బాల సాహిత్యానికో నవ నవల

May 27,2024 05:22 #book review, #sahityam

బాల సాహిత్యాన్ని సృజించాలంటే ఉపాధ్యాయులకు ఉన్నంత అవకాశం మరెవరికీ ఉండదేమో!వివిధ వయసుల పిల్లలతో, వివిధ ప్రాంతాల, వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యం గల పిల్లలతో వారు గడుపుతూ ఉంటారు. అంతో ఇంతో పిల్లల తల్లిదండ్రులతో కూడా కొద్దిపాటి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల్లో విద్య సామర్థ్యాలలో వ్యత్యాసాలు, ప్రవర్తనల్లో ఉన్న తేడాలకు గల కారణాలను దగ్గరనుంచి పరిశీలించే అవకాశం ఉపాధ్యాయులకు ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులతో కూడా పంచుకోలేని కొన్ని విషయాలు ఉపాధ్యాయులతో ఇష్టంగానూ, నమ్మకంగానూ పంచుకుంటుంటారు. ఉపాధ్యాయులు ఎక్కువసేపు పిల్లలతో గడపగలగడమే కాకుండా వారి విద్యా వికాసానికి, మానసిక వికాసానికి కార్యబద్ధులై ఉంటారు కాబట్టి, విద్యార్థీ ఉపాధ్యాయుల బంధాలు అపురూపంగా ఉంటాయి. సృజనకారులైన ఉపాధ్యాయులు కొందరు, వారి అనుభవాలను అక్షరబద్ధం చేయడం వల్ల మంచి రచనలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కళాశాల విద్యార్థుల గురించి చెన్నూరి సుదర్శన్‌ రాసిన జర్నీ ఆఫ్‌ ఏ టీచర్‌, బడి పిల్లల్లా గురించి శీలా సుభద్ర రాసిన ఇస్కూల్‌ కతలు, సమ్మెట ఉమాదేవి రాసిన మా పిల్లల ముచ్చట్లు ఒక టీచర్‌ అనుభవాలు ఈ కోవకు చెందినవే. అయితే డా. సమ్మెట విజయ ఒక అడుగు ముందుకు వేసి, తన ఉపాధ్యాయ జీవితపు నేపథ్యంతో ‘బడే నా లోకం’ అనే నవలను వెలువరించారు.
రచయిత్రి అంతక్రితం పదేళ్ళు ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేసిన అనుభవాలు, అనుభూతులు ఉన్నప్పటికీ, తరువాతి కాలంలో పనిచేసిన సికిందరాబాద్‌ మిక్స్‌డ్‌ రైల్వే స్కూల్లో భిన్నమైన అనుభవాలను పొందారు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కాలంలో అన్ని వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థ కూడా కుదేలైపోయింది. ఒకే సమయంలో ఈ రచయిత్రి, ఆమె భర్త కూడా కరోనా వ్యాధి బారినపడి నిర్బంధ విశ్రాంతి దొరికింది. ఆ సమయంలో చుట్టుముట్టిన జ్ఞాపకాలను దొంతరగా పేర్చి ‘బడే నాలోకం’ అనే నవలగా కూర్చారు. మీనా అనే టీచర్‌ పాత్ర ద్వారా పాఠశాలలో ఆమె ప్రవేశించిన నాటి నుంచి, తాను పొందిన అనేక అనుభవాలను నవలలో పొందుపరిచారు.
ఇందులో పరిస్థితులకు లోబడి ప్రవర్తించే సమకాలీన విద్యర్థుల, తల్లిదండ్రుల మనస్తత్వాలను ఆమె సమర్థవంతంగా చిత్రీకరించారు. దిగువ మధ్య తరగతి జీవితాలు గడుపుతున్న పిల్లల ఆరోగ్యాలు, అలవాట్లు, ట్రాఫిక్‌ రూల్స్‌, సెల్‌ఫోన్‌ వల్ల వచ్చే అనర్థాలు, లాభాలు వివరిస్తూనే.. అనుకోకుండా పిల్లలు దొంగతనం, పొగ తాగడం, అబద్ధాలు ఆడడం వంటి అలవాట్లను గమనించి.. వాళ్ళను అర్థం చేసుకుని సున్నితంగా వ్యవహరించే టీచర్ల గురించి రాశారు. మారుతున్న కాలంతో పాటు విద్యా విధానంలో చోటు చేసుకున్న కొత్త మార్పులైన ఆన్‌ లైన తరగతులు, డిజిటల్‌ పాఠాల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు, సాంస్క ృతిక కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యతలు వివిధ సందర్భాల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి నిబద్ధతతో కషి చేస్తున్న టీచర్ల గురించి ప్రస్తావించారు.
బడిపిల్లలు పసి వయసునుంచి కౌమార దశలోకి వెళ్తున్న క్రమంలో కొన్ని శారీరక మార్పులు, ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. కొన్ని కొత్త అలవాట్లు అవుతుంటాయి. మనం వద్దన్న పనిని చాటుగానైనా చేస్తుంటారు. ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటుంటారు. అన్నింటిలో తమకు గుర్తింపును కోరుకుంటారు. చదువులో ఎలా ఉన్నా సందర్భం వచ్చినప్పుడు వివిధ విషయాల్లో వాళ్ళ ప్రతిభను కనపరుస్తుంటారు. పిల్లలతో ఎక్కువ కాలం గడిపే ఉపాధ్యాయులు వాటిని వెలికి తీస్తుంటారు. ఇటువంటి అనేక అంశాల కూర్పే ‘బడే నా లోకం’ నవల. బాల సాహిత్యంలో కథా సాహిత్యం, గేయ సాహిత్యం విరివిగా ఉన్నది. కానీ నవలా, నాటికా సాహిత్యం చాలా తక్కువ. రచయితలు పూనుకుంటే ఎన్నో సామాజికాంశాలను కూర్చి చక్కటి నవలలను చక్కగా వెలువరించవచ్చని ఈ నవల మనకు తెలియజేస్తుంది.
గతంలో పిల్లలను అద్భుత లోకంలోకి విహరింపజేసే నవలలు అనేకం వచ్చాయి. బాల, చందమామ, బొమ్మరిల్లు బాలమిత్ర వంటి పత్రికల్లో వచ్చిన జానపద నవలలు, పౌరాణిక సీరియల్స్‌ పిల్లలను అమితంగా అలరించేవి. చింతా దీక్షితులు రాసిన శంపాలత, లీలా సుందరి, శీతంరాజు రాసిన ఒకరోజు రాజు, వీర మల్లుడు సాహసాలు, రౌతుకొద్దీ గుర్రం, సింగంపల్లి అప్పారావు రాసిన సముద్రపు దొంగలు, ఆలూరి భుజంగరావు రాసిన అంతా గమ్మత్తు, శ్రీవాత్సవ రాసిన జల్తారు జాబిల్లి, కెఆర్‌ కె మోహన్‌ వెలువరించిన ఏడు పిల్లల నవలలు, విద్వాన్‌ దేవరకొండ చిన్న కృష్ణశర్మ రాసిన ఆనంద, దాసరి నాగభూషణం చందమామ కోసం రాసిన అనేక జానపద నవలలు; గద్దె లింగయ్య, రావూరి భరద్వాజ సంయుక్తంగా రాసిన పరకాయ ప్రవేశం, బోసుబాబు రాసిన రాజభక్తి, కిరణ్‌ కుమార్‌ రాసిన చందమామ రావే … ఇలా పిల్లల కోసం వెలువడిన మంచి నవలా సాహిత్యం మనకు ఉన్నప్పటికీ… ప్రస్తుతం వీటి లభ్యత ప్రశ్నార్థకమే! ఇటీవల మంచి పుస్తకం, తానా వారు సంయుక్తంగా పోటీలు నిర్వహించడం మొదలుపెట్టాక, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సలీం, సుజల గంటి, కన్నెగంటి అనసూయ, శాఖమూరి శ్రీనివాస్‌, కిరణ్‌ జమ్మల మడక, వీఆర్‌ శర్మ, టీవీ రామకృష్ణ వంటివారు రచించిన నవలలు కొన్ని వెలుగు చూశాయి. పత్రికలు, ప్రచురణకర్తలు ప్రోత్సహిస్తే మరెన్నో బాలల నవలలు తప్పకుండా వస్తాయి.
కరోనా కాలాన్ని ఒక విషాద సమయంగా కుంగిపోకుండా పాఠశాల విద్యకు సంబంధించిన చక్కని రచనను చేసి సమయాన్ని ఉపయుక్తంగా మలుచుకుని మంచి నవలను అందజేసిన రచయిత్రికి అభినందనలు. తపస్వీ మనోహరం పబ్లికేషన్స్‌ వెలువరించిన ఈ నవల రూ.150. కాపీలు రచయిత్రి (99898 20215) వద్ద, అమెజాన్‌లోనూ లభ్యం అవుతాయి.

– సమ్మెట ఉమాదేవి,
98494 06722

➡️