ఫుడ్‌ పాయిజన్‌ గుర్తించే ఇ నోస్‌..!

Dec 10,2023 12:13 #Sneha

ముక్కు ద్వారా వాసనను గ్రహించే సామర్థ్యం అద్భుతమైనది. ముక్కులో దాదాపు 400 సువాసన గ్రాహకాలు ఉంటాయి. ఇవి సుమారు లక్ష కోట్ల రకాల వాసనలను గుర్తించగలవని చెబుతుంటారు. ఒక పరికరంలో ఇంతటి స్థాయి ఇంద్రియ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా చేయడం చాలా కష్టమైన పనే. అయితే, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో ఇటీవల అధునాతన ఎలక్ట్రానిక్‌ ముక్కులను (ఈ-నోస్‌) అభివృద్ధి చేశారు.

ఈ ముక్కులోని హైటెక్‌ సెన్సర్లు, నిర్ధిష్ట వాసనను గుర్తించి, నివేదించగలవు. ఈ ఎలక్ట్రానిక్‌ ముక్కులో వాడే హైటెక్‌ సెన్సర్లు వేగం, కచ్చితత్వం విషయంలో మెరుగుదల ఉంది. ఆహారభద్రత విషయంలో ఇవి ఉపయోగపడతాయని వాటిని ప్రతిపాదించినవారు అంటున్నారు.

సాల్మోనెల్లా, ఈకోలీ అనేవి ఆహారపదార్థాల్లో ప్రాణాంతకంగా మారే బ్యాక్టీరియా రకాలు. ఈ రెండు రకాలకు తమదైన ఎలక్ట్రానిక్‌ స్వభావం ఉంటుందని ‘సెన్సిఫై’ అనే ఈ-నోస్‌ (ఎలక్ట్రానిక్‌ ముక్కు) పరికరం కో డెవలపర్‌, ఇజ్రాయెల్‌లోని బెన్‌ గురియాన్‌ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ రజ్‌ జెలినెక్‌ చెప్పారు. ఈ బ్యాక్టీరియాకు సొంత విద్యుత్‌ సిగల్‌ ఉంటుందని రజ్‌ తెలిపారు.

ఇజ్రాయెల్‌ కంపెనీ తయారుచేసిన ఈ-నోస్‌లలో కార్బన్‌ నానోపార్టికల్స్‌తో పూత పూసిన ఎలక్ట్రోడ్స్‌ ఉంటాయి. అవి బ్యాక్టీరియాల నుంచి వెలువడే వాసనలు, అస్థిర కర్బన సమ్మేళనాలను (వీఓసీ) పసిగడతాయి. బ్యాక్టీరియాలోని వివిధ జాతులు వేర్వేరు వీఓసీ జాడలను ఉత్పత్తి చేస్తాయి. సెన్సిఫై మెషీన్‌లో ఇవి విభిన్న విద్యుత్‌ సిగళ్లను సృష్టిస్తాయి. ఏఐ సాప్ట్‌వేర్‌ వ్యవస్థ వీటిని రికార్డు చేసి, డేటాబేస్‌లోని డేటాతో పోల్చి చూసి, వినియోగదారుకు తెలియజేస్తుంది. ‘సెన్సిఫై’ అనే ఈ-నోస్‌ను ఈ ఏడాది మొదట్లో ఆవిష్కరించారు. ఆహార పరిశ్రమలో ఇన్‌ఫెక్షన్లపై పోరాటాన్ని ఇది మార్చగలదని భావిస్తున్నారు.

  • గంటలోనే ఫలితాలు..

పరీక్ష కోసం ల్యాబోరేటరీకి పంపిన ఫుడ్‌ శాంపిల్స్‌ ఫలితాల రాక కోసం ఆహార ఉత్పత్తిదారులు రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుందని సెన్సిఫై పరికరం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మోదీ పీలెడ్‌ అన్నారు. దీనికి విరుద్ధంగా సెన్సిఫై ఈ-నోస్‌ పరికరాలను అక్కడికక్కడే ఉపయోగించి, గంటలోగా ఫలితాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే, సెన్సిఫై ఈ-నోస్‌ ధరను ఇంకా ప్రకటించలేదు. అయితే తక్కువ ధరకే లభిస్తాయని చెబుతున్నారు. ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుల ద్వారానే డబ్బు సంపాదించాలని ఈ సంస్థ భావిస్తోంది. ‘ఆహార పరిశ్రమలో పరీక్షా పద్ధతులు గత 40, 50 ఏళ్లుగా అవే ఉన్నాయి. ఆహార పరీక్షల రంగంలోకి ఏఐ నిజంగా ఇంకా ప్రవేశించలేదు’ అని పీలెడ్‌ అన్నారు.

  • ఆహార విషయంలో..

ప్రపంచవ్యాప్తంగా పుడ్‌ పాయిజనింగ్‌ తీవ్ర సమస్యగా ఉంది. అమెరికాలో ప్రతీ ఏడాది 4.8 కోట్ల మంది, అంటే ప్రతీ ఆరుగురిలో ఒకరు ఆహార సంబంధిత అనారోగ్యానికి గురవుతారు. వీరిలో 1.28 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. మూడు వేల మంది చనిపోయారు. యూకేలో ప్రతీ ఏడాది 24 లక్షల ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు ఉంటాయని, వారిలో 180 మంది చనిపోయినట్లు అంచనా. ‘ఫుడ్‌ పాయిజనింగ్‌కు మాంసం, పౌల్ట్రీ, చేపలను ప్రధాన కారణంగా ప్రజలు చెబుతుంటారు. కానీ, గత ఐదు, పదేళ్ల కాలంలో అమెరికా ఆహార పరిశ్రమలో అతిపెద్ద కిల్లర్‌ ఏంటంటే రొమైన్‌ లెట్యూస్‌ అనే ఒక రకమైన ఆకుకూర’ అని పీలెడ్‌ చెప్పారు.

  • కాఫీ ఈ-నోస్‌..

జర్మన్‌కు చెందిన ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్‌ అనే సంస్థ కాఫీ అనే ఈ-నోస్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ-నోస్‌లో వాడే ఏఐకి శిక్షణను ఇస్తోంది. ఒక పరీక్షలో ఏఐ సెన్సార్ల పక్కన కాఫీపొడిని ఉంచి, టెక్నీషియన్స్‌ మూడు రోజుల పాటు పరీక్షించారు. ఏఐ సెన్సార్లకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. వాటిలో మంచి కాఫీ, చెడు కాఫీ, అసలు కాఫీనే కాదు అనే ఆప్షన్లను చేర్చారు. వీటిల్లో నుంచి ఏఐ సెన్సార్లు ఒక ఆప్షన్‌ను గుర్తించాల్సి ఉంటుంది. ‘ఒకే వాయువు వల్ల వాసన రాదు. వాయువుల కలయిక వల్ల వాసన ఏర్పడుతుంది. ప్రతీ వాసనలో చిన్న చిన్న తేడాలు, వైరుధ్యాలు ఉంటాయి’ అని ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్‌ ఇన్నోవేషన్‌ మేనేజర్‌ అడ్రియాన్‌ కోజ్‌ చెప్పారు.

  • ముక్కు ఆకారంలో..

ఎన్‌టీటీ సంస్థ సెన్సార్లను ముక్కు ఆకారంలో తయారుచేసిన ఒక త్రీడీ ప్లాస్టిక్‌ నమూనాలో అమర్చారు. కాఫీతో ఇతర ఆహారపదార్థాలతో తమ ఏఐకి ఎన్‌టీటీ శిక్షణ ఇస్తోంది. తాజాగా, మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆహారపదార్థాల వాసన ఎలా ఉంటుంది? అనే అంశాన్ని పసిగట్టడంలో ఏఐకి వారు శిక్షణ ఇస్తున్నారు. దీన్ని ‘ఆడర్‌ రిఫరెన్స్‌ వాల్యూ’ గా పిలుస్తున్నారు. ఆహారపదార్థాల్లోని విషపూరితాలను గుర్తించడమే కాకుండా, అవి ఎంత తాజాగా ఉందనే విషయాన్ని కూడా గ్రహించే ఉద్దేశంతో ఈ-నోస్‌ను ఎన్‌టీటీ అభివృద్ధి చేస్తోంది. గడువు తేదీ ప్రచురితమై ఉండని ఆహార పదార్థాల్లో దేన్ని ముందుగా విక్రయించాలనే అంశంలో సూపర్‌ మార్కెట్లకు, కేఫ్‌లకు ఈ పరికరం సహాయపడనుంది. ‘ఆహారపదార్థాల వాసన రిఫరెన్స్‌ వాల్యూ తెలుసుకోవడం ద్వారా తదనుగుణంగా ఉత్పత్తి, నిల్వ, సాగు, ప్రాసెసింగ్‌ విషయాల్లో ఆహార పరిశ్రమ చర్యలు తీసుకోవచ్చు’ అని అడ్రియాన్‌ తెలిపారు.

  • ఖర్చు వల్లే..

ఈ-నోస్‌ బాగా పనిచేస్తున్నప్పటికీ, ఖర్చు దృష్ట్యా ఆహార పరిశ్రమలు వాటి పట్ల ఆసక్తి చూపకపోవడంతో వాటికి తగిన డిమాండ్‌ ఏర్పడే అవకాశం లేదని కొందరు ఏఐ నిపుణులు అంటున్నారు. బిజినెస్‌ మోడల్‌ను ఈ-నోస్‌ పరికరాలు ఎంతగా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అమెరికాకు చెందిన ఏఐ రీసెర్చ్‌ సంస్థ ఇన్‌హరిటెన్స్‌ ఏఐ వ్యవస్థాపకుడు, చీఫ్‌ డిజైనర్‌ విన్సెంట్‌ పీటర్స్‌ చెప్పారు. ఆహారపదార్థాల్లోని ప్రతీ రకం కోసం ఈ-నోస్‌లను ఇంకా ఫైన్‌ ట్యూనింగ్‌ చేయాల్సిన అవసరం ఉందని శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన డొమినో డేటా ల్యాబ్‌ ఏఐ నిపుణుడు నెల్‌ కార్లిసన్‌ అన్నారు.

  • కుక్క ముక్కు కన్నా ఎక్కువే..

అయితే, ఇది కొంతమంది పారిశ్రామికవేత్తలను నిరుత్సాహపరచడం లేదు. బయోసెన్సర్ల అభివద్ధి కోసం కీటకాల యాంటెన్నాలను కాపీ చేసినట్లు న్యూజీలాండ్‌లోని సెంటియాన్‌ బయో అనే కంపెనీ చెప్పింది. ఇది కీటకాల ప్రొటీన్ల ప్రతిరూపాలను చేసి, వాటిని సెంట్‌ సెన్సర్లలో అమర్చింది. ఈ బయోటెక్నాలజీ వల్ల కుక్క ముక్కు కంటే వేల రెట్ల ఎక్కువ సున్నితంగా తమ సెన్సర్లు పని చేస్తాయని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఆండ్రూ క్రాలిక్‌ చెప్పారు. ఈ బయోసెన్సర్లను ఆహారం, ఫ్లేవర్‌ క్వాలిటీ కంట్రోల్‌, ఆహారంలో వ్యాధికారకాల గుర్తింపు, సుస్థిర వ్యవసాయం, పర్యావరణంలో ఉపయోగించవచ్చని చెప్పారు.

➡️