మనుషులు ఓడిపోయే నేల

Jan 8,2024 08:57 #sahityam

క్రూరమైన అంటువ్యాధిలా యుద్ధ శంఖారావం

ఒక యిరుకు నేలను కబళిస్తున్నప్పుడు

హింసల డోలు మీద నెత్తుటి మోతలతో

పర్వతాలు లోయలు సముద్రాలు..

ఇల్లు ఆసుపత్రులు బడులు..

చుట్టూతా చావు ప్రతిధ్వనిస్తున్నప్పుడు

యుద్ధ విమానాల రెక్కల కిందనుండి

కన్నీటి పోగుల మీద బాంబుల పొగలు కమ్మి

దిగులుతోటల బతుకు శిథిలాల చుట్టూ

మంటల్లో తగలబడుతున్న పంటచేలలా

చెల్లాచెదురు ప్రాణాలు కొడిగడుతున్నప్పుడు

ఏ చిన్న శాంతి ప్రతిపాదనకూ

ధూసరగాలి ఊపిరాడనివ్వనపుడు

ప్రతి ఉదయం శవాల వెలికితీతకే

సూర్యుడక్కడ ఉదయిస్తున్నాడేమో!

 

ఇళ్ల పైకప్పులన్నింటిని మృత్యుగాలి ఎగరగొట్టేసినప్పుడు

బంధాల సమాధుల మీద పాశాల బుగ్గిరేగుతున్నపుడు

లేతబుగ్గల మీద మెరిసే చిరునవ్వుల్ని చిదిమేస్తూ

బంకర్లలో పార్కుల్లో పిల్లల ఆట స్థలాల్లో

సాలీళ్ళు గూళ్ళు కట్టుకుంటున్నప్పుడు

కొన ఊపిరి ఆశలు కూడా అలసిపోయి

చెట్లకొమ్మల్లో పళ్ళు కన్నీరవుతుండగానే

లేతచిగుళ్ళు ఒక్కొక్కటి నేల రాలిపోతున్నపుడు

వాటి దురదష్టానికి గుండె కరగకపోగా,

పొద్దస్తమానం సిగ్గు దాచుకోవడానికే

నిద్ర నటిస్తున్నావేమో నికృష్ట ప్రపంచమా !

 

భయము ఆకలి రోగము

ముగ్గురు సెంట్రీల పహారాలో

నిరాయుధులంతా ఉన్మాదుల కట్టుబానిసలై

మత్యువే వారికి ఆఖరి యజమానిగా మిగిలినప్పుడు

ఇంకా చావుకు చిక్కనివాళ్ళ కోసం ఆసుపత్రులన్నీ

శవాగారాలుగా మారిపోయినప్పుడు

హంతకముఠాలు జొరబడిన పవిత్ర భూమిలో

నెత్తుటి అంగాలు విరగ పండుతున్నపుడు

మనుషులు ఓడిపోయే ఓ ఆయుధాల నేలా !

ఆయుధాలను గెలవనిచ్చే ఓ అనైక్య రాజ్యాల సమితీ !

నిశ్చింతగా కళ్ళు మూసుకో,

నిద్రలోనే చచ్చిపో! నిద్రలోనే చచ్చిపో !

– కంచరాన భుజంగరావు

➡️