స్మృతిపథంలో మెరిసిన వెలుగుల జడి!

Mar 18,2024 06:05 #book review, #sahityam

ఎవరైనా ఎందుకు తమ జ్ఞాపకాల్ని గ్రంథస్థం చేయాలి? యే వ్యక్తి జ్ఞాపకాలైనా సామాజిక అనుభవాల, అనుభూతుల సమాహారమే. సమాజం(లో) లేని వ్యక్తిని ఊహించలేం. వ్యక్తి మేధస్సు కూడా సమిష్టి ఆస్తి. అలానే వైయక్తిక అనుభవాలు కూడా సామాజిక ఆస్తినే!
ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ ఈ పుస్తకం ‘హిస్టరీ ఫ్రమ్‌ బిలో’ కోవకు చెందిందన్నారు. సామాజిక చలనాన్ని అర్థం చేసుకోవడానికి విశ్లేషణాత్మకంగా రాయాల్సిన అవసరాన్ని వక్కాణించారు. సామాజిక జీవన వైవిధ్యాలను చిత్రించే రచనే నిజమైన జ్ఞాపకాలు అవుతాయంటారు. తనకు ఈ ప్రాంతంతో ఉన్న అనుభవాలను నెమరేసుకుంటూ, రచయిత ఫోటోగ్రాఫిక్‌ మెమరీని చూసి ఆశ్చర్యపోతారు. చరిత్రతో ముడిబడ్డ ఎన్నో జ్ఞాపకాల సాపత్యాలనూ, తనకు కూడా అనుభవేకవేద్యమైన విశే షాలనూ ముందుమాటలో పదిలపరిచారు.
వకుళాభరణం రామకృష్ణ ఇవి వనపర్తికి మాత్రమే పరిమితమైనవి కావనీ, గ్రామీణ సామాజిక ముఖచిత్రాన్నీ, ఆ పునాదుల మీదే నిర్మించుకున్న పట్టణాల, విశాల సమాజాల సమిష్టి జీవితాన్నీ, గత చరిత్ర ఆనవాళ్లుగా చిత్రించిన జ్ఞాపకాలనీ, ఐదారు దశాబ్దాల కాలం నాటి జ్ఞాపకాల పొరల్లో భద్రంగా నిక్షిప్తమైన వాటిని వెలికతీసేందుకు రచయిత ఎంత గానో శ్రమించారనీ, ఇది అందరి వల్లా సాధ్యమయ్యే పని కాదనీ, సామాజిక జీవనంలో ఎంతగానో తలమునకలైతే తప్ప, ఇంత గాఢమైన అనురక్తితో ఆనాటి జీవిత అనుభవాలను ఇంత వాస్తవికంగా, ఇంత వైవిధ్యంగా, ఇంత లోతుగా, ఇంత తాజాగా విశ్లేషించటం సాధ్యం కాదనీ ప్రశంసించారు.
సామాజిక పరిశీలన లేని వైయక్తిక అనుభవాలను గ్రంథస్థం చేయాల్సిన అవసరం లేదని సాధారణ మార్క్సిస్టు అవగాహన చెబుతుంది. జర్నలిస్టుగా, మార్క్సిస్టు సైద్ధాంతిక అవగాహన మెండుగా వున్న రాఘవ శర్మ గారి ‘వనపర్తి ఒడి’ అంతులేని జ్ఞాపకాల ఉరవడి. అటక మీద భద్రంగా దాచుకున్న అపరూప ఛాయాచిత్రాల్ని అర్ధ శతాబ్దం తర్వాత దుమ్ము దులిపి స్వచ్ఛంగా అందించిన అనుభవాల గని. చారిత్రిక పుటల కెక్కని అనేకానేక విశేషాల తవ్వితీత. ఆ నగరంతో తనకున్న భావోద్వేగాలనూ, బాల్య చాపల్యాలనూ, సామాజిక ఆర్థిక కోణాలనూ స్పృశిస్తూ ఒక మానవ సామాజిక పరిశోధకుడిగా సమాజంతో తాను తాదాత్మ్యం పొందిన అనేక అనుభవాలను బహుముఖాలుగా విశ్లేషించి, ఒక వైయక్తిక అనుభవ రచనకు సైతం సామాజిక ప్రయోజనం ఎంత అవసరమో చెప్పే ప్రయత్నం చేశారు.
గత కాలపు రాచరికపు స్మ ృతి చిహ్నంలా వనపర్తి నడిబొడ్డున కృంగి శిథిలమై ఒకనాటి చారిత్రక ఆనవాలుగా నిలబడిన రాజా రామేశ్వరరావు ప్యాలెస్‌ చుట్టూ అల్లుకున్న అనుభవాలూ, యవ్వనోద్రేకాలనే కాకుండా చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా వుండే అనేక సందర్భాలని ఉటంకించారు. రామేశ్వర్‌ రావు జమీందార్‌ గొప్ప హృదయంతో తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతు తెలపడం, వారసత్వంగా వచ్చిన ఆ ప్యాలెస్‌ని నెహ్రూ పాలిటెక్నికల్‌ కాలేజీగా మార్చటం లాంటి అనేక విశేషాలను అక్షరబద్ధం చేశారు. ఆ కాలపు సామాజిక వ్యవస్థలో సాధారణ ప్రజానీకం ఎన్ని కడగండ్లు పడుతున్నారో, గడచిన ఆ జీవితపు వేదనలకు ఇపుడున్న సమాజంలో ఏమైనా పరిష్కారం దొరికిందా, అది నిజంగా సామాజిక అభివృద్ధేనా, సమాజం నిజంగానే ముందుకెళుతుందా, సంపద పోగేసి పెట్టే శ్రమజీవుల జీవితంలో అభివృద్ధి ఏ మేరకు జరిగిందీ అనే కోణంలో కూడా తరచి చూశారు. అణిచివేతకు గురయ్యే వర్గాల జీవన చిత్రాలు ఇప్పటికీ మారని సమాజ చిత్రమే కళ్లకు కడుతుందని వాపోతారు. నాటి బకెట్లతో మలం ఎత్తిపోసే పాకీశ్రామికులు రోబో యుగంలో కూడా కొనసాగటం మానవీయతకు అర్థం తెలియని నేటి సమాజ దుష్క ృత్యాలకు పరాకాష్ట. (రోబోలతో అన్ని పనులూ చేయిస్తారు. కానీ మానవ మలాన్ని ఎత్తే రోబో మాత్రం వాళ్లకు గుర్తుకు రాదు!) శర్మ గారి మెమరీలో ఇటువంటి పాకీ శ్రామికులూ, రోడ్ల వెంట బతుకీడ్చుకు వెళ్లే బడ్డీ కొట్లవాళ్ళూ, చిన్ని చిన్ని వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట గడవని అనేక ముస్లిం కుటుంబాల వాళ్ళూ ఎందరో ఎదురవుతారు. ఇతిహాసపు చీకటి కోణంలో ఇప్పటికీ మిగిలి ఉన్న శిథిల జీవితాలనే కాకుండా, చెక్కుచెదరని ఆనవాళ్లుగా శిథిలాల రూపంలో మిగిలి ఉన్న అనేక కట్టడాలను కూడా స్మ ృతి పొరల్లో నుంచి వెలికి తీస్తారు. రాజా నగర్‌ శివాలయంతో పాటూ, పీర్లగుట్ట, తిరుమలయ్య గుట్ట, రామా టాకీస్‌, జగదీష్‌ టాకీస్‌, గుండు బావి ఇంకా అనేక ప్రాచీన అవశేషాల్ని పొదివి పట్టి వాటి ఛాయాచిత్రాలను కూడా అందించే ప్రయత్నం చేశారు.
ప్రముఖ పాత్రికేయులు ఎం. రాఘవాచారి గారు, అంతరంగపు హదయ వీణను రాఘవ శర్మ గారెంత మృదు మధురంగా మీటారో వారి చివరి పలుకుల్లో హద్యంగా చెప్పారు. విజరు కుమార్‌, రాజశేఖర రాజు, నిమ్మగడ్డ శ్రీనివాస్‌, శ్రీరామ్‌ కిషోర్‌, కొత్తపల్లి రవిబాబు, కెఎల్‌ నరసింహం, విజయశ్రీ, గుండోజు యాదగిరి, ఆలూరి వెంకటేశ్వరరావు వంటి మరికొందరి అనుభవాలూ, అనుభూతులూ ఈ అనుభూతుల గ్రంథస్తం ఎంత అద్భుతంగా జరిగిందో వివరించే ప్రయత్నం చేశాయి.
మొత్తంగా రాఘవ శర్మ గారి ‘వనపర్తి ఒడి’ అనేకానేక అనుభూతుల సవ్వడి. అర్ధ శతాబ్దపు వెనుకటి ఒక తెలంగాణ టిపికల్‌ గడీ చుట్టూ పెనవేసుకుపోయిన వైవిధ్యపు జీవితాల బడి. తెలంగాణ గడ్డ మీద యే బడిలో పంతుళ్లైనా అవే కోదండాలు, అవే చింత బరికలు, అవే మట్టి పలకల అరగదీసుడు. స్మృతి పథంలో ఎప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి పోయే అమ్మ విమలాదేవి గారినీ, డాక్టర్‌ బాలకృష్ణయ్య గారినీ, చంద్రమౌళి సార్‌నీ జ్ఞాపకం చేసుకున్న తీరు సమున్నతంగా ఉంటుంది.

ఈ పుస్తకం కావల్సిన వాళ్లు రచయిత (94832 26180)తో నేరుగా సంప్రదించవచ్చు.

– వి.విజయకుమార్‌
85558 02596

➡️