మాయలమారి

Feb 26,2024 09:09 #sahityam

వాడిని చూస్తే నాకు భయమేస్తుంది

శవాల గుట్టల మీదుగా సింహాసనం ఎక్కిన

వాడిని చూస్తే నాకు నిజంగానే చాలా భయమేస్తుంది

వాడు

నీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ

ఏ మాత్రం తడబడకుండా

వెయ్యి అబద్ధాలు ఆడతాడు

నీ తల మీద నిలబడి

నీ సేవకుణ్ణి అంటాడు

ఇల్లు గుల్ల చేస్తూ

నీ ఇంటికి కాపలా ఉన్నానంటాడు

చేతికీ నోటికీ సంకెళ్ళు తగిలించి

ఎంత స్వేచ్ఛగా ఉన్నావో చూడు అంటాడు

నీ కొంపకు నిప్పెట్టి

చలిమంట వేశాను అంటాడు

నాకు భయమేస్తుంది

ఈ గోముఖ వ్యాఘ్రాన్ని చూస్తే

నాకు నిజంగానే చాలా భయమేస్తుంది.

నాకు జాలేస్తోంది

బంగారు లేడి ఉండదని తెలిసినా

మాయలేడి వెంట పడిన రాముడు

మళ్ళీ మారీచుడి మాయలో చిక్కి

బంగారు గుళ్ళో బందీ అయిపోతుంటే

నాకు జాలేస్తోంది

అయోధ్య రాముడిని చూస్తే

నాకు నిజంగానే చాలా జాలేస్తోంది

నాకు ఆశ్చర్యంగా ఉంది

మాయల ఫకీరు బాల నాగమ్మను బంధించినట్లు

ఈ జంగం దేవర భారతమాతను బంధిస్తుంటే

అందరూ శిలలై శక్తిహీనులై

ఏమీ చెయ్యలేని స్థితిలో

నిస్సహాయంగా నిలబడిపోవడం చూస్తుంటే

నాకు నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది

నాకు దిగులుగా ఉంది

కసాయి వాడి వెంట నడిచినట్లు

ముందూ వెనుకా, అటూ ఇటూ, ఎటూ చూడక

మంత్రించినట్లు వాడి అడుగులో అడుగు వేస్తూ

రామ నామం జపించే నోరునే తప్ప

వాడి చేతిలోని కత్తి నుంచి జారుతున్న

రక్తపు చుక్కలను చూడలేని ఈ దేశాన్ని చూస్తే

నాకు నిజంగానే చాలా దిగులుగా ఉంది !

 

అయినా,

ఈ భయాలు, దిగుళ్ళ అట్టడుగున

నాకు ఒక నమ్మకం కూడా ఉంది

ఈ చీకటి శాశ్వతం కాబోదనీ

సమాధిలోంచి లేచిన గతం

భవిష్యత్తుని ఎంతో కాలం శాసించలేదనీ

నాకు లోలోపల ఒక ధృఢమైన నమ్మకం కూడా

ఉంది !

– తోలేటి జగన్మోహనరావు(సోషల్‌ మీడియా నుంచి)

➡️