చింతన

Dec 4,2023 08:36 #sahityam

అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది

ఆకాశం డాబా మీద కూర్చుని జనాన్ని చూస్తుంటే

ఏం కథలు ఏం వెతలు

ఎంత మనుషులు ఏమేమి మనుషులు

ఎన్ని హంగులు ఎన్ని రంగులు

మరిన్నెన్ని నాటకాలు

ఇంత పెద్ద రంగస్థలం మీద

బహు స్వల్పమైన జీవితాన్ని

ఎంత బాగా అభినయిస్తున్నారు!

కొందరు ఎంత అందంగా పండిస్తున్నారు

పాల వెన్నెలలో పచ్చని పైరులా

పసిడి గుమ్మాల పచ్చ పచ్చని పందిరిలా

బతుకు ఓ పరసలా ఓ పండగలా

మరి కొందరేమో బాధలకు బందీలు

రోగాలు రొప్పులు కుదిరి

ముసురు గప్పిన దిగులులా

మూలబడిన వస్తువుల్లా

దివారాత్రుళ్ళు

లేని దాన్ని వెతికి వెతికి

లేనిపోని వాంఛలతో

పనికి రాని కాంక్షలతో పదే పదే

అదే స్వార్థంతో అదే అదే సంకుచితంతో

ఉన్నదాన్ని విడిచి

లేని దాన్ని పట్టుకు వేలాడుతూ

వేసారి పోతూ

శ్మశానం మీదుగా సమాధుల గుండా

కాకపోతే మరి ఎక్కడికి పోతారు ?

స్వర్గ నరకాలన్నీ ఇక్కడే వదిలి…

నేను మాత్రం

నా ఆకాశంలో నా డాబా మీద

ఓ చింతనాత్మక గేయమై … – లోసారి సుధాకర్‌

➡️