మోడీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ఇసి నిష్పాక్షికత – సీతారాం ఏచూరి విమర్శ

Apr 20,2024 11:09 #Sitaram Yechury, #speech

కొజికోడ్‌: ఎన్నికల ర్యాలీల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తున్నా, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆయన గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మతాన్ని తురుపుముక్కగా వాడుతూ ప్రధానే స్వయంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ప్రధాని విద్వేషపూరిత వ్యాఖ్యల గురించి నిర్దిష్ట సమాచారాన్ని, ఆధారాలను ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో సిపిఎం పేర్కొందని, అయినా, ఇప్పటి వరకు కమిషన్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏచూరి తెలిపారు. ఇది ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల సంఘం తటస్థ పాత్ర చాలా అవసరమని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, మతోన్మాద చర్యలను తిప్పికొట్టడంలో వామపక్షాలు సమర్థవంతమైన పాత్ర నిర్వహిస్తున్నాయని అన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా కేంద్రంలో బిజెపిని గద్దె దించి, వామపక్షాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.
” పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం విధి అని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి యథేచ్ఛగా ఉల్లంఘనలకు గురవుతున్నా ఇసి మౌనంగా ఉంటే, ఎన్నికల్లో పారదర్శకత, స్వేచ్ఛ ఇంకెక్కడుంటుంది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండవు.” అని ఏచూరి అన్నారు.
బీహార్‌లోని నెవడాలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ‘సనాతన ధర్మానికి వ్యతిరేకం’ , రామనవమిని కూడా వ్యతిరేకిస్తారంటూ విద్వేషం వెళ్లగక్కారు. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధం. ప్రధాని మతతత్వ, విభజన రాజకీయాలకు పదును పెడుతుంటే ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఏచూరి విమర్శించారు.
. దేశంలో స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అయిన తరువాత కూడా నిరుద్యోగం అత్యధికంగా ఉంది, పట్టభద్రుల్లో నిరుద్యోగిత 42 శాతానికి చేరింది. ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యమైన ఈ రెండు అంశాలపై బిజెపి తన మేనిఫెస్టోలో ఒక్క ముక్క కూడా పేర్కొనలేదని ఏచూరి విమర్శించారు.

➡️