నేటితో ముగియనున్న ఐపిఎల్‌ లీగ్‌ పోటీలు

May 19,2024 08:32 #2024 ipl, #Cricket, #Sports
  • 21 నుంచి ప్లే-ఆఫ్స్‌, 26న ఫైనల్‌

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 పోటీలు చివరి దశకు చేరాయి. మార్చి 22న చిదంబరం స్టేడియంలో బెంగళూరు-చెన్నై జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపిఎల్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. ఆదివారం రాజస్తాన్‌-కోల్‌కతా జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్‌తో ఈ సీజన్‌ లీగ్‌ పోటీలు ముగియనున్నాయి. శనివారం నాటికి మూడు ప్లే-ఆఫ్‌ బెర్త్‌లు ఖాయం కాగా.. నాల్గో బెర్త్‌కోసం బెంగళూరు-చెన్నై జట్లు వేచిచూస్తున్నాయి. లక్నో, ఢిల్లీ, గుజరాత్‌, పంజాబ్‌, ముంబయి జట్లు ప్లే-ఆఫ్‌ రేసునుంచి ఇప్పటికే నిష్క్రమించాయి. ఐదుసార్లు టైటిల్‌ విజేత ముంబయి జట్టు ఈ సీజన్‌లో అభిమానులకు తీవ్ర వేదనను మిగిలించింది. ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచుల్లో 10మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక గత మూడు సీజన్లలో అట్టడుగు స్థానంలో నిలిచి అభిమానులకు తీవ్ర వేదనను మిగులుస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఈసారి ప్లే-ఆఫ్‌కు చేరింది. ఇక రెండుసార్లు టైటిల్‌ విజేత కోల్‌కోతా, ఒక్కోసారి టైటిల్‌ను ముద్దాడిన రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌ ప్లే-ఆఫ్‌ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి.
ఇక 2022 టైటిల్‌ విజేత, 2023 రన్నరప్‌ గుజరాత్‌ జెయింట్‌ ఈసారి ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. కెప్టెన్‌ మార్పు జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గత సీజన్‌ వరకు గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా ముంబయికి తరలడం.. ముంబయి జట్టు కెప్టెన్‌గా అతడు కొనసాగడంతో ఈ రెండుజట్లు మరో రెండు లీగ్‌ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే-ఆఫ్‌ రేసునుంచి వైదొలిగాయి. ఆటగాళ్ల ప్రదర్శన, సమన్వయ లోపానికి ఇది దారితీసింది.
ఇంపాక్ట్‌ ప్లేయర్‌పై..
ఈ సీజన్‌లో ప్రవేశపెట్టిన ఇంపాక్‌ ప్లేయర్‌పై విరాట్‌ కోహ్లి స్పందించాడు. జట్టు సమతుల్యతకు భంగం కలిగిస్తుందన్నాడు. దీంతో గేమ్‌ ప్లానింగ్‌ మొత్తం డిస్ట్రబ్‌ అవుతుందన్నాడు. బౌలింగ్‌ ఒకరితో, బ్యాటింగ్‌ మరోకరు చేయాల్సి రావడంతో ఎవరిని ఏ స్థానాల్లో ఉపయోగించుకోవాలనే విషయంలో ఆటగాళ్లందరిలోనూ గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందన్నాడు. అసలు ఇంపాక్‌ ప్లేయర్‌ అనవసరమే చెప్పుకొచ్చాడు.

– ప్రజాశక్తి స్పోర్ట్స్‌ కరస్పాండెంట్‌

➡️