వాలెంటైన్‌కు సాంకేతిక బహుమతులు

Feb 14,2024 17:38 #Special Days, #Stories, #Technology
Tech Gifts for Valentine

వాలెంటైన్స్‌ డే వచ్చిందంటే… గులాబీలు, చాక్లెట్స్‌, టెడ్డీలకు డిమాండ్‌ పెరుగుతుంది. ప్రేమికులు తమ ప్రియమైన వారికి వీటిని బహుమతిగా ఇస్తుంటారు. అయితే, ఈ సంవత్సరం వాలెంటైన్‌ డే సందర్భంగా ఆశ్చర్యపరిచే కొన్ని సాంకేతిక బహుమతులు అందుబాటులోకి వచ్చాయి. వినూత్నమైన బహుమతితో మీ ప్రియమైన వారిని ఆకట్టుకోవాలని అనుకుంటున్నట్లయితే… చక్కని గాడ్జెట్స్‌ అందుబాటులో వున్నాయి.

ఫుజిఫిల్మ్‌ ఇన్‌స్టాక్స్‌ మినీ 11:

ఇదొక ఇన్‌స్టంట్‌ కెమెరా. పేరుకు తగ్గట్టుగానే క్లిక్‌ చేసిన వెంటనే ఫొటోలను అందిస్తుంది. క్రెడిట్‌ కార్డు సైజులో ప్రింట్‌లను ఉత్పత్తి చేయగల సొగసైన, ఆహ్లాదకరంగా కనిపించే స్టైలిష్‌ కెమెరా ఇది. ఆటోమేటిక్‌ ఎక్స్‌ఫోజర్‌ ఆప్షన్‌తో ఈ కెమెరాను అప్‌డేట్‌ చేశారు. దీనివల్ల వివిధ లైటింగ్‌ షేడ్స్‌కి అనుకూలంగా మాన్యువల్‌గా ఆప్షన్స్‌ను సెట్‌ చేసుకోవాల్సిన అవసరం ఇకపై వుండదు. కాంతి తక్కువగా వున్న సమయంలోనూ ఈ కెమెరాలో అంతర్నిర్మిత ఫ్లాష్‌ పనిచేస్తుంది. అందువల్ల ఎలాంటి సమయంలోనైనా చక్కని ఫొటోలను తక్షణమే పొందొచ్చు. నీలం, గులాబీ రంగుల్లో అందుబాటులో వుండే ఈ మినీ కెమెరాతో ఫొటోగ్రఫీని ఆస్వాదించడమేకాకుండా వాలెంటైన్స్‌డే జ్ఞాపకాలను పదిలపర్చుకోవచ్చు. దీని ధర రూ.5,499.

ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఇ (2వ తరం) :

ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు ఇష్టపడే గాడ్జెట్‌ ఇది. ఈ కొత్త ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఇ స్మార్ట్‌వాచ్‌… స్టైల్‌ని హెల్త్‌ ట్రాకింగ్‌తో మిళితం చేస్తుంది. హృదయ స్పందన పర్యవేక్షణ, లకేషన్‌ ట్రాకింగ్‌ వంటి ఆపిల్‌ వాచ్‌ ఫీచర్‌లను అందిస్తుంది. ముఖ్యంగా వాటర్‌ ప్రూఫ్‌ డిజైన్‌ వ్యాయామం, స్విమ్మింగ్‌ వర్కవుట్స్‌ సమయంలో ధరించడానికి వీలుగా వుంటుంది. ఫోన్‌ కనెక్టివిటీ, ఇతర ఆపిల్‌ పరికరాలతో అనుసంథానమై వుండటానికి సహాయపడుతుంది.

కిండిల్‌ పేపర్‌వైట్‌ :

వాలెంటైన్స్‌ రోజున పుస్తక ప్రియులకు గొప్ప బహుమతి కిండిల్‌ పేపర్‌వైట్‌. 300 పిపిఐ గ్లేర్‌-ఫ్రీ డిస్‌ప్లేతో మామూలు కాగితానికి సమానంగా అక్షరాలను అందిస్తుంది. ఎక్కువ సమయం చదువుకోడానికి కూడా సౌకర్యంగా వుంటుంది. ఈ కిండిల్‌ నుంచి వచ్చే కాంతిని మన కంటికి సౌకర్యవంతంగా వుండేలా మార్చుకోవచ్చు. ఇది కంటి ఒత్తిడిని కూడా నిరోధిస్తుంది. కాబట్టి పగలైనా రాత్రైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చదువుకోవచ్చు. తేలికపాటి డిజైన్‌తో వుండే ఈ పేపర్‌వైట్‌ బ్యాటరీ లైఫ్‌ కూడా పదివారాలు వుంటుంది. పైగా ఇది వాటర్‌ ప్రూఫ్‌. అయితే, ఇది ఆడియోబుక్‌లకు సపోర్ట్‌ చేయదు కానీ, కిండిల్‌ అన్‌లిమిటెడ్‌ ద్వారా మిలియన్ల కొద్దీ ఈబుక్స్‌ను అందిస్తుంది. దీని ధర రూ.13,999.

బోట్‌ స్మార్ట్‌రింగ్‌ :

ఆరోగ్య స్పృహ వున్న భాగస్వామికి ఇది సరైన బహుమతి. ఉంగరం మాదిరిగా వుండే ఈ చిన్న పరికరం హృదయ స్పందన రేటు, SpO2 స్థాయి, నిద్ర వంటి వాటిని ట్రాక్‌ చేయగలదు. ఫిట్‌నెస్‌ చిట్కాలను సైతం అందిస్తుంది. చెమట, దుమ్ము, ధూళికి తట్టుకుంటుంది. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే… ఆరు రోజుల పాటు పనిచేస్తుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానిస్తే… బ్లూటూత్‌ కాలింగ్‌, నోటిఫికేషన్లకు సపోర్టు చేస్తుంది. దీన్ని ఎక్కువ సమయం ధరించినా ఎలాంటి ఇబ్బందీ వుండదు. దీని ధర రూ. 8,999.

ఇవేకాకుండా… ఐప్యాడ్‌ ఎయిర్‌ (5వ తరం), ఎంఐ స్మార్ట్‌ బెడ్‌సైడ్‌ ల్యాంప్‌2 , ట్రిబిట్‌ మాక్స్‌సౌండ్‌ ప్లస్‌, ఎంఐ రోబోట్‌ వాక్యూమ్‌ామాప్‌ వంటి సాంకేతికత పరికరాలను మన ఇష్టులకు బహుమతిగా ఇవ్వొచ్చు. ఈ వాలెంటైన్స్‌ రోజుకు అద్భుతైన సాంకేతికతను జోడించడం ద్వారా బోలెడన్ని జ్ఞాపకాలను పోగేసుకోవచ్చు.

➡️