ఆరగడుల నేల

Feb 25,2024 13:10 #katha, #Sneha

వెళ్తూ వెళ్తూ చివరి చూపుగా చూశాను, బిచ్చం ఎత్తుకుంటున్న ఆ మనిషిని. అతన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇతనేంటి ఇలాంటి స్థలంలో అడుక్కుంటున్నాడని, వెళ్లి మాట్లాడాలనుకున్నాను. నలుగురి భుజాలపై ఉన్నాను. నేను రాసిన కవితలనే నాపై చల్లుతున్నారు. కొత్త కొత్త మాటలు అల్లుతున్నారు. నేను రాసిన పుస్తకాలే మననం చేసుకుంటున్నారు. కొరివి పెట్టడానికి కొడుకులు లేరు కానీ, ఎంతో మంది నా శిష్యులను సంపాదించాను. అందుకే ఇప్పుడు వారి భుజాల మీద ఊరేగుతున్నాను. యువకవులు, నవకవులు, మిత్రులు, కళాకారులు డప్పుల దరువులు వేస్తూ, పాటల మూటలు కుమ్మరిస్తున్నారు. ఒక కవికి ఇంతకంటే ఇంకేమి కావాలి. ఈ గందరగోళంలో ఆ బిచ్చపతితో మాట్లాడే అవకాశం లేదు. నన్ను దించినా నడుచుకుంటూ వెళ్లలేను, ఇక్కడే ఉంటాడు కాబట్టి తరువాత మాట్లాడవచ్చు అనుకున్నాను. అందరూ ఏడుస్తూ, బాధ పడుతూ, పాటలు పాడుతూ నన్ను సాగనంపుతున్నారు. వీళ్ళందరికీ వేరులా ఉండి వేరయ్యాను. గులాబీ రెమ్మలు ఒక్కొక్కటి రాలుతున్నాయి. పూల మాలలు మెడను కౌగిలించుకుంటున్నాయి. ఈ తంతును చూసి కరుణశ్రీ నవ్వుకుంటున్నాడు. ఎంత వద్దన్నా వినరే. ఆరడుగుల నేలలో నన్ను పడుకోబెట్టారు. చివరిసారిగా చూసుకోవడం కోసం అందరూ ఎగబాకుతున్నారు. ఒకరి వెనక ఒకరు చూసుకుని వెనకకు జరిగి, కొత్తవాళ్ళకు దారి ఇస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. సెల్ఫీ దిగుతున్నారు. పిడికెడు చక్కెర చల్లారు. చుట్టూరా కొవ్వొత్తులు వెలిగించారు. అవి కరిగిపోయి భూమిలో ఏకమవుతున్నాయి. భూమిపై ఉన్న ఏదైనా చివరికి మట్టిలో కలవాల్సిందే కదా! అనుకున్నాను, నన్నెంతగానో ఇష్టపడి, ప్రేమించే శిష్యుడు నాకు తోడుగా ఉంటాడని అనుకున్నాను. నన్ను ఒంటరివాణ్ణి చేసి, ఈ సమాజం నుంచి స్మశానానికి అప్పగించారు.

ఎవరు లేని ఏకాంతంలో మెలకువ వచ్చింది. దూరంలో కొంత మంది కలిసి జోహార్లు చెబుతూ, పూలమాలలు వేసి చప్పట్లు కొడుతున్నారు. వచ్చిపోయేవారి వైపు ఆశగా చూసి, ఆ బిచ్చగాడు అడుక్కుంటున్నాడు. ఎవరూ అతన్ని గమనించడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. మెల్లగా అటు వైపు వెళ్ళాను. నా వైపు దీనంగా బిచ్చం వేయమంటూ చూశాడు. నా జేబులు తడిమి చూసుకున్నాను. ఏమీ లేదు. నేను సంపాదించినదంతా ఎక్కడో పడిపోయింది. ఎప్పుడో పడిపోయింది. నాతో రాలేదు.

‘నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. పోనీ ఒక కవిత చెప్పనా’ అన్నాను.

‘పోయ్యా పో! నీ కవిత ఎరికి కావాలే. ఉంటే పైసలు ఇయ్యి లేకుంటే లే. నీ కవితను నేనేం జేస్కోవాలే. దానితో నా కడుపు నిండదు. నాకు పైసలు ఉంటే ఇయ్యి అంతే’.

‘మరి డబ్బులు నువ్వేం చేసుకుంటావ్‌?’

‘హా! జాగా కొనాలా’.

‘నీకు తెలుసా నేను పెద్ద కవినీ, నీ పేరేమిటి?’ అని అడిగాను.

‘నీవు పెద్ద కవి అయితే నేనేం జేయాలే. ఒక్క రూపాయి ఇచ్చి, పుణ్యం గట్టుకో’.

‘ఇక్కడ నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎక్కడుంటావ్‌?’ అని అడిగాను.

‘సారూ నన్ను ఇసిగించకండి, అచ్చిపోయేవాళ్ళు నన్ను సూసి నవ్వుతుండ్రు’ అంటూ తలతిప్పుకుని పక్కకు జరిగాడు. సమాజంలో చేయి తడపనిదే ఏ పనీకాదని తెలుసు కానీ, ఇక్కడ కూడా ఇలా ఉంటుందా! అని ప్రశ్నించుకున్నాను.

ఎక్కడో స్మశానం మూలలో పిండిపదానం చేస్తున్నారు. ఘుమఘుమలు తటాలున ముక్కు పుటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బతికున్నప్పుడు ముద్దపెట్టడానికి అడ్డగించే వీళ్ళు, చనిపోయాక కాకులకు పెట్టి పిలుస్తున్నారు. పక్షులకు పెట్టే బదులు అడుక్కుంటున్న వాడికి పిడికెడు పెట్టవచ్చు కదా! అని తిట్టుకున్నాను. చీకటి నలుమూలల నుండి నల్లటి గొంగళి అల్లుకుంటూ వస్తున్నది. ఆ బిచ్చగాడు మూలుగుతూ వినిపించాడు. ఏమైందని చూస్తే ‘ఆకలి, ఆకలి’ అంటున్నాడు.

‘నిన్న మాట్లాడితే సరిగ్గా మాట్లాడలేదు. డబ్బులు ఇవ్వమని చెప్పాడు. అచ్చం డబ్బు మనిషి, ఆ డబ్బునే తినవచ్చు కదా’ అని కసురుకున్నాను.

‘పాపం వాడి పరిస్థితి ఏమిటో!’ మళ్ళీ తెలుసుకోవాలనిపించింది. ఆ పిండాకూడును తీసుకుని వెళ్ళాను. ‘నాయన తిను’ అని చెప్పాను.

లేస్తూనే సాష్టాంగ నమస్కారాలు పెట్టి, అన్నం అందుకున్నాడు. చేతినిండా ముద్ద పట్టుకుని నోట్లో కుక్కుకుంటున్నాడు. ఇంతకు ముందు ఎంతమంది ఇతని నోటికాడి కూడు లాక్కున్నారో! అన్నం మింగగానే -ఒక్కసారిగా అతని కళ్ళలో నీళ్ళు ఉబికి వస్తున్నాయి. మెల్లగా మెల్లగా అంటూనే ‘నీ పేరు ఏమిటి? ఎక్కడ ఉంటావ్‌?’ అని అడిగాను. అన్నం తెచ్చినందుకు ఇవ్వన్నీ చెప్పాలా అన్నట్టు చూశాడు. తరువాత మొదలుపెట్టాడు.

‘సారూ నా పేరు బాబు’.

‘ఏం బాబు నీకు ఎవరు లేరా, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావ్‌?’ అని అడిగాను.

‘నీవు కవి అని సెబుతున్నావ్‌ కదా నా సంగతి సెబుతా. నా గురించి కత రాయి’ అని చెప్పాడు.

నేను కళ్లు పెద్దవి చేసి, నొసలు పైకి అని సరేనంటూ తల ఊపాను.

‘సారూ నేను గత మూడేళ్ళుగా ఉంటున్నాను’.

‘నువ్వు ఎక్కడుంటావ్‌?’ అని అడిగాను.

‘పక్కన అచ్చి కూకోండి సారూ నా కత సెబుతా. నా సిన్నప్పుడే మా అవ్వ, అయ్య ఈ వూరికి అచ్చిండ్రు. మాది గౌర్దొడ్డి, నా పెళ్ళి చేసి మా అవ్వ అయ్యా ప్రమాదంలో సచ్చిపోయిండ్రు. నా పెండ్లంలోనే మా అవ్వ అయ్యల్ను సూస్కున్నాను. షాజాన్‌ లా తాజ్మాలు కట్టలేదు గానీ, నా ఆస్తి పాస్తిని ఆమె పేరునా రాయించినా, నాకు ఇద్దరు కొడుకులు. వారు సిన్నప్పటి సంది కొట్లాడుతూనే ఉండిరి. పెద్దైయ్యాకా మానుతారంటే ఇంకా ఎక్కువగా గొడవపడబట్టిరి. వీరు ఇలా మాట ఇనరని ఇద్దరికి పెళ్లి సేసేసినా. అచ్చిన కోడళ్లు, నా కొడుకులకు ఏ మందు బెట్టిండ్రో గానీ, ఇద్దరు మంచిగా కలిసిపోయిండ్రు. అంతలోనే నా పెండ్లం చక్కెర రోగంతో మంచానపడి ఒక సాయంత్రం నన్ను ఒంటర్ని సేసిపోయింది. ఆస్తులన్నీ నా కొడుకులు వారి పేరు మీద రాయించుకున్నరు. నన్ను బయటకి నెట్టిండ్రు. రెండు, మూడు పార్లు తిరిగి ఇంటికి పోయినా తన్ని తరిమేసిండ్రు. కోడళ్ళు తమాషా చూసిండ్రు. ఆ ఇంటి, ఈ ఇంటి వాళ్ళు నా కొడుకులకు నచ్చజెప్పినా ఇనలే. ఆమె లేని ఇంటిలో ఉండనని, గుడి మెట్లపైన సేరినా, అక్కడ బిచ్చగాళ్ల సంఘం నన్ను ఒప్పలేదు, నెట్టేసిండ్రు. ఇది మా అడ్డా అని తరిమేసిండ్రు. ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి ఉంటుంది గదా అని ఇదిగో గీడసేరిన. గందరగోళమైన గీ పట్నంలా ఇక్కడే నాకు ప్రశాంతంగా అన్పించింది. అంతట్లో కరోన అని ఏదో రోగం అచ్చింది. ఇగ ఇక్కడి నుంచి యాడికి పోలే, సచ్చినోళ్ళ ఈడకు తీసుకు అచ్చి, వాళ్ళ సమాధి కాడా ఒక గిలాస, పళ్లెం, ఇంత బియ్యం పడేసిపోతరు. సచ్చినోడు తింటడా ఏంది? తీస్కోని నేనే అండుకుంటున్నా, ఇంత తింటున్న గిదంతా కదూ సారూ గింత డబ్బులు సంపాదించి, జానేడు జాగా కొనాలని అనుకుంటున్న సారూ..’

‘ఇప్పటివరకు ఎంత పోగు చేశావు?’.

‘పదేలు వరకూ సారు’.

‘ఆ పది వేలతో ఎంత భూమికొంటావ్‌?’

‘అరడుగుల నేల సారూ!’

వినగానే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఒళ్ళు గగుర్పొడిచింది. స్థలం ఏమిటీ, ఆరడుగులేమిటి అని విస్తుపోయాను. నా సమాధి తవ్వడానికి 10,000, పెట్టెలో వేయడానికి 5,000, వ్యాన్లో తేవడానికి 3,000 నా కూతుర్లు మాట్లాడుకుంటుంటే విన్నాను, చనిపోయిన నా విలువ ఏమాత్రం తగ్గలేదు. డబ్బులు ఉంటేనే ఇలా, మరీ లేనివారి పరిస్థితి ఎలానో? అతని వైపు ప్రశ్నగా చూసాను.

‘గీ పట్నంలా సచ్చిపోవాలంటే పైసలు ఉండాలే సారూ గీ పైసలు లేకుంటే మనకు ఇలువ ఉండదు. సచ్చిపోయిన ఎవరు పట్టించుకోరు. మనం కాలే వరకు అంతా పైసలే సారూ!’

‘నీకు కొరివి పెట్టడానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా బాబూ!’

‘కొరివి దయ్యంలా పీక్కుతినేటోళ్ళ నా కొడుకులు’

ఈ దేశంలో కూడు, గూడు, గుడ్డతో పాటు సమాధి కోసం కొంత స్థలం కావాలని దీర్ఘాలోచనలో పడ్డాను.

కొడుకులు ఉండి, వాడు ఈ ఆరడుగుల నేలనే కొనుక్కుంటున్నాడు. కోరుకుంటు న్నాడు. ఇద్దరు కూతుర్లు. ఉన్న నేను ఇదే ఆరడుగుల నేలలో నివాసం ఏర్పరుచున్నాను. ఇద్దరు కూతుర్లను అత్తవారింటికి సాగనంపాను. వారిచేత మర్యాద పూర్వకంగా ఈ స్మశానానికి సాగనంపబడ్డాను. ఇక నా కవితల అత్తరు చల్లి, ఆలోచనల పాతర పెట్టి, ఒక్కొక్కరికి నిద్ర లేపుతాను. భుజాలపై ఎత్తుకుని పెంచిన కొడుకులు, రెండు గజాల భూమి తల్లిదండ్రులకు ఇవ్వాలని మళ్ళీ ఉద్యమానికి పిలుపునిస్తాను. ముసలి గొంతుకకు ఊతమిస్తాను.

బట్టు విజయ్

9505520097

➡️