‘ఓటు’ శక్తివంతమైన ఆయుధం

May 4,2024 05:40 #Articles, #edit page, #vote

మనకు ఎన్నికల వ్యవస్థ ఉంది. ప్రజాస్వామ్య దేశాల చరిత్రలో ఎన్నికలు ప్రాముఖ్యత గల ఘట్టం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది స్వేచ్ఛ, సమానత్వం, న్యాయాలను సాధించే ఏకైక ప్రభుత్వ రూపం కాబట్టి చాలా విలువైనది. ఇవన్నీ మంచి సమాజానికి చాలా ముఖ్యం. ప్రజలను, ఒక వ్యక్తి నిరంకుశత్వం కంటే కూడా రాజ్యాంగమే పాలి స్తుంది. పౌరులుగా, మానవులుగా మన హోదాను ప్రాథమిక హక్కులు రక్షిస్తాయి. పౌరుల మినహా యింపు, వారిపై విధించే నేరపూరిత చర్యలకు ఎన్నుకోబడిన నాయకులే బాధ్యత వహించాలి. ఈ నేపథ్యం ఉన్న ఎన్నికల మార్కెట్లో పార్టీలు ఓట్ల కోసం పోటీ పడుతున్నాయి.
సంక్లిష్టమైన 2024 ఎన్నికల షెడ్యూల్‌లో ఇప్పటికే మనలో కొందరు ఓటు వినియోగించుకోగా, కొందరు ఇంకా వినియోగించుకోవాల్సి ఉంది. సమ న్యాయ పాలన, క్రమబద్ధీకరించే స్వతంత్ర సంస్థలు, పౌరహక్కులు, బలహీన వర్గాల సంరక్షణ (ముఖ్యంగా మైనార్టీలు), పార్లమెంట్‌కు బాధ్యత వహించే కార్యనిర్వాహక వర్గం, అప్రమత్తంగా ఉండే మీడియా, పౌర సమాజం లాంటి ప్రజాస్వామిక మూల స్తంభాలు కూల్చివేయబడిన సమాజంలో మనం మన ఓటు హక్కును వినియోగిస్తున్నాం. తోటి పౌరులను మత ప్రాతిపదికన నిరంతరం లక్ష్యంగా చేసుకున్న సమాజంలో మనం ఓటును వినియోగిస్తున్నాం. ప్రజాస్వామ్యం అనే ధనిక ప్రపంచం ఏమీ లేనిదిగా బహిరంగమైంది. ఇప్పుడు మనకు కేవలం ఓటు హక్కు మాత్రమే ఉంది. రాజకీయ ప్రసంగాల్లో, ఆచరణల్లో నీచత్వాన్ని ప్రవేశపెట్టిన పార్టీని ఓడించడానికి మనం ఉపయోగించే ఓటు ఒక శక్తివంతమైన ఆయుధం. పున:పంపిణీ గురించి, రాజకీయాల్లో అట్టడుగున ఉన్న భారతీయులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం గురించి మాట్లాడే పార్టీకి ఓటు వేసే అవకాశం మనకు ఉంది.
బిజెపి మ్యానిఫెస్టో దేనికి సంబంధించింది అనేది స్పష్టంగా లేదు. ఎందుకంటే, ఆ పార్టీ మోడీ పేరుతో హామీలకు, కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను నిందించే రాజకీయ ప్రసంగాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో, సుదీర్ఘకాలంగా స్త్రీవాదులు డిమాండ్‌ చేస్తున్నట్లు గృహిణులకు అలవెన్సులు ప్రకటించారు. ప్రభుత్వ సంస్థల్లో, ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాల్లోకి ప్రవేశించే యువకులకు స్టైఫెండ్‌తో కూడిన శిక్షణ ఇస్తామని, ప్రభుత్వ రంగంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, మహిళలకు, కార్మికులకు, రైతులకు, వ్యాపారంలో, ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో అట్టడుగున వున్న వారికి సంవత్సరానికి లక్ష రూపాయల గ్రాంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ వాగ్దానం చేసింది. కాని మన తోటి పౌరులు జీవించడానికి విలువైన జీవితాన్ని అందించే విషయంలో రాజకీయ చైతన్యం గల ప్రజలుగా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం?
ఉదాహరణకు పేదరికాన్ని తీసుకుంటే, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభా వివరాలు ప్రభుత్వం విడుదల చేయనప్పటికీ, దారిద్య్ర రేఖ అంటే ఏమిటో మనకు చెప్పనప్పటికీ, పేదలు, ధనవంతులు, కానటువంటి మనం పూరి గుడిసెలు దాటి వెళ్ళేటప్పుడు అది మన రోజువారీ జీవితాల వెంట వస్తూనే ఉంటుంది. మండు వేసవిలో, ఎముకలు కొరికే చలిలో, వర్షాకాలంలో, తుఫాన్‌ సమయంలో మన దేశ రాజధాని వీధుల్లో ప్రజలు నిద్రించడం మనం చూస్తాం. ట్రాఫిక్‌ లైట్ల దగ్గర వికలాంగులు, చంటి పిల్లల్ని భుజాన వేసుకొన్న మహిళలు, చిన్న పిల్లలు బిచ్చమెత్తుకుంటూ మన చుట్టూ చేరతారు. చాలామంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పే నాయకుల మాటలు విశ్వసించే సంశయవాదులకు ఇదే తగిన రుజువు. ఎనభై మూడు కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్‌ పంపిణీ గురించి ప్రధానమంత్రి మాట్లాడతారు. కానీ తినడానికి తిండిని సంపాదించుకోలేని స్థితిలో ఉన్నవారు కూడా ఈ ప్రజలే. పేదరికానికి ఇంతకన్నా పెద్ద రుజువు అవసరమా?
అయితే పేదరికం గురించి సంగ్రహంగా మాట్లాడడానికి ఇది సరిపోదు. పేదరికానికి, అనారోగ్యానికి ఆర్థిక క్రమమే కారణమైతే పేదలపై విధించిన తప్పిదాలను సరిచెయ్యడానికి మనం బాధ్యత వహించాలి. నేను కారు నడుపుతూ, ఎలాంటి హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా రద్దీగా ఉండే రోడ్డుపై కారును నిలిపివేస్తే, నా వెనుక ఉన్న కార్లకు జరిగే నష్టానికి నేనే బాధ్యత వహించాలి. ఒకవేళ ట్రాఫిక్‌ లైట్ల దగ్గర స్థిరంగా నిల్చొని ఉన్న నా కారుపై, ఎవరైనా తమ కారుతో దూసుకొని వస్తే నాకు జరిగే నష్టానికి ఆ కారు నడిపే వ్యక్తి బాధ్యత వహించాలి. మన సమాజం చరిత్ర అంచులకు నెట్టి వేసిన వారికి, సామాజిక వివక్షతకు గురైన వారికి, మంచి జీవితాన్ని ప్రసాదించే వనరులు నిరాకరించబడిన వారికి, ఓటుకు భిన్నమైన రీతిలో గొంతెత్తి చాటే హక్కును కోల్పోయిన వారికి మనం రుణపడి ఉండాలి. చరిత్ర నుండి ప్రయోజనాలు పొందిన వారు, నష్టపోయిన వారికి రుణపడి ఉండాలి. ఇది, మంచి సమాజానికి ఉండే ప్రాథమిక నిబంధన. పేదరికాన్ని సృష్టించి, పున: సృష్టించిన సమాజంలో మనం భాగంగా ఉన్నాం కాబట్టి మనం తోటి పౌరులకు రుణపడి ఉండాలి. పేదలకు విధించ బడిన తప్పిదాలను సవరించాలి. పెరుగుతున్న ఆదాయాలకు అనుగుణంగా పౌరులు చెల్లించే ప్రగతిశీల పన్నుల విధానాన్ని సంపన్నులు అంగీకరించాలి. మానవ జీవన ప్రమాణాలకు దిగువన జీవిస్తున్న మన సొంత ప్రజలకు కనీసంగా మనం రుణపడి ఉండాలి. ప్రభుత్వం ఈ పన్నులను తమ స్వంత విజయాలను ప్రచారం చేసుకోవడం కోసం కాక ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తుంది.
నియంతలు ఉచిత రేషన్లను తమ వ్యక్తిగత సంచుల్లో ఇవ్వడానికి, పౌరుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు వెయ్యడానికి కూడా సిద్ధపడి ఉన్నారు కాబట్టి, డబ్బు మంజూరు చేసే విధానం కచ్చితంగా సామాజిక ప్రజాస్వామ్యం ఏర్పాటుకు దోహదం చెయ్యదు. తరువాత, పని చేసే సాధారణ హక్కుకు చాలా ప్రాధాన్యత ఉంది. కారల్‌ మార్క్స్‌ చెప్పినట్లు శ్రమ, మనిషి యొక్క స్వీయ వ్యక్తీకరణ. అందుకే పని చేసే హక్కును చట్టం చెయ్యాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న సామాజిక ప్రజాస్వామ్య రాజ్య లక్షణం. కొన్ని నిధులను మంజూరు చేయడం వల్ల మాత్రమే అసమానతలను అధిగమించలేం. దానికి ఒకవైపు ప్రగతిశీల పన్నుల విధానం అవసరం కాగా, అది ప్రతి పౌరునికి పని చేసే సాధారణ హక్కును కల్పిస్తుంది.
సంస్థాగతంగా వనరులను పున: పంపిణీ చేసే ప్రగతిశీల పన్నుల విధానాన్ని రాజకీయ చైతన్యం గల ప్రజలు సమర్థించాలి. మనం, మన తోటి పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మనం ఒకే దేశంలో నివసిస్తున్నాం, దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, జాతీయ జెండాకు వందనం చేస్తున్నాం. అవే చట్టాలకు లోబడి ఉంటున్నాం. రాజకీయ చైతన్యం గల సమాజంలో ప్రతీ పౌరుడు సమానమైన నైతిక, రాజకీయ విలువల్ని కలిగి ఉండాలి. రాజకీయ జోక్యం, సమానత్వ సమాజాన్ని సృష్టించి, పోషించాలి. చివరగా, ఇతరుల పట్ల మన బాధ్యత, కనీస సామాజిక ఆదాయం మంజూరు చేయడంతోనే నిలిచిపోతుందా? సంతృప్తిగా జీవించగలిగే సమాజం వైపు మనం కలిసి పయనించకూడదా? మనల్ని సమానత్వ మార్గంలో నడిపించే సరైన పార్టీకి ఓటు వేయడమే నవ భారతం కోసం జరిగే పోరాటానికి నాంది. మనకున్న ప్రజాస్వామిక సాధనం, ఓటు ఒక్కటే. ప్రజాస్వామ్యం మనకందించిన అత్యంత అద్భుతమైన బహుమతి ‘సమానత్వం’. ఈ మాటను కూడా ఉచ్ఛరించని పార్టీకి ఓటు వేయడం, లేక ‘నోటా’పై ఓటు వేయడం ద్వారా మన ఓటును వృధా చెయ్యవద్దు.

నీరా చందోక్‌

(వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ పూర్వ ఆచార్యులు, ‘ద వైర్‌’ సౌజన్యంతో)

➡️