ఓ పిచ్చుకమ్మా..! ఏదీ నీ చిరునామా!

Mar 17,2024 06:01 #Sneha

అరమరకి ఉన్న అద్దం ముందు వాలి.. చిన్ని గుండ్రటి తలను అటూఇటూ చిత్రంగా తిప్పుతూ.. దాని ప్రతిబింబాన్ని చూసి ముక్కుతో టకటకమని పొడుస్తూ హొయలొలికించే ఆ చిరు పక్షులు ఏవీ..! ఉదయాన్నే వరండా చూరుకు వేలాడదీసిన జొన్న పొత్తులు, వరి కంకులపై కువకువలతో అలరించే గిజిగాడు ఏమయ్యాడు..! చేటలో బియ్యం చెరిగి అమ్మ ఏరిపడేసిన వడ్లగింజలను ఏరుకుని తినేందుకు బుడిబుడి గెంతులతో.. కిచకిచలాడుతూ పలకరించే పిడికెడంత పిచ్చుకలేమైపోయాయి..! అవును కదూ! అవి కనిపించక.. మనం ఆలకించక దశాబ్దకాలం దాటిపోయింది. పూరిళ్లు, పాడి పంటలతో విలసిల్లిన కాలంలో పిచ్చుకలు కూడా మనిషితో మనుగడ సాగించేవి. జనావాసాల మధ్య నివశించే ఈ పిచ్చుకలిప్పుడు కనుమరుగైపోతున్నాయి.. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేరిపోయాయి. వీటిని కాపాడుకునే క్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకుగాను ప్రతి సంవత్సరం మార్చి 20న జరిగే పిచ్చుకల దినోత్సవం.. సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

మన చేతిలో ఇమిడేంత సైజులో ఉండి.. గోధుమ, బూడిద రంగుల ఈకలతో సర్వసాధారణంగా ఉంటుంది పిచ్చుక. ఇది పాసెరిడే కుటుంబానికి చెందినది. పిచ్చుకల్లో ప్రపంచవ్యాప్తంగా 35 జాతులు ఉన్నాయి. పాసర్‌ డొమెస్టికస్‌ శాస్త్రీయనామం గల ఊర పిచ్చుక మనందరికీ సుపరిచితమైనది. ఈ చిన్నిపక్షి సంఘజీవి. పక్షి చిన్నదైనా పరపతి మెండు. పర్యావరణ వ్యవస్థలో దీని పాత్ర కీలకం. అంతేకాదు సాహిత్యం, జానపదాలు, మత గ్రంథాలు, సంస్కృతీ సంప్రదాయాలలో దీనికొక ప్రత్యేకత ఉంది. వివిధ సంస్కృతులలో సరళత, స్వేచ్ఛ, సహజత్వం, స్ఫూర్తి లాంటి భిన్న లక్షణాలను వీటికి క్రోడీకరించి ఆకట్టుకునేలా చూపిస్తారు. అంతేకాదు. రైతుకు మంచి నేస్తాలు ఈ పిచ్చుకలు. పంట పొలాల్లో చిన్నచిన్న పురుగులు, కీటకాలను తిని మొక్కలను చీడపీడల నుంచి కాపాడతాయి.


గూడెంత కళాత్మకం.. !
పెరటిలో ఉండే వేప, బాదం లాంటి గుబురు చెట్లకు అందమైన వేలాడే పిచ్చుక గూళ్ళు.. దిగుడు బావుల్లో వేలాడే చెట్ల మీద.. పెద్దపెద్ద చెట్ల బొరియల్లో.. పూరిళ్ల చూరుల్లో.. భవనాలు, వంతెనల వంటి కట్టడాల్లోనూ ఈ పిచ్చుకలు గూళ్లు కట్టుకొని జనావాసాలతో మమేకమై జీవిస్తాయి. చిన్నచిన్న పుల్లలు, మెత్తటి పీచు, గడ్డిపరకలు ఎక్కడెక్కడి నుంచో దాని చిన్ని ముక్కుతో తెచ్చి నిర్మించే గూడు ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఎంతటి ఇంజనీరు, ఆర్కిటెక్చరుకైనా ఆశ్చర్యం కలిగించేంత కళాత్మకంగానూ ఉంటుంది.!
మనలోనే.. మనతోనే..!
పిచ్చుకలు ఇళ్ల ముంగిట జంటగా లేదా గుంపుగా వాలి, చిన్న అలికిడికే తుర్రుమని ఎగిరిపోతాయి. ఇలాంటి దృశ్యాలు చూడాలేగానీ వర్ణించనలవి కావు. గూడు కట్టడం.. గుడ్లను పొదగడం.. నోటితో ఆహారం తెచ్చి పిల్లల నోటికి అందించటం.. ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడటం.. మనకు ఆనందింపజేసే ప్రేమైక దృశ్యాలే. ఇవన్నీ మనసుకు ఎంతో హాయినిస్తాయి. నిశితంగా గమనిస్తే పిల్లల పట్ల చూపే ప్రేమ.. జంటగా నిర్వర్తించే బాధ్యత.. కష్టపడే తత్వం మనమూ తెల్సుకోవాల్సినవిగా ఉంటాయి. ఇళ్ళ దగ్గర అందమైన గూళ్ళు కట్టుకుని జీవిస్తాయి. ఈ గిజిగాడి కిచకిచలు ఇంటిల్లిపాదికీ వినసొంపుగా ఉంటాయి. వాటి కిలకిల రావాలే మనకు మేలుకొలుపు అయ్యేది కొద్దికాలం క్రితం వరకూ.
పిచ్చుకలు పర్యావరణ హితాలు..
అంత చిన్ని పక్షులు పర్యావరణానికి ఎలా ఉపయోగపడతాయని మనకు అనిపించవచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం అనేది పిచ్చుకల విషయంలో వాస్తవం. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. పళ్ళలోని విత్తనాలు తిని వేరే ప్రదేశాల్లో విసర్జించటం.. తద్వారా కొత్త ప్రాంతాల్లో కొత్త మొక్కలు వ్యాప్తి చెందటంలాంటి పర్యావరణ హితానికి తోడ్పడతాయి. పుష్పాల ఫలదీకరణ, పరాగసంపర్కం ప్రక్రియల ద్వారా కొత్త విత్తనాలు ఏర్పడటంలోనూ పిచ్చుకలు పాత్ర వహిస్తాయి. అంతేకాదు పిచ్చుకల విసర్జకాలు భూమికి మంచి ఎరువుగా మారుతుంది. ఖరీదైన, హానికరమైన రసాయన పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులకు ఇలా సహకరిస్తాయి. అంటే రీసైక్లింగ్‌ చేస్తాయి. పిచ్చుకలు విత్తనాలు, ధాన్యంతో పాటు లార్వాలను ఆహారంగా తీసుకుని, పంట తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. ఆయా ప్రక్రియల ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి.


పర్యావరణ దాడి..
మానవ జీవనశైలిలో శరవేగంతో మార్పులు వచ్చాయి. పట్టణీకరణ.. కనుమరుగవుతున్న ఖాళీ స్థలాలు.. కాంక్రీటు కీకారణ్యం.. అపార్ట్‌మెంట్‌ కల్చర్‌లో ఆకాశ హార్మ్యాలు.. గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్న చెట్లు.. అంతరిస్తున్న పచ్చదనం.. రసాయనాల పళ్లు, పంటలు.. కల్తీ ఆహార ధాన్యాలు.. సాంకేతికాభివృద్ధి రూపంలో వెలసిన సెల్‌ టవర్లు.. వీటి నుంచి వెలువడే రేడియోథార్మికత.. బుజ్జి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలే అయ్యాయి. పంటలు లేక పిచ్చుకలకు ఆహారం దొరకని పరిస్థితి. ఉన్న ధాన్యపు పంటలు పురుగు మందుల మయం. వీటన్నింటి ప్రభావంతో మెల్లమెల్లగా అందరిలో మెలిగే పిచ్చుక అరుదైన పక్షి జాబితాలో చేరిపోయింది. మనిషి పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్‌ తరంగాల రేడియేషన్‌, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి.


పునరావృత చర్యలు..
మనతో కలసి జీవిస్తూ, మనకు ఎలాంటి హానీ చేయని పక్షిని కాపాడుకోవడం మన కర్తవ్యం.
పిచ్చుకలు రాగులు, సజ్జలు మొదలైన చిరుధాన్యాలు, దోమలు-కీటకాల లార్వాలను తిని, అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. పిచ్చుకలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తక్షణం చేయవలసిన కొన్ని కర్తవ్యాలున్నాయి.
పిచ్చుకలకు తిండి గింజలు, నీరు లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేయాలి.
పంట అధిక దిగుబడికి, దోమల, కీటకాల నివారణకు వాడే రసాయనాల వినియోగం తగ్గించి, సహజ ప్రత్యామ్నాయాలను ఎన్నుకోవాలి.
వాహనాలలో అధిక నాణ్యత గల ఇంధనాన్ని ఉపయోగించి, కాలుష్యాన్ని తగ్గించాలి.
సెల్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను వినియోగించేటప్పుడు యాంటీ రేడియేషన్‌ కవర్‌ని ఉపయోగించాలి.
పక్షి, పర్యావరణ ప్రేమికులు, అనేక సంస్థలు ఇప్పటికే కృత్రిమ పిచ్చుక గూళ్ళు తయారుచేసి, పంచిపెట్టటం.. చెట్లను నాటటం.. పిచ్చుకలకు నివాసయోగ్యమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
2012లో, పిచ్చుకను న్యూఢిల్లీ రాష్ట్రపక్షిగా ప్రకటించింది. పిచ్చుక జాతి రక్షణ నిమిత్తం భారీ ప్రచారం, రక్షణ చర్యలు చేపడుతోంది.
ప్రపంచంలోని ప్రతి ప్రాణికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ప్రాణుల మధ్య ఒక సుదీర్ఘమైన ఆహారపు గొలుసు ఉంది. ఈ గొలుసు నిర్వహణలో ఎప్పుడైతే హాని మొదలవుతుందో అప్పుడే జీవి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఇంత చిన్న పిచ్చుక పర్యావరణాన్ని కాపాడటమేమిటి.. అంతరించిపోతే జీవరాశి మనుగడకు ప్రమాదమేమిటనే సంకోచాలకు ఈ దినోత్సవ అవగాహనతో నివృత్తి చేసుకుందాం. పిచ్చుకను రక్షించి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాం.


ప్రేమిద్దాం..
ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న పిచ్చుకలను ఎలా కాపాడుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2024లో ”ఐ లవ్‌ స్పారోస్‌’…’వి లవ్‌ స్పారోస్‌” అనే థీమ్‌తో పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న
కాలుష్యంపై అవగాహన కల్పించడమే
థీమ్‌ ప్రధాన లక్ష్యం.

టి. టాన్య
70958 58888

➡️