పాడుబడ్డ డబ్బా!

Jun 30,2024 10:40 #Sneha

నాన్నకు దేనికో విసుగు, అది చూసి అమ్మకు కోపం, ఊరికే అలా అన్నిటికీ విసుగెందుకు అని, అవి చూసి నాకూ చికాకు. నన్ను చూసి నాన్నకు కోపం, మళ్లీ అమ్మ చిరాకు, ఇలా అవి ఒకరినుంచొకరికి మాతో వంతులేసుకుంటున్నాయి. సరదాగా ఉందేమో మరి వాటికి. ఈ నెవరెండింగ్‌ సైకిల్‌ మాకు లక్షా తొంభై సమస్యలను ఊరికే కొని తెచ్చిపెట్టింది. ఆ సైకిల్‌ను ఉన్నట్టుండి చెదిరిపోయేలా చేసేసి, నేను వచ్చేశా అంటూ కిర్‌ కిర్‌ మనే శబ్దం చేసి, అక్కడ మొదలు పెట్టింది మాటలు, పాటలు, తన గొంతెత్తి.
అయ్యబాబోరు మాకీ చికాకులు, విసుగులే కావాలి, అవి తెచ్చుకోవడం మాకు భలే తేలిక అంటే వినలేదు.
ఒక్కసారి అలవాటు పడితే, నన్ను భలే ఆస్వాదిస్తారు కంగారు పడొద్దు అని చెప్పింది. మనం పేరులు పెట్టుకున్నాం కదా, గుడ్‌ డే, బ్యాడ్‌ డే అని, అలా మనం బ్యాడ్‌ డేగా కుదుర్చేసుకున్న ప్రతీ బ్యాడ్‌ డే కి, ఒక గుడ్‌ ఎండింగ్‌ ఉండాల్సిందేగా అన్నట్టు వచ్చింది ఆ కీచు గొంతు. మొదట కీచుగానే ఉన్నా, నెమ్మదిగా నా కూసంత సహాయంతో మెరుగుపడుతూ వచ్చిందిలే, పర్వాలేదు.
మళ్లీ ఆ గొంతులో ఎన్నో రకాల రంగులూ, రుచులు. కాకపోతే చిక్కేమిటంటే, నీకు నచ్చిన రుచి ఎంచుకునే అవకాశం నీకుండదు. నువ్వెంచుకున్నప్పుడు వచ్చిన రుచి కన్నా, ఊహించనప్పుడు అది నీకు దక్కితే ఆ ఆనందమే వేరు కదా, కాబట్టి ఈ చిక్కు ఓ తెలియని ఆసక్తి, ఆనందంతో తయారయ్యినది అన్నమాట. ఏవిటోగానీ, భలే చిక్కులే.
చీకట్లోకి నెడుతున్న ఆ చికాక్కోపాలను చిటికెలో మరచి, ఆ డబ్బాను ఆస్వాదించడం మొదలుపెట్టాము. మా అమ్మానాన్న కాలపు, ‘తమ్ముడు’ సినిమాలో వయ్యారి భామ నీ హంస నడక, అక్కడ మొదలయ్యింది! మా ఒంటి మీద బద్దకాన్ని మొత్తం ముందు దులిపేసింది. ఆ తరువాత ఒక బృందావనం సోయగం అంటూ అసలే చలికాలమంటే చల్లని నీళ్ళలోకి ముంచేసింది. అప్పుడు, జల్లంత కవ్వింత కావలిలే, వొళ్ళంత తుళ్ళింత రావాలిలే అంటూ వొంట్లో మురికంతా వదలగొట్టేసింది. గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా అంటూ మొత్తానికి ఓ ఊపు ఊపేసిందనుకో. ఆఖరున, జాము రాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, అంటూ నిద్రపుచ్చింది.
అలా మొత్తానికి లోరియల్‌ పారిస్‌ షాంపూ అడ్వర్టైస్మెంట్‌, ఫైవ్‌ ప్రాబ్లమ్స్‌ కు అందించే వన్‌ సొల్యూషన్‌ లాగా, మా లక్షా తొంభై ప్రాబ్లమ్స్‌కు ఏకైక సమాధానమై ఆదుకుంది. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, కొత్త జ్ఞాపకాలను తయారుచేస్తూ రాత్రంతా పాపం విశ్రాంతే తీసుకోకుండా పాడుతూనే ఉంది. ఆ పాడుబడ్డ రేడియో, ఎప్పటి రుణం తీర్చుకుందామనో మరి.

సాయి మల్లిక పులగుర్త

[email protected]

➡️