సంభాల్‌ ఘటనలు : ముస్లింలపై మాటలూ దాడులూ

ఈ రోజుల్లో నరేంద్ర మోడీ కనీసం సత్యానికి కాస్త అటూ ఇటూగానైనా మాట్లాడలేకపోతున్నారు. తాజాగా వారణాసిలో నామినేషన్‌ దాఖలు చేసిన తర్వత ఈ కోవలోనే ఆయన కొన్ని అసత్య వాక్కులు నుడివారు. ‘ఎక్కువ మంది పిల్లలు కనేవారు’ అన్న మాట తాను ముస్లింలను ఉద్దేశించి అనలేదని చెప్పుకొచ్చారు. ‘ఏ రోజునైతే నేను హిందూ ముస్లింలను వేరుగా చూస్తానో ప్రజా జీవితంలో వుండే అర్హత కోల్పోతాను’ అంటూ దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్య కూడా చేశారు. ఎందుకంటే ఏప్రిల్‌ 9న బాన్స్‌వారాలో ఆయన చేసిన ప్రసంగాన్ని ఆలకించిన వారెవరైనా అది ముస్లింలను లక్ష్యంగా చేసినట్టు చాలా తేలిగ్గానే అర్థం చేసుకోగలుగుతారు. ‘చొరబాటుదారులు’, ‘ఎక్కువ మందిని కనేవారు’ అన్నది ముస్లింల గురించనే భావిస్తారు. పైగా ఆ సందర్భం కూడా స్పష్టంగా వుంది. దేశ వనరులపై ముస్లింలకు వాటా వుందని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రకటనను ఆయన ఉటంకించారు కూడా. నిజానికి ముస్లింలు అధిక సంతానం కంటారనేది 2002 గుజరాత్‌ ఎన్నికల నాటి నుంచి మోడీ నిరంతర ఉవాచగా వుంటోంది. ‘మేము అయిదుగురం…మాకు అయిదుగురు…’ అంటూ ఆయన వారిని వెక్కిరించారు. ఆ మత మారణకాండ బాధితులైన ముస్లిం శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు ‘సంతానోత్పత్తి కేంద్రాలుగా’ తయారయ్యాయని అత్యంత బాధ్యతా రహితంగా మాట్లాడారాయన. ఈ హిందూ ముస్లిం పాటే ముదిరి తర్వాత ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కబరిస్థాన్‌, శ్మశాన్‌ ఘాట్‌ వంటి వాటి గురించి మాట్లాడేందుకు దారి తీసింది. ప్రధాని, ఆయన హంగుదార్లు ఈ విధంగా ముస్లింలను రాక్షసులుగా చిత్రిస్తూ వారిపై దాడి చేయడం క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపింది. వారి ఓటు హక్కు తొలగించే చర్యలకు దారితీసింది.

శంభాల్‌లో జరిగిందేమిటి?
మే 7వ తేదీన మూడవ దశ పోలింగ్‌లో పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని శంభాల్‌ పార్లమెంటరీ నియోజకర్గంలో జరిగింది అదే. ఈ నియోజక వర్గంలోని ముస్లిం జనాభా అధికంగా వున్న అనేక గ్రామాలలో వారి ఓటు హక్కు నిరాకరించబడింది. ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాల బయట నిరీక్షిస్తున్న ముస్లింలపై పోలీసులు దాడికి దిగారు. న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘స్క్రోల్‌’లో ఈ పరిణామాన్ని విశదంగా ప్రచురించారు. మన్సురాపూర్‌, ఓవరీ, షెబాజ్‌పూర్‌ కలన్‌, ముబారక్‌పూర్‌ తదితర గ్రామాలలో ఇదే పునరావృతమైంది. ఉదయం పది పదకొండు గంటల మధ్య ముప్పై నలభై మంది పోలీసుల గుర్రాల దండు రావడం, అక్కడ ఓటు వేయడానికి కాచుకుని వున్న ఓటర్ల ఆధార్‌ కార్డులు, ఓటింగ్‌ స్లిప్‌లు లాగేసుకోవడం ఇదే తంతు. మహిళలని కూడా చూడకుండా వారిలో అనేక మందిని లాఠీలతో బాది, ఫైబర్‌ బెత్తాలతో కొట్టి తరిమేశారు. ఓవ్రీ లోని ఒక జూనియర్‌ హైస్కూలులోని పోలింగ్‌ కేంద్రంలోనైతే ఓటర్లను ఎలా తరిమేశారో చిత్రించిన వీడియో కూడా వుంది. ఈ పోలింగ్‌ స్టేషన్లలో ఎక్కువగా అస్ములి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వున్నాయి. సంభాల్‌ పట్టణంలోని కొన్ని ముస్లిం ప్రాంతాలలోనైతే పోలింగ్‌ కేంద్రాలలోని ఓటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ముస్లింలు లేని మరే గ్రామాలపైన గాని, పోలింగ్‌ కేంద్రాలపైన గాని ఈ విధమైన పోలీసు దాడులు జరగలేదు. ఈ విధంగా అనేక పోలింగ్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్‌ జరపడం స్థానిక విషయంగానో లేక చెదురు మదురు ఘటనగానో జరిగే అవకాశం లేదు. జిల్లా స్థాయి పోలీసు అధికారులకు తెలిసీ లేదా ఆమోదంతో ఇవి జరిగి వుండాలి. కుందరికి అసెంబ్లీ ఎంఎల్‌ఎ కూడా అయిన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి జియా ఉర్‌ రహ్మాన్‌ ముస్లిం ఓటర్లపై దాడికి జరిగిన కుట్రగా దీన్ని అభివర్ణించారు. సంభాల్‌ లోక్‌సభ స్థానం 2019 ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీ గెలుచుకున్నది.

ఇ.సి ఉపేక్షకు వెనుక..
ఈ ఘటనలపై పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యా తీసుకోలేదు. బాధితులలో ఒకరిని పోలీసులు ఒత్తిడి పెట్టి అసలు ఏ దాడి జరగలేదని వాంగ్మూలం తీసుకున్న సందర్భం కూడా వుంది. ఉత్తర ప్రదేశ్‌లో ముస్లింలు ఇప్పటికే రెండవ శ్రేణి పౌరులుగా మార్చబడ్డారని సంభాల్‌ సంఘటన నిరూపించింది. అంతకు ముందు పోలీసులు ఓటర్లను బెదిరించిన, నిరోధించిన ఘటనలపై ఇదే విధంగా మొదటి దశ పోలింగ్‌ తర్వాత కూడా సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. రామ్‌పూర్‌, మొరాదాబాద్‌, ముజఫర్‌ నగర్‌ నియోజక వర్గాలలో జరిగిన ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేసినప్పుడు ఎన్నికల సంఘం సత్వరం రంగంలోకి దిగి వుండాల్సింది. దాడికి గురైన పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ జరిపి దోషులైన పోలీసులపై చర్య తీసుకోవలసింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ముస్లింలపై ప్రధాన మంత్రి ఇలా మాట్లాడినా తప్పుగా భావించని ఎన్నికల సంఘం ముస్లిం ఓటర్ల హక్కులను కాపాడుతుందని ఆశించడం అసాధ్యం. నరేంద్ర మోడీ ఆలపిస్తున్న ముస్లిం వ్యతిరేక వికృత రాగాలనూ ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు సంభాల్‌ నియోజకవర్గంలో ముస్లింల ఓటు హక్కును కాలరాచే దాడులనూ ప్రత్యక్షంగా కలిపే విధాన రేఖ ఒకటే.

( మే15 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం )

➡️