ఆశల పల్లకి

Mar 31,2024 08:31 #Sneha, #Stories

‘మనం డబ్బు పంపిస్తుంటే ఇండియాలో మన తల్లిదండ్రులకు ఎలాంటి లోటు లేకుండా జరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు!’ అని ఎవరో దూరంగా అంటున్న మాటలు సురేష్‌ చెవిన పడ్డాయి. ఆ మాటలు సురేష్‌ని ఆలోచింపజేశాయి. ‘నేను కూడా ఇంటికి డబ్బు పంపిస్తూ ఈ అమెరికాలోనే స్థిరపడితే?’ అనుకున్నాడు. ఆ రోజు రాత్రి సురేష్‌ ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు కాల్‌ చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడారు. సురేష్‌కి వారి మాటలలో ఏదో వెలితి కొట్టొచ్చినట్లు కనిపించి, ఆలోచిస్తుండగా చాలాసేపటికి గాని నిద్ర పట్టలేదు. తల్లి పిలుపులా తోచి నిద్ర నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. త్వరలో ఇండియా వెళ్ళి తల్లిదండ్రులను చూడాలని అనుకున్నాడు. తను వస్తున్న విషయం తెలియకుండా తల్లిదండ్రులను సర్ప్రైజ్‌ చేయాలి అనుకున్నాడు. ఇండియా వచ్చిన తర్వాత సురేష్‌ తల్లిదండ్రులను కలవడానికి పట్నంలోని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఇరుగు పొరుగు వారిని విచారిస్తే తెలియదు అనే సమాధానం వచ్చింది. ఫోన్‌ చేస్తే తీయడం లేదు ఏమైందా? అని ఆందోళనపడసాగాడు. పుట్టి, పెరిగిన ఊరికి బయలుదేరాడు సురేష్‌. దారిలో తల్లీతండ్రీ తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారో?! ఏం జరిగి ఉంటుందో?!. అని ఆందోళన పడుతూ పట్నవాసులంతా ఇంతేనా? ఎవరి గురించి పట్టించుకోరా? అని అనేకానేక ప్రశ్నలు మెదడును తొలుస్తుండగా తన సొంత ఊరుకి చేరుకున్నాడు. ఊరిలో వారంతా తనని చూసి కుశల ప్రశ్నలతో చేరువయ్యారు. వారి మాటలలో అమ్మానాన్నలు అక్కడే ఉన్నట్లు తెలుసుకొన్నాక సురేష్‌కి ధైర్యం వచ్చింది. ఇంటికి వెళ్ళి దిగులుగా పడుకున్న తల్లిని చూసి అనారోగ్యంతో బాధపడుతోందని గ్రహించాడు సురేష్‌. కొడుకుని చూసిన తల్లి ఉద్వేగంతో పొంగుకొస్తున్న దుఃఖాన్ని కొంగుతో తుడుచుకుంటూ ‘ఎలా ఉన్నావ్‌ రా? ఏంటి నాన్న ఇలా చిక్కిపోయావ్‌?’, అంటూ ముఖాన్ని తడుముతూ, ‘ఎప్పుడు తిన్నావో ఏంటో? కాళ్ళు కడుక్కురా నీకిష్టమైన పప్పుచారు, వడియాలు చేస్తాను. అన్నం తిందువుగాని..’ అంటూ ‘అక్కడంతా బాగానే ఉందా?’ అనే తల్లి మాట పూర్తి కాకుండానే ‘అక్కడంతా బాగానే ఉందికానీ మీరేంటీ పట్నం వదిలేసి, ఇక్కడ ఉంటున్నారు? ఏమైంది అమ్మా? నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు?’ అని సురేష్‌ బాధపడ్డాడు.
ఆ మాటలకు ‘నేను బాగున్నానురా నాన్నా!’ అంది తల్లి జానకమ్మ. ఇంతలో ఒంటి నిండా బురదతో పొలం నుండి ఇంటికి వస్తున్న తండ్రి ముఖం దిగాలుగా ఉండటం గమనించాడు సురేష్‌. పరుగున తండ్రిని చేరుకుని కాళ్ళకు నీళ్ళు ఇచ్చి, తుడుచుకోడానికి తుండు ఇస్తూ ‘ఏంటి నాన్న అమ్మకు ఆరోగ్యం బాగాలేదా? నువ్వు ఎలా ఉన్నావు? మీరు పట్నం వదిలి, ఈ పల్లెటూరికి మళ్ళీ ఎందుకు వచ్చారు? ఈ బురదేంటీ?’ అంటూ తండ్రిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. జగన్నాథం ఒక నిట్టూర్పు విడిచి, పట్నంలో పలకరించేవాళ్ళు లేక, మాట్లాడే టైము లేని మనుషుల మధ్య ఉండలేక వచ్చేశాము. ఇక బురద అంటావా చిన్నప్పటి నుండి ఈ మట్టినే నమ్ముకున్న వాడిని. అలవాటుపడిన పని కాబట్టి ఇబ్బంది లేదు. తిరుగు ప్రయాణం ఎప్పుడు?’ అని అడిగాడు జగన్నాథం.
‘ఒక వారం తర్వాత వెళ్తా’నని చెప్పాడు సురేష్‌. కనీసం ఓ వారం కొడుకు తమతో ఉంటాడనే మాట వినగానే నీరసంగా ఉన్న తల్లికి ఓపిక వచ్చింది. దిగులుగా ఉన్న తండ్రికి ఉత్సాహం వచ్చింది. కొడుకుతో కలిసి వారం రోజులు సరదాగా గడిపారు. సురేష్‌ అమెరికా వెళ్ళేరోజు రానే వచ్చింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న తల్లి మనస్సు తల్లడిల్లింది. తన బాధని గొంతులో దిగమింగి, కొడుకు తిరుగు ప్రయాణం ఏర్పాట్లను చూస్తూ గంభీరంగా ఉన్నాడు జగన్నాథం.
తల్లిదండ్రుల ముఖాల్లో దిగులును చూసిన సురేష్‌ ఏదో ఆలోచించినట్లుగా తల పంకించి, ‘మీరూ నాతో రండి!’ అంటూ సురేష్‌ తల్లిదండ్రులను కూడా తనతోపాటు ప్రయాణానికి సిద్ధపరిచాడు. జగన్నాథం ఇంకా జానకమ్మ ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ బంధువులందరితో ‘మేము మా కొడుకుతోనే ఉండటానికి వెళుతున్నాము’ అని ఎంతో ఆనందంగా చెప్పుకున్నారు. కారులో పట్నానికి చేరుకున్నారు. కారు ఒక పెద్ద బిల్డింగ్‌ ముందు ఆగింది. సురేష్‌ తన తల్లిదండ్రులను అక్కడే ఉండమని కొన్ని కాగితాలు పట్టుకొని లోపలికి నడిచాడు. ‘ఏమండీ! అబ్బాయి ఎందుకు అంత హడావిడిగా తిరుగుతున్నాడు?’ అని జానకమ్మ తన భర్తను అడిగింది. ‘ఒసేరు వెర్రి మాలోకం. కొడుకుతో అమెరికా వెళ్ళబోతున్నాను అనే ఆనందంలో నీకు ఏమీ అర్థంకావడం లేదు. అయినా ఊరికే వెళ్ళడానికి అదేమన్నా మన అమలాపురం అనుకుంటున్నావా? అమెరికా. వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి!’ అంటూ మీసం మెలేస్తూ అన్నాడు జగన్నాథం.
కొంచెం సేపటికి సురేష్‌ కారులోని సామాన్లు దించుతూ ఇక్కడ మీకు ఏ ఇబ్బందీ ఉండదు, సమయానికి అన్నీ మీ వద్దకు వస్తాయి. అందరూ ఉంటారు. మీకు చక్కటి కాలక్షేపం దొరుకుతుంది!’ అని తల్లిదండ్రులతో అన్నాడు సురేష్‌. అది ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఒక ఫ్యామిలి రీ క్రియేషన్‌ సంస్థ. ఇక్కడ ఉంచటం వలన తన తల్లిదండ్రులకు ఒంటరితనం అనే బాధ దూరమవుతుందని అనుకున్నాడు సురేష్‌. ఏం జరుగుతుందో అర్థంకాక, తల్లిదండ్రులు ఇద్దరూ ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఒకరినొకరు చూసుకుంటూ కొయ్యబారిపోయారు.
‘నేను బయలుదేరుతాను నాకు ఫ్లైట్‌ టైం అవుతుంది!’ అంటూ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోడానికి కాళ్ళను పట్టుకున్న తనయుని వేళ్ళ స్పర్శతో ఉలిక్కిపడ్డారు. సురేష్‌ను తమ చేతులతో పైకి లేపుతూ ‘చిరంజీవిగా ఉండు నాన్నా!’ అంటూ గుండెలకు హత్తుకున్నారు. కన్నతల్లిని, జన్మభూమిని వదలి, తల్లిదండ్రులు చూపిన ఆశల అమెరికాకి సురేష్‌ పయనమయ్యాడు.
రెక్కలొచ్చిన పక్షిపిల్లలు గూడు విడిచినట్లు, నడక నేర్చిన బిడ్డ వేలువిడిచిన తీరు తలచుకుంటూ వెనక్కి తిరగకుండా వెళుతున్న కొడుకు.. వెనక్కి రాడేమోనని తలచి, జానకమ్మ ముఖంలోని కన్నీటి తెరను తన చూపులతో తడిమి, భుజం మీద చెయ్యి వేశాడు జగన్నాథం. జానకమ్మ జగన్నాథం గుండెను చేరి, తన గుండె బరువును పంచుకుంటున్నట్లుగా భర్త ఎదపై వాలింది. పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ జాలితో కూడిన చూపులు తమను లోపలికి ఆహ్వానిస్తుండగా తమలాంటి ఎంతోమంది తల్లిదండ్రుల బ్రతుకు అస్తమయాన్ని తలచుకుంటూ జగన్నాథం దంపతులు లోపలికి నడిచారు.
సురేష్‌ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాడు. ఫ్లయిట్‌ ఆలస్యం కావడంతో లాంజ్‌లో వెయిట్‌ చేస్తున్నాడు. తను చేసిన తప్పునీ, ఈ తప్పుకు తల్లడిల్లుతూ తల్లిదండ్రులు తన కోసం పడిన కష్టాన్ని, చేసిన త్యాగాలను తలుచుకుంటూ, గడిచిన కాలాన్ని నెమరువేసుకున్నాడు.
************************************************
సురేష్‌ తండ్రి జగన్నాథం ఒక మారుమూల పల్లెటూరులో సన్నకారు రైతు కుటుంబానికి చెందినవాడు. అతని భార్య జానకమ్మ. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు సురేష్‌. సురేష్‌ తన సెలవు రోజుల్లో నాన్నతో కలిసి పొలానికి వెళ్తూ వుండేవాడు. జానకమ్మ ఇంటి వద్దనే ఉంటూ పశు పోషణ చేస్తూ ఉండేది. ఒకరోజు సురేష్‌ తండ్రితో కలిసి పొలానికి బయలుదేరాడు. ఆకాశంలో సూర్యుడు చుర్రుమంటున్నాడు. ఎండ విపరీతంగా ఉండడం వలన సురేష్‌కి కళ్ళు తిరిగి, స్పృహ కోల్పోయాడు. చుట్టూ ఉన్న వారంతా పరుగున అక్కడికి చేరుకున్నారు. జగన్నాథం కొడుకు ముఖంపై నీళ్ళు చల్లి, తనని చెట్టు నీడలోనే కూర్చోపెట్టాడు. ఈ సంఘటన జగన్నాథాన్ని కృంగదీసింది. ఒక్కాగానొక్క కొడుకుని పొలం పనులకు దూరంగా ఉంచాలని, కష్టపెట్టకూడదని తలచి ఆ రోజు నుంచి సురేష్‌ని వ్యవసాయ పనులకు దూరంగా ఉంచి, బాగా చదివించి, గొప్ప ఉద్యోగస్తుడిగా చూడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. సురేష్‌ పదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యాడు.
జగన్నాథం దంపతులు సురేష్‌ కాలేజీ చదువుల కోసం పట్నం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పట్నం పోకడ వేరు, ఖర్చు ఎక్కువ, మానవ సంబంధాలకు విలువుండదు. వద్దు అని ఇరుగు పొరుగువారు, బంధువులు ఎంత చెప్పినా జగన్నాథం వినలేదు.
జగన్నాథం తనకున్న ఎకరం పొలాన్ని వేరొకరికి కౌలుకి ఇచ్చేసి, పాడి పశువులతో సహా కుటుంబంతో కలసి పట్నం బయలుదేరాడు. ప్రైవేటు కాలేజీలో చదువులు అంటే ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి జగన్నాథం దంపతులు తమతో పాటు తెచ్చుకున్న పాడి గేదెల పోషణ చేస్తూ ఇల్లిల్లూ తిరిగి, పాలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. సురేష్‌ కూడా చాలా శ్రద్ధగా చదువుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత సురేష్‌ ఇంటర్మీడియట్‌ పాసై, ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకున్నాడు. జగన్నాథం సురేష్‌ను పేరున్న మంచి ఇంజనీరింగ్‌ కళాశాలలో చేర్పించాడు. ఇంజనీరింగ్‌ విద్య నాల్గవ సంవత్సరంలో ఉన్నప్పుడే సురేష్‌ ప్రతిభను గుర్తించి సాఫ్ట్వేర్‌ కంపెనీ వాళ్ళు తనకు క్యాంపస్‌ సెలక్షన్‌లో సంవత్సరానికి పది లక్షల వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశం ఇచ్చారు. సురేష్‌ విద్యను పూర్తిచేసుకుని, వెంటనే ఉద్యోగంలో చేరాడు. సురేష్‌కి మంచి జీతం, తృప్తిగా జీవితం గడుస్తోంది. కూడబెట్టిన డబ్బుతో ఉన్న అప్పులను తీర్చేసి, వాయిదాల పద్ధతిలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు కొన్నాడు.
సురేష్‌ జీవితం ఎంతో ఆనందంగా గడుస్తున్నా, ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్లి, అక్కడ ఉద్యోగం చేస్తూ కోట్లు గడిస్తున్నారని, వాళ్లకి మంచి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయని, అక్కడ ఉద్యోగం చేసేవారికి గౌరవం కూడా ఎక్కువని ఆనోటా ఈనోటా విని జగన్నాథం, జానకమ్మలు ఆర్థికంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులు సురేష్‌ పడకూడదని సురేష్‌కి అన్నివిధాల నచ్చజెప్ప చూశారు. సురేష్‌ దానికి ససేమిరా అన్నాడు. ‘అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా!’ అని అన్నాడు. తల్లిదండ్రులు బ్రతిమిలాడటంతో సురేష్‌కి ఒప్పుకోక తప్పింది కాదు. విదేశాలలో విద్య అంటే ఎన్నో వ్యయప్రయాసలతో కూడినది. సురేష్‌ తను సంపాదించిన డబ్బు కొంచెం, తండ్రి అప్పుగా తెచ్చిన కొంతమొత్తం కలిపి విదేశీ చదువుకు డబ్బు సమకూరింది. తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ సురేష్‌ దిగాలుగా ఉన్నాడు. జగన్నాథం, జానకమ్మ మనస్సులూ గుబులుగా ఉన్నా.. దానిని ముఖంలో కనబడనివ్వకుండా సంతోషంతో సురేష్‌ని విదేశాలకు పంపించారు.
సురేష్‌ ప్రతిరోజూ తల్లిదండ్రులకు వీడియో కాల్‌ చేసి, మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకునేవాడు. రెండు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి, తన ఎం.ఎస్‌ని పూర్తిచేశాడు సురేష్‌.
ఆ సమయంలో ఆర్థికమాంద్యం వల్ల సురేష్‌కి ఉద్యోగం రాలేదు. చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఉన్నవారు కూడా విధిలేక తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. చాలా మంది ఉద్యోగాలు రాక తమ ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడలేక పెట్రోల్‌ బంకులలో, హోటళ్ళలో, డే కేర్‌ సెంటర్లలో, పబ్బులలో పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. విద్యార్థులు ఉద్యోగం లేక, పరువు కోసం సొంత ఊరు వెళ్ళలేక అక్కడ ఎన్ని అగచాట్లు పడుతున్నారో తల్లిదండ్రులకు తెలియదు. సురేష్‌దీ అదే పరిస్ధితి. ఏ ఉద్యోగం లేకా, పబ్బులో పనిచేస్తూ సంపాదించిన దానిలో కొద్దిమొత్తాన్ని ఇంటికి పంపుతున్నాననే విషయం చెప్పి.. ‘తల్లిదండ్రులుగా మీరు నా మీద పెట్టుకున్న ఆశలు నీరు కారిపోనివ్వలేను!’ అని పశ్చాత్తాపంతో కుమిలిపోతుండగా…
‘ఫ్లైట్‌ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది’ అని అనౌన్స్‌మెంట్‌ వినపడగానే ఈ లోకంలోకి వచ్చాడు.
చుట్టూ చూడగా ప్రయాణీకులు వేగంగా ఫ్లైట్‌ వైపు వెళ్ళడం గమనించాడు.
ఆకాశంలో కారుమేఘాలు కమ్మినట్లు, కళ్ళలో కన్నీటి సుడులు కమ్మి, వెనుతిరిగి చూస్తే ముంచుకొచ్చే దుఃఖపు పెనుతుపాన్‌లో తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలు కొట్టుకుపోతాయేమో అని, ఆ పెను తుపాన్‌ను కనురెప్పల లోపల దాచి, రిక్రియేషన్‌ సెంటర్‌ దగ్గర వెనక్కి తిరిగి తల్లిదండ్రుల వైపు చూడలేని, వాళ్ళను తనతో పాటు తీసుకెళ్ళలేని నిస్సహాయ స్థితిని తలచుకుంటూ.. తాను చేసిన పనికి తల్లిదండ్రులకు కన్నీటితో మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటూ ఫ్లైట్‌ ఎక్కాడు సురేష్‌. సుదూర తీరాల ఆశల సౌధాన్ని చేరడానికి ప్రేమానుబంధాలను తెంచుకుంటున్నట్లుగా సురేష్‌ లాంటి మరెంతోమంది కన్నీటిగాథలను మోసుకుంటూ.. విమానం మబ్బులను చీల్చుకుంటూ ముందుకు రయ్యిన దూసుకుపోయింది.

– ధూళిపాళ్ళ మాధవికిషోర్‌, 99497 35253

➡️