ఆస్థాన కోయిలలు

Mar 11,2024 08:40 #sahityam

‘కొండెపోగు’ చెప్పినట్టు
ఈ ఆస్థాన కోయిలలు ఇలాగే కూస్తాయి
ప్రతి ఘటనను ప్లాస్టిక్‌ సర్జరీలతో
రక్తి కట్టించి రక్త గాయాలన్నీ కప్పేసి
తళుకు బెళుకుల తెల్లబొమ్మలా కోటింగేసి
ప్రపంచానికి చూపెడతాయి

వెన్నెముక జారిపోయిన ఈ మూలస్తంభాలు
ఇలాగే కుప్పబడి సరీసృపాల్లా పాకుతాయి
నైతిక నియమాల సహజ చర్మాన్ని కుబుసంలా విడిచి
పెట్టుబడుల తోలు కప్పుకొని
వక్ర భాష్యాల ఊడిగానికి సిద్ధపడతాయి
24/7 రీమిక్స్‌ వార్తాగానం చేస్తాయి

ఈ భజంత్రీల మేళతాళాలు
ఇలాగే మోతెక్కిస్తాయి
సత్యాన్ని సమాధి చేసి
సాక్ష్యాల తోటకు నిప్పు పెట్టి
అమాయకంగా నిలబడి
మంటల ముందు నివ్వెరపోయే
మొసలి కన్నీళ్లను
ఉదాత్తంగా కవిత్వీకరించి కీర్తిస్తాయి

నిజాలైన వేల అవిశ్వాసాల ఊపిరి
ఆగిపోయినా
అబద్దాలైన లక్షల కట్టుకథలతో
అధికారం ధృడంగా కోటలు కట్టుకున్నా
స్వప్నమై బతికే ఒక్క విశ్వాసం చాలు
కాకిలా ఎగిరొచ్చి అదే కోట గోడమీద వాలి
నిజం గొంతై నినదిస్తుంది!

– కంచరాన భుజంగరావు
94415 89602

➡️