సిఎస్‌, డిజిపిలపై వచ్చిన ఫిర్యాదులను ఇసికి నివేదించాం

  • సిఎంపై దాడి ఘటనపై నివేదికలు తెప్పిస్తున్నాం
  •  ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌
  • సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని సీనియర్‌ అధికారులైన సిఎస్‌, డిజిపిలతోపాటు ఇతరులపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. అక్కడ్నుంచి ఆదేశాలు రావాల్సి వుందన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనలో నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ అంశంపై రోజువారీ నివేదికను తెప్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపైనా పోలీసు ప్రత్యేక పరిశీలకులు త్వరలోనే ఇసికి నివేదిక ఇస్తారని, ఆ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. అలాగే విఐపిలు ప్రచార కార్యక్రమాలకు వెళ్లిన ప్పుడు భద్రతా చర్యలకు ఎలాంటి అవాంతరాలు కలగ కుండా పర్యవేక్షిం చేందుకు ప్రత్యేక భద్రతా దళాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల కాగానే రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, ఈ నెల 25 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని సిఇఒ తెలిపారు. 26న నామినేషన్ల స్క్రూటినీ వుంటుందని, అనంతరం పోటీలో వున్నవారితో తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. మే 13న పోలింగు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వుంటుందన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగు
ఏజెన్సీ నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగు జరగనుందని సిఇఒ ఎంకె మీనా తెలిపారు. జూన్‌ 4న కౌంటింగు వుంటుందని, 6వ తేదీతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి పార్లమెంటుకు అయితే రూ.95 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గానికి అయితే రూ.40 లక్షలకు మించకూడదని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి జనరల్‌ అబ్జర్వర్‌, పోలీస్‌ అబ్జర్వర్‌, ఖర్చు అబ్జర్వర్లుగా ముగ్గురు ప్రత్యేక అబ్జర్వర్లను నియమించిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జనరల్‌, ఖర్చుల పరిశీలకులతోపాటు ఈ దఫా ప్రత్యేకంగా పోలీస్‌ అబ్జర్వర్లను కూడా నియమించిందని తెలిపారు. 85 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునేలా, పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర పోలీస్‌ బలగాలు కాకుండా మొత్తం 5,26,010 మంది ఉద్యోగులు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిపారు.

12,459 తీవ్ర సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు
రాష్ట్ర వ్యాప్తంగా 30,111 పోలింగ్‌ స్టేషన్‌లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, అందులో 12,459 పోలింగ్‌ కేంద్రాలను తీవ్ర సమస్యాత్మకమైనవిగా గుర్తించామని సిఇఒ తెలిపారు. ఇప్పటి వరకు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం లోపల మాత్రమే వెబ్‌ క్యాస్టింగ్‌ జరిగేదని, ఈ ఎన్నికల నుంచి క్యూలైన్‌తో పాటు బయట పరిసరాలను వీడియోలు తీసేలా రెండో కెమెరాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 44,163 మంది వలంటీర్లు రాజీనామా చేశారని, 1,017 మందిని విధుల్లోంచి తప్పించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.180 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులను సీజ్‌ చేశామని వివరించారు.

➡️