అతడూ – నేనూ

Jan 22,2024 10:47 #sahityam

అతడు చిద్విలాసంగా నా వైపు చూసి తలేగరేశాడు

”చూశావా, ఒక మహత్యంలా ఎలా జరిగిపోతుందో …

ఉన్నాడో లేడో అన్నావు

ఇక కళ్లకు కట్టే సమాధానం దొరికినట్టే కదా?” అన్నాడు.

 

నేనూ నవ్వాను.

 

”ఇంకా అదే అంటావా?” అన్నాడు

అనుమానంగా, ఆశ్చర్యంగా.

 

”అవును

ఇంకా గట్టిగా అంటాను

మనుషులు ఎంత గొప్పవాళ్లో

లోకం మరింత స్పష్టంగా

తెలుసుకుంటుంది ఇప్పుడు” అన్నాను.

 

అతడు అయోమయంగా చూశాడు

”ఆ ఘనతంతా ఆ దేవదేవుడిదే కదా” అన్నాడు.

 

”కాదు, నీది !

నీలాంటి కోట్లాదిమందిది

పునాదులు తవ్విన శ్రామికులది

రాళ్లు పేర్చిన కూలీలది

ప్రణాళికలు కూర్చిన విజ్ఞానులది

రాళ్లను తవ్వి తీసిన కార్మికులది

ఎక్కడెక్కడినుంచో అక్కడికి తరలించిన

అనేకానేక మంది శ్రమ జీవులది

రాయి రాయి ఏర్చి కూర్చి నిర్మించిన

సాధారణ శ్రామిక జనావళిది

రాత్రీ పగలూ శ్రమించి చెక్కిన శిల్పులది

హంగులూ రంగులూ అద్దిన కళాకారులది

నిపుణులది, నిర్మాణకర్తలది

ఘనతంతా మనుషులది..

అందరూ అన్నీ చేయడం వల్లే

దేవదేవుడు ఇప్పుడు అక్కడున్నాడు ..

అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నాను

ఏదైనా మనుషులే చేస్తారు, చేయగలరు” అన్నాను.

 

అతడు, నా మిత్రుడే …

అప్రసన్నంగా చూశాడు నా వైపు!

 

”ఇంత చేసిన ఘనత మాత్రం

ఖచ్చితంగా మా నాయకుడిదే కదా!” అన్నాడు గర్వంగా.

 

”ఘనతో కాదో చెప్పలేను కానీ,

సొంత లబ్ధి కోసం సాంతం చేస్తున్నది

ఖచ్చితంగా మీ నాయకుడే!

జనం ఉద్వేగాలను పల్లకీగా మల్చుకొని

అందులో ఊరేగాలనుకుంటున్నది

ఖచ్చితంగా మీ నాయకుడే!

పూర్తి కాని దేవళంలో

హడావిడి ప్రతిష్టాపనం

మళ్లీ అధికారం కోసమే కదా

ఈ అట్టహాస ప్రహసనం?” అంటూనే ఉన్నాను

అతడు వింటూనే విసుగ్గా వెళ్లిపోయాడు!

విగ్రహంలోని దేవుడు

ఎప్పటిలాగానే అవాక్కై నించున్నాడు!   – చింతపల్లి శ్రీరామ్‌

➡️