ఓ గాజా… నువ్వు తప్పక గెలుస్తావు!

Jun 17,2024 03:42 #aksharam

ఇప్పుడక్కడ శిథిలాలు తప్ప
నివశించేందుకు ఇండ్లు లేవు
నీటిని వొంపే కుళాయిలు లేవు
తిరుగాడేందుకు రోడ్లు లేవు
చిగురించేందుకు చెట్లు లేవు

బిక్కు బిక్కుమనే జీవచ్ఛావాలు తప్ప
జీవించే మనుషులూ లేరు
వాళ్ళిప్పుడు తమ పేర్లను, కుటుంబాలను కోల్పోయారు
తమ ఉపాధిని, వృత్తిని కోల్పోయారు
తమ కళల్ని, కలల్ని కోల్పోయారు
పిల్లలు చిరునవ్వుని, పెద్దలు ధైర్యాన్ని కోల్పోయారు
బూడిదను శ్వాసించి ఆకలిని మింగుతున్నారు
వాళ్లిప్పుడు సొంత గడ్డ మీదనే పరాయిలయ్యారు

అక్కడిప్పుడు అకస్మాత్తుగా
నిశబ్దం గాయపడుతుంది
పెదవి దాటకుండానే ప్రార్ధన మరణిస్తుంది
మానవత్వ సహాయం మీద
మృత్యువు విరుచుకు పడుతుంది

అప్రతిహత మారణకాండలో
శబ్దాలు అర్థాలు కోల్పోయాయి
ఆసుపత్రులు శ్మశానాలయ్యాయి
అంతర్జాతీయ సమాజం అసహాయ శిబిరంగా మిగిలింది
ఐక్యరాజ్య సమితి సుద్దుల కేంద్రమైంది

ఓ గాజా, ఓ పాలస్తీనా…

నైతికంగా గెలుపు నీదే అయినా
భౌతికంగా శత్రువు నిన్ను నిర్మూలించొచ్చు
చొరబాటుదారుడే భూమిపుత్రుడ్నని ప్రకటించుకోవచ్చు
కానీ, వాడిలాగే శకలాల నుంచి మళ్లీ నువ్వెగుస్తావు
నీ ఆత్మ పతాకను తిరిగి ఎగరేసి చూపుతావు
పిరికి ప్రపంచానికి తెగువ ఫలితం ఎలా ఉంటుందో
రుచి చూపించి తీరుతావు!
– వి.ఆర్‌. తూములూరి, 9705207945

➡️