అలరించిన ‘హర్ష’ నాటికలు

Jun 17,2024 03:25 #aksharam

ఆర్టిస్టులే ఆర్గనైజర్లయ్యి, పరిషత్‌ నిర్వహిస్తే అది ‘హర్ష క్రియేషన్స్‌’ అవుతుంది. తెలుగు సాంఘిక నాటకాన్ని బతికించాలనే ధ్యేయంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పోటీలు (పరిషత్‌) జరుగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో సుమారు 70 వరకూ పరిషత్తులు ఉండొచ్చని, క్రమం తప్పకుండా ఏటా పోటీలు నిర్వహించేవి కనీసం సగానికి తగ్గకుండా ఉంటాయని ఓ అంచనా. ఈ నెల 12, 13, 14 తేదీల్లో విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో హర్ష క్రియేషన్స్‌ వారు (కత్తి శ్యామ్‌ ప్రసాద్‌ టీమ్‌) వరుసగా ఏడో సంవత్సరం తెలుగు రాష్ట్రాల స్థాయిలో సాంఘిక నాటికల పోటీలు నిర్వహించారు. సామాజిక, కుటుంబ నేపథ్యంతో.. భిన్న కోణాల్లో… వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిది నాటికలను ప్రదర్శిం చారు. ఇందులోని ఎక్కువ నాటికలు ప్రేక్షకుల్ని అలరించాయి.

స్వప్న అనే వేశ్య అల్లిన చిన్న కథ (అబద్ధం) అమృతమై- కనువిప్పు కలిగించి, కడకు భార్యను అక్కున చేర్చుకున్న ఉదంతం ‘స్వప్నం రాల్చిన అమృతం’ ఇతివృత్తం. భర్త తప్ప తాగి చేసిన యాక్సిడెంట్‌ కారణంగా నడుం నుంచి కింది వరకూ చచ్చుబడిపోయి, ఓ మూలన ఒంటరిగా.. నిరంతరం బాధతో విలవిల్లాడుతూ- డేకుతూ.. భర్త హూంకరింపులతో..
హృదయ విదారక పాత్రలో జ్యోతిరాణి జీవించి.. నాటికకు ప్రాణం పోసింది. ఉత్తమ ప్రదర్శన బహుమతి సాధనకు ఇతోధికంగా దోహదపడటమే కాదు; ఉత్తమ నటి బహుమతినీ దక్కించుకుంది. ఈ నాటిక రచన శివరామ్‌, దర్శకత్వం మంచాల రమేష్‌.
ఆత్మీయంగా, ఆంతరంగికంగా మనసు విప్పి మాట్లాడు కోకుంటే కాపురాలు కూలే ప్రమాదముందని హెచ్చరిస్తుంది మాడభూషి దివాకర్‌ బాబు ‘మాట్లాడుకుందాం’ నాటిక. ఇందులో ఇల్లాలు పక్కదారి పట్టడానికి బలమైన, కన్విన్సింగ్‌ కారణం చూప(లే)కపోవడం లోపమనిపించినా నాటకీయతలో.. రన్నింగ్‌లో దివాకర్‌ బాబు చేయి తిరిగిన రచయిత. ఈ నాటికతో మంజునాథ ఉత్తమ దర్శకుడిగా, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని సాధించుకుంది సిరిమువ్వ కల్చరల్‌, హైదరాబాద్‌ బృందం.
మోసం, కుట్రతో తల్లిదండ్రుల నుంచి ఆస్తి కాజేయాలని చూసిన కొడుకులకు ‘అనూహ్యం’గా బుద్ధి చెప్పడాన్ని ఆకట్టుకునేలా ప్రదర్శించారు నటీ నట సంక్షేమ సమాఖ్య, పాలకొల్లు కళాకారులు. రచన తాళాబత్తుల వెంకటేశ్వరరావు, దర్శకత్వం కత్తుల రామ్‌ మోహనరావు. పిల్లల్ని దత్తత తీసుకోవడాన్ని సాధారణంగా గమనిస్తుంటాం. అనాథగా పెరిగి, అమెరికాలో మంచి హౌదాలో ఉండి… వృద్ధ దంపతులను తల్లిదండ్రులుగా దత్తత తీసుకునే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు రచయిత శారదా ప్రసన్న. ‘ఎడారిలో వానచినుకు’గా ప్రదర్శితమైన ఈ నాటికను సాయి కార్తీక్‌ క్రియేషన్స్‌, కాకినాడ వారు ప్రదర్శించి, ఆకట్టుకున్నారు.
వాతావరణ కాలుష్యానికి ప్లాస్టిక్‌ పరిశ్రమలు ఎలా కారణమవుతున్నాయో, లాభాపేక్షతో మనుషుల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో… బ్రహ్మ ‘రాత’ను ఎలా తిరగరాస్తున్నాయో నాటకీయంగా, శక్తివంతంగా చెప్పే ప్రయత్నం చేశారు వెలగలేరు థియేటర్‌ ఆర్ట్స్‌ కళాకారులు. ఆడపిల్లలను బతకనిద్దాం, బతికించుకుందాం అనే సందేశాన్నిచ్చింది ‘క్షేత్రం’. శిల్ప ఆకురాతి రచనను జి.వి.మనోహర్‌ దర్శకత్వంలో ఆరాధన ఆర్ట్స్‌ అకాడమీ, గుంటూరు కళాకారులు ప్రదర్శించారు. స్త్రీమూర్తులు కడుపుపంట పండించకపోతే మానవ సృష్టే ఉండదని చెప్పే క్రమంలో.. కనీసం ఒకటిరెండు పదాల్లోనైనా- పురుష ప్రమేయాన్ని కూడా జోడిస్తే రచనకు సమగ్రత, సమతూకం చేకూరేవి.
యువతను గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌ వంటి ప్రాణాంతక మత్తు పదార్థాల దురలవాటు నుంచి ‘విముక్తి’ చేయాల్సిన ఆవశ్యకతను రచయిత, దర్శకుడు, ప్రధాన పాత్రధారి చెరుకూరి సాంబశివరావు సిన్సియర్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నాటికను ఉషోదయా కళానికేతన్‌, కట్రపాడు వారు ప్రదర్శించారు. ఇంకా… బంధం (రచన: మాడుగుల రామకృష్ణ, దర్శకత్వం: పురుషోత్తం) మైత్రీ కళానిలయం, విజయవాడ; నాన్న బంగారు (రచన, దర్శకత్వం జి.బి.కె.మూర్తి) ప్రియదర్శిని, నెల్లూరు వారు ప్రదర్శించారు.
ఎక్కువ సందర్భాల్లో విజేతలుగా నిలుస్తున్న సమాజాలను (కొన్నింటినైనా) మినహాయించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకున్నారేమో ‘హర్ష’ నిర్వాహకులు. ఎంపికైన ప్రదర్శనల్లో ఆ తరహా కొత్తదనం కనిపించింది. అది వాస్తవమే అయితే ఓ కోణంలో సమర్ధనీయమే! అయితే పోటీ అంటే హౌరాహౌరీ ప్రదర్శనలనే ఆశిస్తారు ప్రేక్షక దేవుళ్లు. కొత్త టీములకు అవకాశం కల్పించాలంటే పోటీలు కాకుండా ‘ఉత్సవాలు’గా నిర్వహిస్తే ఎలాంటి ఆక్షేపణలకూ ఆస్కారముండదు. సాధారణంగా పోటీల నిర్వాహకుల నుంచి న్యాయ నిర్ణేతలుగా ఎవరూ ఉండరు. ఈ పరిషత్‌లో మాత్రం ఈసారి ఏకంగా ముగ్గురిలో ఇద్దరు పరిషత్‌ నిర్వహణ బృందంలోని వారే ఉన్నారు. ‘నాటకాలు ప్రదర్శిస్తున్న వారే కాదు, పోటీలకు వెళ్తున్న వారూ ఏ పరిషత్‌ లోనూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం కరెక్ట్‌ కాదని- నాటక రంగానికి చెందిన ప్రముఖుడు, పలు నందుల విజేత ఈ సమీక్షకుడితో అన్నారు. ఈ వ్యాఖ్య సమంజసమే అనిపించింది.
విజేతలు : ఉత్తమ ప్రదర్శన – స్వప్నం రాల్చిన అమృతం (చైతన్య కళాభారతి, కరీంనగర్‌.. ప్రదర్శన పారితోషికం కాకుండా రూ. 10,116), ద్వితీయ ఉత్తమ ప్రదర్శన – మాట్లాడుకుందాం (రూ.6 వేలు), తృతీయ ఉత్తమ ప్రదర్శన – అనూహ్యం (రూ. 3 వేలు). రూ. వెయ్యి వంతున నగదు బహుమతుల వివరాలు : ఉత్తమ రచన – ఎడారిలో వానచినుకు (శారదా ప్రసన్న), ద్వితీయ ఉత్తమ రచన – అనూహ్యం (తాళాబత్తుల వెంకటేశ్వరరావు), ఉత్తమ నటుడు – డి రాధాకృష్ణ (ఎడారిలో వానచినుకు), ఉత్తమ ద్వితీయ నటుడు – రాజరుషి (అనూహ్యం), ఉత్తమ ద్వితీయ నటి – సింధూర పూజిత (మాట్లాడుకుందాం), ఉత్తమ విలన్‌ – బి దొరబాబు (ఎడారిలో వానచినుకు), ఉత్తమ బాల నటి – సురభి వాగ్దేవి (రాత). సాంకేతిక వర్గంతో సహా మరిన్ని బహుమతులు అందించారు. న్యాయనిర్ణేతలు : అనంత హృదయరాజ్‌, పిళ్లా నటరాజ్‌, అడపా సూరిబాబు.
నిర్వాహకులు ఎన్నో ప్రయాసలకోర్చి పరిషత్‌ని నిర్వహిస్తే ప్రేక్షకులు అంతంతమాత్రంగానే రావడం కాస్త నిరాశ కలిగించింది. ఆడిటోరియంలో మైక్‌ సిస్టమ్‌ ఈసారి ఇబ్బంది కలిగించింది. థియేటర్‌ యాజమాన్యం ఈ లోపాన్ని సరిదిద్దాలి. కత్తి శ్యామ్‌ అండ్‌ టీమ్‌ను అతిథులుగా హాజరైన వివిధ ప్రాంతాల పరిషత్‌ల నిర్వాహకులతో పాటు ప్రేక్షకులు అభినందించారు.

– జి.వి.రంగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌

➡️