కోర్టులో పోరాడుతా

May 3,2024 00:30 #2024 election, #chandrababu, #Kadapa, #TDP
  •  కడప, విజయవాడల్లో హజ్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తా : చంద్రబాబు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రాయచోటి : తాము అధికారంలోకి వస్తే ఖరీదైన లాయర్లను పెట్టి ముస్లిముల రిజర్వేషన్‌ కోసం కోర్టులో పోరాటం చేస్తామని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు తెలిపారు. మైనార్టీల రక్షణ బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కడప, విజయవాడల్లో హజ్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, కడప జిల్లా కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ప్రజాగళంలో సభల్లో ఆయన ప్రసంగించారు. హజ్‌యాత్రకు వెళ్లే వారికి రూ.లక్ష చొప్పున అందిస్తామని తెలిపారు. దుల్హన్‌, రంజాన్‌తోఫా వంటి పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. రూ.100 కోట్లతో నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, మైనార్టీ కార్పొరేషన్‌ కింద రూ.ఐదు లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచడమే తమ విధానమని తెలిపారు. అలా చేయకుండా బటన్‌ నొక్కుతున్నామని చెప్పడం సరికాదన్నారు. రాయచోటి, చిత్తూరు బైపాస్‌ రోడ్లలో రూ.200 కోట్ల విలువైన స్థలాలు కబ్జా చేశారని, రాయచోటి డ్రెయినేజీ పనుల పేరుతో రూ.200 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. వైసిపి ఎంపి పి.మిధున్‌రెడ్డి పార్లమెంట్‌లో ఎన్‌ఆర్‌సి, సిఎఎ చట్టాలపై ఓటు వేశారని, ఇటువంటి నాయకులను నమ్మొద్దని కోరారు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని హామీ ఇచ్చారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని వెలిగల్లు, శ్రీనివాసపురం, ఝరికోన రిజర్వాయర్లు పూర్తి చేస్తామన్నారు. చిన్నమండెంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసి పాలిటెక్నికల్‌ కళాశాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ అవినాష్‌రెడ్డిని పక్కన బెట్టుకుని చిన్నపిల్లోడని జగన్‌ అంటున్నారని, చిన్నపిల్లోడిని బడికి పంపాలిగానీ, పార్లమెంట్‌కు పంపిస్తారా? అని ప్రశ్నించారు.
సిఎం సొంత జిల్లాలో కరువు ఉందని అధికారులు చెప్పినా జగన్‌ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చారని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, మద్యం, విద్యుత్‌ బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే బిపి, సుగర్‌ మందులకు ఇంటింటికీ ఉచితంగా సరఫరా చేస్తామని, ప్రతి మండల కేంద్రంలో జనరిక్‌ మందుల దుకాణాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.1.50 లక్షల కోట్లతో బిసి సబ్‌ప్లాన్‌ తెస్తామని, 50 ఏళ్లకే బిసిలకు, మైనార్టీలకు పింఛను ఇస్తామన్నారు. చంద్రన్న బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బిజెపి పార్లమెంట్‌ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రాజపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమ్మర్తి జగన్మోహన్‌రాజు, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

➡️