ట్రోలింగ్‌.. ఒక సామాజిక సమస్య !

Feb 19,2024 11:33 #sahityam

                 మన దేశంలో మనుషులకు ఉండే స్వేచ్ఛ వారు దేనిని ప్రశ్నించనంతవరకే అని, ఆ ప్రశ్నలు సూటిగా తగలాల్సిన చోట తగిలినప్పుడు, నియంతృత్వ ధోరణి ఎలా విరుచుకుపడుతుందో చెప్పే ఒక విధ్వంసర క్రీడే ‘ట్రోలింగ్‌’. ఈ ‘ట్రోలింగ్‌’ బారిన పడిన 15 మంది స్త్రీల కథనాలను ‘ట్రోల్‌’ ప్రశ్నించే స్త్రీల అనుభవ కథనాలు పేరుతో పుస్తకంగా తీసుకువచ్చింది ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ (ప్రరవే). ఈ అంశం మీద ప్రరవే ఏడవ మహాసభల్లో రెండు రోజుల సమావేశాలు కూడా జరిగాయి. ‘ట్రోలింగ్‌’ నిజానికి సాధారణ అంశం కాదు; ఒక వ్యక్తిలోని ధైర్యాన్ని, శీలాన్ని, నైతికతను, విలువలను హత్య చేయడానికి; భయపెట్టడానికి, బాధపెట్టడానికి ఎక్కు పెట్టబడుతున్న ఒక ‘టాక్సిక్‌ వెపన్‌’ అని ఈ కథనాలు చదివితే అనిపిస్తుంది.

ఈ 15 మంది స్త్రీలూ కులం, జెండర్‌, మత మైనారిటీల సమస్యలపై పని చేస్తున్నవాళ్ళు. వివక్షారహిత లోకాన్ని ఆకాంక్షిస్తున్న వాళ్ళు. ప్రజాస్వామిక భావ చైతన్య ప్రసారానికి అవరోధం అవుతున్న వాటిని తొలగించుకుంటూ పోవాలని ఆశిస్తున్న వాళ్ళు. అందుకొరకే మాట్లాడుతున్న వాళ్ళు, రాస్తున్న వాళ్ళు, సృజన సాహిత్యకారులు, పత్రికా రచయితలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు.

అరుణ గోగులమండ కథనంలో – ”వివక్షా రహిత లోకాన్ని కోరుకున్న ఓ విద్యావంతురాలిని… తన జీవితాన్నే తానే నిర్మించుకున్న ధృడమైన స్త్రీని సాటి స్త్రీలు, కుల పెద్దలు సైతం ఎలా ట్రోల్‌ చేస్తూ, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నంతో పాటు, తమ హేళన భావాన్ని ఆమె చుట్టూ ఉన్న ఆవరణలో ఎలా ప్రతిధ్వనించేలా చేశారో వివరించారు. దృఢంగా ఉండే వ్యక్తుల మీద ఏదో ఒక రూపంలో దాడులు ఎలా కొనసాగుతూ ఉంటాయో అరుణ మాటల్లో అర్థమవుతుంది. రాఘవేంద్రరావు సినిమాల్లో స్త్రీ చిత్రీకరణ గురించి, సంసారాల్లో స్త్రీలపై అట్టడుగు వర్గాల స్త్రీలపై ఎంత హింస దాగి ఉంటుందో అన్న అంశం గురించి, పురాణాల్లో స్త్రీలపై హింస, వ్యక్తిత్వ హననం వంటి అంశాలపై రాసినందుకు ట్రోలింగ్‌ జరగడం ఒక కోణం. కులం గురించి కనుక్కుని, ఆ కులం వారు ఓన్‌ చేసుకోవడం జరిగినా, పితృస్వామ్య ధోరణులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఆ కులపెద్దల నుంచి అందరూ దారుణంగా ట్రోల్‌ చేయడం ఇంకో కోణం. ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ, ఒంటరిగా ధైర్యంగా సాగిపోతున్న స్త్రీని ‘ఈజీ ప్రే’ గా చూసే మగవాళ్ళు, వ్యక్తిత్వ- శీల హత్య చేయడం… ఇవన్నీ కూడా ట్రోల్‌ రూపాలే. ”పురుషులు స్త్రీలకు ఇన్సెంటివ్స్‌ ఇవ్వడానికి ఇష్టపడతారు తప్ప, గౌరవం ఇవ్వడానికి ఒప్పుకోరు” అని ఓ చోట అరుణ రాశారు. ఆలమూరు సౌమ్య తన అనుభవాలు రాస్తూ, ‘సహానుభూతి లేని వాతావరణంలో ట్రోలింగ్‌ జరుగుతుంది. ట్రోలింగ్‌కు కారణం అహంకారం. ముఖ్యంగా కులాహంకారం, పురుషహంకారం. సామాజికంగా బలమైన కులం నుంచి వచ్చిన అమ్మాయిగా కులాహంకారాన్ని ఎదుర్కొలేదు కానీ పురుషహంకారాన్ని మాత్రం ఎదుర్కున్నాను’ అని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మీయుల బలం వల్ల తాను ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా నిలబడగలిగానని చెప్పారు.

‘చైతన్య మహిళా సంఘం’లో పనిచేస్తున్న కాగుల శ్రీదేవి, ‘సత్యాన్ని చెప్పడం కూడా ఒక యుద్ధం లాంటిదే’ అంటారు. సోనియా గాంధీ మీద కొందరు అసభ్యకరమైన రాతలు రాసినప్పుడు, ఆది పురుష్‌ సినిమా గురించి రాసినప్పుడు ట్రోలింగ్‌కు గురైన శ్రీదేవి సోషల్‌ మీడియాలో మిత్రులైన వారు కూడా మద్దతుగా నిలబడకపోవడం వల్ల, దానిని అనివార్య చర్యగా భావించకపోవడం వల్ల ఈ ట్రోలింగ్‌ మితిమీరిపోతుందని’ రాశారు. ”గౌరవం పొందడం నా హక్కు. నా హ్యూమన్‌ డిగ్నిటీని అవమానపరిచే హక్కు ఎవరికి లేదు” అంటారు కె.ఎన్‌.మల్లీశ్వరి. ‘మతమంటే మొగుడే కదా?’ అన్న శీర్షికతో బ్లాగులో రాసినందుకు, ‘కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త’ అన్న కాలమ్‌ సాక్షిలో రాసినప్పుడు, ‘నీల’ నవల విషయంలో, ‘ప్రరవే’ విషయంలో ఇలా అనేక అంశాల్లో ట్రోలింగ్‌ ఎదుర్కున్న మల్లీశ్వరి, ‘భాషలో, భావంలో ప్రజాస్వామికత చూపనివారు మిత్రులైనా సరే గట్టిగా వ్యతిరేకించాలి’ అంటారు. ‘ఈ ట్రోలింగ్‌ను అరికట్టాలంటే ఎంత చిన్నగా అయినా సరే మన నిరసనను రికార్డు చేయటం అవసరం. సమిష్టి కార్యాచరణ చాలా ముఖ్యం.’ అంటారు సామాజిక ఉద్యమకారిణి సజయ. సనాతన ధర్మం మహిళలకు ఎంత ప్రమాదమో, ఇండియా- పాకిస్తాన్‌ మధ్య సృష్టించబడే యుద్ధాల వెనుక ఉండే వ్యూహాల గురించి రాసినప్పుడు ట్రోలింగ్‌కు గురైన కొండవీటి సత్యవతి, ‘భయపట్టి మనల్ని ఆపాలనుకునే ట్రోలర్స్‌ మూర్ఖత్వాన్ని మనం ఆపకుండా రాస్తూ, వారిపై చట్టపరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండటం వల్లే అడ్డుకోగలము’ అని స్పష్టంగా తన కథనంలో చేశారు.

పురుషాధిక్యత, ముస్లిం అస్తిత్వం వల్ల కూడా ట్రోలింగ్‌కు గురయ్యే సందర్భాలను ఇందులో కథనంగా చెప్పారు ఖాలీద పర్వీన్‌. పెయిడ్‌ ట్రోలింగ్‌ గురించి, మతపరమైన దాడుల గురించి గురించి చెబుతూనే, ప్రభుత్వం చిత్తశుద్ధితో వీటిని అరికట్టే దిశలో పని చేయాలని అంటారు. ఇండిపెండెంట్‌ జర్నలిస్టుగా తన యూట్యూబ్‌ చానల్‌తో కొనసాగుతున్న తులసి చందు… తెలంగాణలో నిరుద్యోగం, మతం పేరుతో ఓట్లడిగే నాయకుల ధోరణిని వ్యతిరేకించినందుకు, రైతుల పోరాటానికి మద్దతుగా మాట్లాడినందుకు, ఇంకా అనేక అంశాల్లో ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు. ట్రోల్స్‌ను ఎదుర్కోవడానికి ఒక మార్గం వాటిని పట్టించుకోకపోవడం అని రాశారు.

తెలంగాణ వుమన్‌ ట్రాన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో సభ్యురాలిగా ఉంటూ, క్వియర్‌ నెస్‌ గురించి మాట్లాడినందుకు, వివిధ లైంగిక ఆసక్తులను సమాజం గౌరవించాలని పోరాటం చేస్తున్నందుకు సోషల్‌ యాక్టివిస్ట్‌ దీప్తి సిర్ల కూడా ఎంతో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ విషయంలో ట్రోలర్స్‌ విజంభణ స్థాయి అధికంగా ఉంటుంది. ఈ కథనంలో స్త్రీలు తమ వైవిధ్యతను గురించి మాట్లాడుకోవడం కోవడం కూడా ఎలా వారిపై ఇంత విషం కక్కేలా చేస్తుందో వివరించారు. ‘అశ్లీలత ఆధిపత్యపు వికృత లక్షణంగా ట్రోలింగ్‌ రూపంలో ఎలా బయటపడుతుందో, ట్రోలింగ్‌ టెక్నాలజీ చీకటి రూపంగా, సైన్సు టెక్నాలజీపై ఆధిపత్యపు పట్టుకు ఆధునిక నిదర్శనంగా ఎలా మారిందో సాంస్క ృతిక కార్యకర్త దేవి తన కథనంలో స్పష్టం చేశారు. స్త్రీల మత స్వేచ్చ గురించి, నోట్ల రద్దు సమయంలో ప్రజల ఇబ్బందుల గురించి రాసినందుకు విపరీతమైన ట్రోలింగ్‌కు గురైన కవయిత్రి, నాటకకర్త మెర్సీ మార్గరెట్‌… ఈ ట్రోలింగ్‌ను ఎదుర్కోవాలంటే, ‘పాఠశాలల్లో ఈ సామాజిక మాధ్యమాలను వాడే విధానం గురించి చెప్పాలని’ అంటారు. ఈ ట్రోలింగ్‌ వల్ల తన ఆరోగ్యం పాడైన క్రమం, కుటుంబ సభ్యులు కూడా బాధపడిన సందర్భాల గురించి తన కథనంలో రాశారు.

ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్‌గా పని చేస్తున్న సంధ్య స్త్రీ-పురుష సమానత్వం, హక్కులు, సమాన వేతనాలు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు, క్యాస్టింగ్‌ కౌచ్‌ స్త్రీలను అణచివేసే సాంప్రదాయాలు, పురుషాధిపత్యం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడినందుకు ట్రోలింగ్‌కు తను గురైన క్రమాన్ని తన కథనంలో వివిధ సందర్భాలను జోడిస్తూ రాశారు. ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌ గా, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌గా కొనసాగుతున్న సి.వనజ … గరికపాటి నరసింహారావు ప్రవచనాల్లో కనిపించే స్త్రీ వ్యతిరేక దృక్పథం గురించి మాట్లాడినప్పుడు తనను ట్రోల్‌ చేసిన విధానాన్ని, హిందుత్వ రాజకీయాల ప్రమేయం ఇందులో ఉండటం గురించి చెబుతూనే, ‘ట్రోలింగ్‌ అన్నది కేవలం పొలిటికల్‌ విల్‌ ఉంటేనే ఆగుతుంది’ అని అన్నారు. తనను ట్రోల్స్‌ ఎంత బాధించాయో అంత స్పష్టతను కూడా ఇచ్చాయని అంటారు ప్రొఫెసర్‌, రాజకీయ వ్యాఖ్యాత సూరేపల్లి సుజాత. ఫెమినిస్టులు, ఉద్యమకారులు, ఆక్టివిస్టుల పట్ల ట్రోలర్స్‌కు ఉండే నీచ అభిప్రాయం గురించి, అణగారిన ప్రజల కోసం పని చేసే క్రమంలో ఎదుర్కున్న ట్రోలింగ్‌ గురించి, దానికి దూరంగా ఉండే ప్రయత్నం లేదా పట్టించుకోకుండా ఉండటమే ఉత్తమం అని సూచించారు ఈ కథనంలో సుజాత. ‘ది హిందూ’ దినపత్రికలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పని చేస్తూ, సోషల్‌ మీడియాలో ఎక్కువగా రాజకీయ, సామాజిక అంశాలపై రాసే స్వాతి వడ్లమూడి జమ్మూలో కథువా ప్రాంతంలో మైనర్‌ బాలికను హిందుత్వ మూకలు ఒక గుడిలో సామూహిక అత్యాచారం చేసిన ఘటనకు స్పందించి కార్టూన్‌ వేసినందుకు, ‘బాధ పడకండి’ అనే కవిత రాసినందుకు ట్రోల్‌కు గురైన విధానం గురించి, కులం లేని పితస్వామ్యం వల్ల ట్రోలింగ్‌ ఎలా విజంభిస్తుందో, స్త్రీల లైంగికతే లక్ష్యంగా ఎలా కొనసాగుతుందో తన కథనంలో రాశారు.

‘ట్రోలింగ్‌’ను ఎక్కువగా వ్యక్తిగత వ్యవహారంగా చూడటం వల్ల- అది ఎక్కువగా కామెంట్స్‌ రూపంలో ఉండటం, అది సృష్టించే విధ్వంసం సోషల్‌ మీడియాలో చురుగ్గా లేని వారికి, వాటికి దూరంగా ఉండేవారికి అర్థం అయ్యే అవకాశం తక్కువ. అలాగే స్పందించేవారు ఎక్కువగా అంతో ఇంతో ఆ భావజాలం అంగీకరించే వారు కనుక, వారిని కూడా ట్రోల్‌ చేసే అవకాశాలు ఎక్కువ. ట్రోలింగ్‌ ఒక స్పందన దశను దాటి సమూహాలుగా ఏర్పడి, ట్రోల్‌ చేయడాన్ని ఒక వృత్తిగా భావిస్తూ, ఐక్యమవుతూ ఉంటే- దానిని వ్యతిరేకించే సాధనాలు మాత్రం చట్టపరంగానూ, సమాజ పరంగానూ ఏవి బలంగా లేవనే సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. ట్రోలింగ్‌ పరోక్షంగా సమాజంలోని అనేకమంది అభిప్రాయాలను ప్రభావితం చేస్తుంది. అసలు వ్యక్తి ఎవరో తెలియకుండానే వారిపై ద్వేషం ఏర్పరుచుకునే వాతావరణానాన్ని కల్పిస్తుంది. ట్రోలింగ్‌ ఒక భాగంలా చొచ్చుకుపోయే కొద్ది నియంతృత్వ శక్తులు బలపడుతూ, దీనిపై అవగాహన లేని వారిని సైతం వారికి కూడా తెలియకుండానే వారి కోసం పనిచేసేలా చేస్తాయి. ఇప్పుడు సమాజంలో ఈ ‘ట్రోలింగ్‌’ గురించి చర్చ, నిరసన అవసరం. ఆ అవసరాన్ని స్పష్టం చేస్తూ, ఆ నిరసనను అక్షరాలతో ఎక్కు పెట్టిన అస్త్రమే ఈ ‘ట్రోల్‌’ పుస్తకం. – శృంగవరపు రచన ‘ట్రోల్‌’ పుస్తకంలో ముఖ్యంగా ఈ కథనాల ద్వారా ఈ కింది ఏడు ముఖ్య అంశాలు చర్చకు పెట్టే దిశలో ఉండేలా జాగ్రత్త తీసుకున్నట్టు ఈ పుస్తక సంపాదకులు కాత్యాయని విద్మహే, కె.ఎన్‌.మల్లీశ్వరి ముందుమాటలో రాశారు.

అవి : సమకాలీన ఘటనల నుంచి, సందర్భాల నుంచి స్త్రీల నిత్య జీవితంలో ఆచారాలు, నోములు, వ్రతాలు, కట్టుబొట్టు పేరిట కనిపించకుండా అమలవుతున్న పితృస్వామిక అధికార రూపాలను గుర్తించి విమర్శకు పెట్టడం.

  • స్త్రీల లైంగికత, లైంగిక సంబంధాల గురించి చర్చించటం.
  • దళిత స్త్రీలు బయట నుంచి, లోపలి నుంచి ఎదుర్కుంటున్న వివక్ష గురించి చర్చించటం.
  • మనుషుల మధ్య నిచ్చెన మెట్ల అధికార సంబంధాలను కుటుంబం పేరిట, కులం పేరిట, మతం పేరిట, రాజ్యం పేరిట స్థిరీకరించిన మనుస్మ ృతిని ప్రశ్నించటం.
  • మనువాదుల వాదనలను తిప్పికొట్టటం.
  • అశాస్త్రీయ భావాలను, ఆచరణలను విమర్శించటం, వ్యతిరేకించటం.
  • ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను విమర్శిస్తూ సరైన అవగాహన కల్పించే ఆచరణలో ఉండటం.
➡️