ఢిల్లీ మహిళా కమిషన్‌పై కక్ష సాధింపు

  •  223 మందిని తొలగిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉత్తర్వులు

న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్‌ (డిసిడబ్ల్యు)లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ తొలగించి మొత్తంగా మహిళా కమిషన్‌ కార్యాలయానికే తాళాలు వేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ యత్నిస్తున్నారని ఢిల్లీ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్‌ విమర్శించారు. ”ఈ వ్యక్తులు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు? ప్రజల స్వేదం, రక్తంతో ఈ సంస్థ రూపుదిద్దుకుంది. ఈ సిబ్బందికి రక్షణ, భద్రత కల్పించాల్సింది పోయి దీనిని మూసేయాలని చూస్తున్నారు. ” కావాలంటే నన్ను జైల్లో పెట్టండి, అంతేకానీ మహిళలను అణగదొక్కద్దు.” అని స్వాతి మలివాల్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మహిళా కమిషన్‌లో మొత్తంగా 90మంది సిబ్బంది వున్నారు. వారిలో కేవలం ఎనిమిది మందినే ప్రభుత్వం ఇచ్చింది. మిగిలిన వారందరూ మూడేసి మాసాల చొప్పున కాంట్రాక్టుపై వున్నారు. మహిళా కమిషన్‌లో కాంట్రాక్ట్‌ సిబ్బంది అందరినీ తొలగించాలంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఒక తుగ్లక్‌ ఆదేశం జారీ చేశారని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223మంది ఉద్యోగులను తొలగించాలంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనా గురువారం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నరు తానే సర్వ స్వతంత్రుడిని అన్నటుగా వ్యవహరిస్తున్నారు. విధి విధానాలను తుంగలో తొక్కారని ఆమె విమర్శించారు.

➡️