మానవ వైరుధ్యాల సమ్మేళనం ఈ నవల

Dec 4,2023 09:02 #sahityam

               ప్రతి మనిషి జీవితం ఒక కథే. ఆ కథలో, జీవితంలో సంఘర్షణ ప్రతి అడుగులోను ఉంటుంది. ఒక నిర్ణయం ధైర్యంగా తీసుకోవాల్సిన సమయం వచ్చేవరకు సంఘర్షణే. నిర్ణయం తీసుకున్నాకనే ఆ సంఘర్షణ ఆగుతుంది. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగెత్తితేనే ప్రగతి. అలాగే ఒక మనిషి సమాజాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయించుకుంటూ సాగితేనే అది సంతృప్తికరమైన జీవితం. మనిషి తన వ్యక్తిగత సంతోషాన్ని, ఆనందకరమైన జీవితాన్ని పొందటంలో కొంత బెరుకు, తాత్సారం చేస్తూ చివరకు ధైర్యంగా తన జీవితాన్ని మలచుకోవటమే ఈ ‘జీవన స్పర్శ’ నవల.

నవల చదువుతున్నపుడు నాకు 70, 80లలోని జీవన స్థితిగతులు అన్నీ కళ్ళముందు కదలాడాయి. నడిచే రోడ్డు మీద రేగే ధూళి దగ్గర నుండి గోళీసోడా వరకు అన్నీ చాలా సహజమైన సౌందర్యంతో, హృదయాన్ని తట్టాయి. ఎక్కడా మితిమీరిన హీరోయిజం చూపకుండా అతి సాధారణ జీవన పరిస్థితులు, సంఘర్షణల నడుమ ఒక కథానాయకుడిని సృష్టించారు రచయిత గనారా

ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి మధు. ఒక్కగానొక్క కొడుకు. తండ్రి అంటే భయమూ-భక్తి, తల్లి అంటే ప్రేమ-స్నేహం ఉన్నవాడు. అతనిది ఒక చిన్న ప్రపంచం. అమ్మ, నాన్న, ముగ్గురు స్నేహితులు. రాధ అంటే ఎంతో ప్రేమ కాని ఎప్పుడూ బయటకు చెప్పడు. కాని తల్లికి అతని మనసు తెలుస్తుంది. పురాణాలు, ఇతిహాసాలు, విని పెరిగిన మధు బంధువైన ఒక పెద్దాయన ప్రభావంతో ఏ విషయమైనా ప్రశ్నించడం ద్వారా, సమాధానాన్ని పొందడం సరైన మార్గాన్ని కలిగిస్తుంది అని తెలుసుకుంటాడు. హేతువాదాన్ని పెంపొందించుకొంటాడు. మూఢంగా విశ్వసించడం కంటే ప్రశ్నించుకుంటే సరైన దారిలోకి వెళ్ళగలం అని, అదే మానవ చైతన్యం అని, మధు పాత్ర ద్వారా మనకి కూడా తెలుస్తుంది. మధు బ్యాంకు ఉద్యోగి. అమాయకుడు, మంచివాడు, తెలివైనవాడు, ధైర్యం వున్నవాడు, భయస్తుడు. ఇన్ని ఎలా ఉంటాయి? అనుకోకండి. ఒక్కో చోట ఒక్కోటి బయట పడతాయి. ఒక్కోచోట తెగువ, ఒక్కోచోట తాత్సారం.

పోర్టు కార్మికుల బాధల గురించి తెలిసి, చలించి, ధైర్యంగా షిప్‌లోకి, ఎక్కి నడి సంద్రానికి పోరాట స్ఫూర్తితో చేరుకుంటాడు. అందులో ధైర్యం, తెగువ, సమాజం పట్ల ప్రేమ, కనబడతాయి. కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపడంలో అవగాహన, తెలివితేటలు కనబడతాయి. కాని, తన సొంత విషయాలు వచ్చేసరికి, తన ప్రేమను గురించి చెప్పుకోవడానికి, ఒప్పుకోవడానికి చాలా భయస్తుడుగా కనబడతాడు. తన కోసమే ఒక మనిషి, జీవితం అంతా ఎదురు చూస్తోంది అని తెలిసినా తెగువతో, చొరవతో నిర్ణయం తీసుకోలేడు. ఇలా పరస్పర వైరుధ్యాలు అతనిలో కనిపిస్తాయి.

రచయిత ఈ నవలలో మార్కి ్సజం, కమ్యూనిజం గురించి చాలా విపులంగా చెప్పారు. ప్రతి వ్యక్తి పోరాట స్ఫూర్తి కలిగి వుండాలి అంటారు. ఉద్యోగం, ఇల్లు, భార్య, పిల్లలు, కుటుంబం మాత్రమే కాదు; మన చుట్టూ వున్న సమాజం కూడా మన జీవితంలో భాగమే. దానికి కూడా సమయాన్ని కేటాయించాలి అని మధు పాత్ర ద్వారా తెలియజేస్తారు. ఈ నవల ద్వారా ప్రతి మనిషికి తన కుటుంబంతోపాటు సమాజంపట్ల కూడా బాధ్యత, ప్రేమ కలిగి వుండాలని అనిపిస్తుంది. మధు సామాజిక సమస్యల పట్ల బాధ్యత తీసుకుంటాడు, వివిధ రంగాల్లోని కార్మికుల సమస్యల పట్ల, బాధల పట్ల ఎంతగానో చలించిపోతాడు. ఆ సమస్యలపై పోరాటానికి ధైర్యం, తెగువ చూపిస్తాడు. ప్రతి మనిషి సమాజం పట్ల కొద్దిగానైనా ఇలా ఆలోచిస్తే అందరం బాగుంటాం.

హరికథలు, బుర్రకథలు వంటి కళారూపాలు ఆహ్లాదాన్ని మాత్రమే కాదు; మనిషికి ఆలోచనా శక్తిని, పోరాటస్ఫూర్తిని కలిగించాలని, సమాజంలో జరిగే అన్యాయాలను, పీడితుల పట్ల జరిపే దారుణాలను, ప్రతిబింబిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సాధనాలుగా ఉపయోగపడాలని ఈ నవల ద్వారా తెలియజేస్తారు గనారా. ప్రతి వృత్తికి ఒక సంఘం ఉండాలి. అందులోని నాయకత్వం క్రియాశీలకంగా బాధ్యతతో వ్యవహరించుకొంటూ వెళితే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే నాణానికి రెండు వైపులా వున్నట్టు, ఈ సంఘాల్లో కూడా స్వార్ధపరులు వుంటారని చెప్పారు రచయిత.

ఈ నవలలో శ్రీశ్రీ మహాప్రస్థానంలోని విప్లవం, చలం నవలలోని తెగువ-ధైర్యం, కృష్ణశాస్త్రి బాధ, అన్నీ ఇమిడి వున్నాయి. మనుషులందరూ ఒకటే అయినపుడు ఈ కులాలు ఎక్కడ నుంచి వచ్చాయి అని రచయిత ప్రశ్న. కులం, మతం అనేవాటిని ఆరోప్రాణంగా బతుకున్న మనుషుల్ని ఆలోచింపచేస్తుంది ఈ నవల. కులం కూడు పెట్టదు. మతం నీడని ఇవ్వలేదు. అందరూ కలిస్తేనే సమాజం. మనిషిని ఆదరించాలి అన్నా, సహాయం చేయాలి అన్నా, మానవత్వం, ప్రేమ, స్నేహబంధం ఉండాలి అని తెలుస్తుంది ఈ ‘జీవన స్పర్శ’ నవల ద్వారా.”ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు. ఎదలోని మమకారం ఎక్కడికీ పోదు”. ఎన్నాళ్ళు గడిచినా రక్త సంబంధంలోని ప్రేమ, పాశం మనిషిని వీడిపోవు అని చెప్పడానికి ఈ పల్లవిని ఉపయోగించారు రచయిత. అలాగే అసమానతలతో వున్న ఈ సమాజం మారాలి అన్న రచయిత తీవ్రమైన ఆకాంక్ష మనకి తెలుస్తుంది. రచయిత హృదయం, ఆలోచనలు అన్నీ ఎంత నిర్మలమైనవో కూడా తెలుస్తాయి. గనారా మనసు ఏంటో మనకు అర్ధం అవుతుంది.బెంగాల్‌ కరువు, ఆకలితో ప్రజలు అల్లాడి మరణించడం, కరువుతో రైతులు వలస వెళ్ళడం, ధనవంతులు కార్లలో తిరగడం, ఉద్యోగాల గూర్చి ఎగబడటం, గుమ్మం దాటని స్త్రీలు బయట కూలిపనికి, పిడికెడు మెతుకుల కోసం వ్యభిచారం చేయడం … ఇలా ఆనాటి అన్ని సమస్యలకి మధు చలించడం పాఠకుని మనసుని కలిచివేస్తుంది. ఇందులో చెప్పిన ప్రతి సమస్యా ఏవో ఒకటి, రెండు తప్ప మిగతా అన్నీ ఇప్పటికీ అలానే ఉన్నాయి, పరిష్కారానికి నోచుకోలేదు. అందరిలో చైతన్యం వస్తేనే వీటన్నిటిని అధిగమించగలం. అందుకు విద్య చాలా అవసరం. అది కూడా స్పష్టంగా చెప్పారు. ప్రశ్నించే తత్వం ప్రతి మనిషికి అలవడాల్సిన మొదటి లక్షణం అని తెలియజేసారు. అదే కమ్యూనిస్టు పార్టీ ఈ దేశానికి నేర్పిన మొదటి పాఠం అని తెలుస్తుంది. ప్రశ్నించడం, అన్వేషించడం, నిర్దేశించడం అనే ఒరవడి ఏర్పడితేనే మనుషులు ప్రగతి వైపు పరుగులు తీస్తారు అన్న రచయిత ఆలోచన తెలుస్తుంది. ఈ మాటలు సమాజానికి, యువతకి ఒక మార్గ నిర్దేశం.

విప్లవం అంటే కేవలం తిరుగుబాటుతనం కాదు. సమాజం ఒక దశ నుంచి మరొక దశకు మౌలికంగా మారడం అని చెప్పారు. కాని అది శాంతియుతంగా అయితే జరగదు కదా! దానికోసం పోరాటాలు చేయాలి అని ఈ నవలలో రచయిత సమాజం పట్ల బాధ్యతని తెలియజేసారు. విప్లవం అనే పదాన్ని తేలికగా ప్రతిదానికి వాడుతున్నాం అని అందరికీ అనిపిస్తుంది. కాని అది ఎంత విస్త ృతమైనదో ఇందులో చెప్పారు రచయిత.

ఆఖరుగా నాకు అనిపించింది ప్రతి మనిషీ తన కోసం, కుటుంబంకోసం, సమాజంకోసం తన జీవన పోరాటాన్ని కొనసాగించాలి. ఈ నవలలో అగ్రవర్ణాల ఛాదస్తాలు గురించి ప్రస్తావించారు. వాటితోపాటు అగ్రవర్ణాల బాధలు, బీదరికం, వారి కుటుంబాన్ని వాళ్ళే ఉద్ధరించుకోగలిగే మానసిక స్థైర్యం లేకపోవడం అన్నింటినీ తెలియజేసారు. చాలామంది రచయితలు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, అహంకారాన్ని తమ రచనలలో చొప్పించటం చూస్తాం. కాని దిగువ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల దైన్యాన్ని చెప్పినవారు తక్కువ. వాటినన్నటిని రచయిత కళ్ళతో చూసి, మనసుతో అర్ధం చేసుకొని మమేకమై ఈ నవల రాశారు.

చదువు ఏ వర్ణం వారికైనా కచ్చితంగా వుండాలి. ధైర్యం అందరికీ ఆయుధం కావాలి. ముఖ్యంగా స్త్రీకి చదువు, ధైర్యం వుండాలి. రాధ కుటుంబం బ్రాహ్మణ కుటుంబం. తండ్రి పోయాక ఆ కుటుంబం చాలా బాధలు అనుభవించింది. వాళ్ళ కులం, వారికి ఎప్పుడూ ఉపయోగపడలేదు. స్నేహితులే ఆదుకుంటారు. జీవితం చేయి దాటిపోతున్నపుడు ప్రాణం మీదకి వచ్చినపుడు ఎవ్వరూ కులం, మతం పట్టించుకోరు. ఇదే ఆలోచన ప్రతి విషయంలో ఎందుకు వుండదు మనిషికి? మనిషి తన అవసరానికి చాలా స్టేట్‌మెంట్స్‌, డెఫినిషన్స్‌ ఇస్తాడు. తన ప్రయారిటీస్‌ని మార్చుకుంటాడు. ఈ కుల మతాలు కూడా అంతే! అంతా వారి స్వార్ధంకోసం వాడుకుంటారు. అడవి గుఱ్ఱంలా తిరిగే మనిషికి కళ్ళెం వేయగలిగేది సమ సమాజం, చైతన్యం, ప్రగతి అవ్వాలి తప్ప కులం, మతం, డబ్బు అవ్వకూడదు అంటారు రచయిత. మొత్తం మీద ఈ నవల అనేకానేక వాస్తవిక జీవిత సంఘర్షణలను చక్కగా చిత్రీకరించింది. రచయిత గనారా గారికి అభినందనలు.

  – జోస్యుల దీక్ష 89855 70753

➡️