ఉత్తేజాన్ని నింపిన ‘లౌకిక కవనం’

Feb 5,2024 09:01 #sahityam

                      ప్రస్తుతం మన దేశంలో లౌకికత్వం స్వరూపం మారిపోయిం ది. ప్రజాస్వామ్యం, లౌకికత్వం అనే మాటల్ని నిషేదించే ప్రయత్నాలు ఆరంభ మయ్యాయి. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని భిన్నమతాల సామరస్య జీవనానికి చిచ్చుపెట్టింది. రాజ్యాంగంలోని లౌకికత్వానికి తూట్లు పొడిచే పనిచేస్తున్నది. బహుళ సంస్క ృతుల భారతదేశానికి లౌకికత్వమే నిజమైన పునాది. అన్నివర్గాల ప్రజలు పాల్గొన్న జాతీయోద్యమ నేపథ్యంలోంచి రూపొందిన మన రాజ్యాంగం దానినే ప్రతిబింబిస్తున్నది. ఈ సంక్లిష్ట సందిగ్ధ సందర్భంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జనవరి 26 రిపబ్లిక్‌డే రోజు ‘లౌకికకవనం’ పేరుతో కవి గాయక సమ్మేళనం జరిగింది.

ఉదయం నుంచి దాదాపు రాత్రి 7 వరకు సాగిన ఈ సభలో రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, గాయకులు రాజ్యాంగం అందించిన లౌకిక స్ఫూర్తిని చాటుతూ కవులు తమ స్వీయ కవితలను, గాయకులు తమ పాటలను వినిపించి ఉత్తేజం కలిగించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఐఏయస్‌ అధికారి ఏఎండి ఇంతియాజ్‌, ప్రముఖ విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య, ప్రముఖ కవయిత్రి మందరపు హైమావతి, పోలవరపు సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ ఛైర్మన్‌ గోళ్ళ నారాయణరావు ప్రారంభ సభలో పాల్గొని సందేశం ఇచ్చారు. ప్రముఖ కవి చలపాక ప్రకాష్‌, సామాజిక పరివర్తన వేదిక బాధ్యులు వున్నవ వినరుకుమార్‌, ఎక్స్‌రే సాహిత్యసంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయరాజు, ప్రముఖ జర్నలిస్టు ఘంటా విజయకుమార్‌, కథారచయిత్రి కె.ఉషారాణి, సాహితీస్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిళ్ళా కుమారస్వామి తదితరులు ఆత్మీయ సందేశాలు ఇచ్చారు.

ఈ కవిగాయక సమ్మేళనంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 75 మంది కవులు, గాయకులు పాల్గొన్నారు. ప్రారంభ సభ అనంతరం కవిగాయక సమ్మేళనం తొలి సెషన్‌ను సరికొండ నరసింహరాజు, రెండవ సెషన్‌ను అమూల్య చందు, మూడవ సెషన్‌ను శిఖా-ఆకాష్‌, తంగిరాల సోని, కె.ఎక్స్‌. రాజు సంయుక్తంగా నిర్వహించారు. అనిల్‌ డ్యాని సమన్వయం చేశారు. ప్రముఖ గాయకులు జగన్‌, చంద్రనాయక్‌, పి.వి రమణ, గడ్డం విజయరావు, ఎస్‌.అనిల్‌ తదితరులు అభ్యుదయ, లౌకిక స్ఫూర్తిని నింపే పాటలను పాడి సభికుల్లో ఉత్తేజం నింపారు.

కవులు రాజ్యాంగస్ఫూర్తిని, లౌకకత్వ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆలోచనాత్మకమైన కవితలతో అలరించారు. అమూల్య చందు తన కవితలో.. ‘ఇప్పుడు /జెండాలోని మూడు రంగుల్ని /మూడు మతాలూ /గుప్పిట్లో పెట్టుకుని/ విగ్రహాలుగా మలిచి/ జాతీయ దినోత్సవాలకు బదులు/ విగ్రహ దినోత్సవాలకు/ రిబ్బన్‌ కట్‌ చేస్తుంటే../ ఏ జెండా గురించి చెప్పాలి/ ఏ రాతలు రాయాలి… అంటూ ఆలోచింపజేసే కవిత చదివారు. ఈ దేశంలో సాగుతున్న మతోన్మాద రాజకీయాలు, అపహాస్యమౌతున్న ప్రజాస్వామ్యవిలువల్ని పదునుగా పలువురు కవులు ప్రశ్నించారు. ప్రముఖ కవి శిఖా-ఆకాష్‌ ‘ఏదీ ఆగిపోలేదు’ శీర్షికన రాసిన కవితలో ‘ఏదీ ఉన్నచోట లేదు/ స్థానభ్రంశమైన కల నడుస్తూనే ఉంది/ కాస్త కాస్త వెనక్కి -/ ఆగిపోలేదు తిరో గమనం/ సాగిపోతూనే ఉంది -/ …./ దేవుడు కూడా వ్యాపార వస్తువే !/ రాజకీయ కుట్రదారుల బంధువే !/ ఏదీ ఆగిపోలేదు, తిరోగమనం/ సాగిపోతూనే ఉంది’ అంటూ స్పందించారు. కోగిలి రాజశేఖర్‌ ‘కొందరు కులాల కుంపట్లలో/ మరికొందరు మతాల మత్తుల్లో/ సామాన్యుడిలో విషబీజాలు నాటారు/ ప్రజాస్వామ్వానికి తూట్లుపొడిచారు’ అంటారు. కవి జి.మాల్యాద్రి ‘సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాడు/ అరాచకం జైశ్రీరాం గీతాలాపన చేస్తుంది/ నుదిట పచ్చబొట్టు /హిందూమతమై వర్ధిల్లినది/ చితాభస్మం విభూదిపండులా పంచబడుతుంది’ అంటూ చదివిన కవిత ఆలోచింపచేస్తుంది.

కవి దివ్వెల వెంకట నరసయ్య ‘నేను’ అనే కవితలో ”సమసమాజ నిర్మాణానికి సర్వసత్తాక సామ్యవాదానికి సూత్రం/భరతజాతికి బైబిల్‌, ఖురాన్‌, గీత ఏకత్వానికి గీటురాయి’ అంటారు. కవి పిళ్ళా కుమారస్వామి ‘ఆవాజ్‌’ కవితలో..’మతం ముసుగేసుకుని బతకమని చెప్తోంది /మతోన్మాదం విద్వేషపు బీజాలను మనసులో నాటుతోంది/ ప్రేమ అందరి హదయాల్లో పూలు పూయిస్తుంది/ రాజ్యాంగం దేశంలో ఎలా బతకాలో చెపుతుంది/ ఉన్మాదానికి ఉరివేస్తుంది/ ప్రేమకు పల్లకి వేస్తుంది.’ అంటారు. రాధాకృష్ణ కర్రి అనే కవయిత్రి ‘కొత్త అజెండా’ అనే కవితలో విరోదాభాసలంకారంతో ఒక కవితావాక్యం రాస్తుంది. ”స్వేచ్చ కూడా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందేమో రావద్దని చెప్పు/ రాసిన రాతగాడు కూడా మార్చలేని లోకం ఇప్పుడున్నది” అంటుంది. ఈ కవితావాక్యం లోతైన అర్థాన్ని, ఆలోచనను కలిగిస్తుంది.

ఈ లౌకిక కవనంలో సామినేని విజయ (విజయవాడ), టి.రవీంద్రబాబు, సి.హెచ్‌. రాము, సయ్యద్‌ జానీ భాషా (గుంటూరు), బివి శివప్రసాద్‌, సత్యవతి, జి.సి. రామలింగారెడ్డి (నంద్యాల), రాధకృష్ణ, సంపటం దుర్గాప్రసాద్‌, మరియ పీటర్‌, చోడవరపు రూప, దుంపాల వీరేష, చంటి, వి.శ్రీఉమామహేశ్వరి, తదితర కవులు లౌకికత్వం ఎంత ప్రమాదంలో పడిందో తమ కవితల్లో వ్యక్తీకరించారు. లౌకికకవనంలో కవులు, గాయకులు లౌకికత్వాన్ని కాపాడుకోవాలని, ముఖ్యంగా మతోన్మాద సంకెళ్లనుండి దేశానికి విముక్తి కలిగించాలని ప్రతినబూనారు. ఈ కవిగాయక సమ్మేళనాన్ని వొరప్రసాద్‌, కెంగార మోహన్‌, సత్యాజీ, శాంతిశ్రీ, సత్యరంజన్‌, గుండు నారాయణ, లక్ష్మయ్య సమన్వయం చేశారు.

– కెంగార మోహన్‌, రాష్ట్ర అధ్యక్షులు, సాహితీస్రవంతి. 94933 75447.

➡️