గూడ

Jun 17,2024 03:56 #aksharam

పెనుగాలి రాకముందే
పిట్ట తన గూటికి చేరుకున్నట్టు
ఓసారి గూడకు పోయిరావాల ..!
వాగుల్ని వాటర్‌ పేకెట్లలో బంధించక ముందే
చెట్లకు చెవిదుద్దుల్లా వేలాడే మానిపళ్లను
జ్యూస్‌ బాటిళ్లలో నింపుకుపోకముందే
అంతటి అడవి సంతగా మారకముందే
ఓసారి గూడకు పోయిరావాల..!

చెట్లు మాయమై సెల్‌ టవర్లు చిగురించకముందే
కూలిపోయిన మహావృక్షాలు
గుళ్ల ముందర ధ్వజస్తంభాలై నిలబడకముందే
కిరస్తానీ తెల్ల చీకటి కొండల్ని కమ్మేయకముందే
ఓసారి గూడకు పోయిరావాల.. !

పాములా మెలికలు తిరిగే అడవి దారుల్లో
నా పూర్వీకుల పాదముద్రల్ని చెరిపేసిన తార్రోడ్డు
కొండచిలువలా మారి గూడల్ని మింగేయక ముందే
కాళ్లకింద కొండల్ని పిండిజేసీ
నగరాలకు లారీల్లో తరలించుకు పోకముందే
ఓసారి గూడకు పోయిరావాల.. !

ఉచిత పథకాల స్టిక్కర్లన్నీ
గూడల గోడల మీద దిష్టిబొమ్మలై వెక్కిరిస్తున్నచోట
ఆయుధమొనకు వేలాడుతూ ..
అడవి పావురాలు నెత్తురోడుతున్నచోట
అడవొక చెరశాలగా మారకముందే
చెరపడ్డ వాకపల్లిలా గూడ శోకించకముందే
చీకటిబగిడి , పొద్దుమీద రెక్క విప్పార్చకముందే
ఓసారి గూడకు పోయిరావాల.. !

కట్టుదగ్గర గోవు, దూడకోసం ఎదురుజూసినట్టు
అడవితల్లి తన ఆకుల కళ్లతో ఎదురుజూస్తోంది
యే పొదలచాటున యే పులులు పొంచి ఉన్నాయో
యే పుట్టలమాటున
యే పాములు బుసగొడుతున్నాయో
ఓసారి జూసిరావాల .. గూడకు పోయిరావాల ..
నా నేలమీద నా ఉనికిని నిలబెట్టుకోవాల ..
దించేసిన విల్లమ్ములు మళ్లీ చేతబట్టాల..!
– సిరికి స్వామినాయుడు, 94940 10330

➡️